హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే కేంద్రం ‘టీజీ’ సిరీస్‌ను నోటిఫై చేసిన విషయం తెలిసిందే. కానీ టీఎస్ సిరీస్ కావాలని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరటంతో కేంద్రం మళ్లీ దాన్ని మార్చే పనిలో పడింది. తెలుగు అక్షరాల్లో ‘స’ అక్షరాన్ని శుభకరంగా భావించే కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌లో కూడా ‘స’ ధ్వనించేలా ‘ఎస్’ అనే ఆంగ్ల అక్షరం ఉండాలని భావిం చినట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. టీఎస్ పొడి అక్షరాలు ‘తెలంగాణ స్టేట్’ అనే పదానికి ప్రతిబింబంగా ఉంటున్నందున దాన్నే ఖాయం చేయాలని విజ్ఞప్తి చేయటంతో కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజుల క్రితం టీజీ సిరీస్‌ను నోటిఫై చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి స్థానిక రవాణా శాఖాధికారులకు సమాచారం రావటంతో వారు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇప్పుడు సిరీస్ మార్పుపై వార్తలు వస్తుండటంతో స్పష్టత కోసం అధికారులు ఢిల్లీలోని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించారు. దీంతో టీజీ ఉంటుందా టీఎస్ ఉంటుందా అన్న విషయంలో అయోమయం నెలకొందని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు సాక్షితో చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, లేదంటే సోమవారం వస్తుందని తెలిపారు. జిల్లాల వారీగా నంబర్ సిరీస్‌ను ప్రస్తుతానికి పాతదే కొనసాగించే వీలుందన్నారు.