
‘సెంచరీ’ దొంగ మళ్లీ చిక్కాడు...!
పేరు: హజీబాబా
వృత్తి: ఆటో డ్రైవర్
ప్రవృత్తి: జేబుదొంగతనాలు
చేసిన చోరీలు: వందకు పైగానే
చిలకలగూడ: దొంగతనాల్లో సెంచరీ చేసి కొన్నేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఘరానా జేబుదొంగను ఎట్టకేలకు మహంకాళి పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నార్త్‌జోన్ డీసీపీ జయలక్ష్మీ గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. చిలకలగూడ హమాలీబస్తీకి చెందిన షేక్ హజీబాబా అలియాస్ హజీ (45) ఆటోడ్రైవర్. జల్సాలకు అలవాటు పడ్డ హజీ జేబు దొంగతనాలు ప్రవృత్తిగా ఎంచుకున్నాడు.
బస్సుల్లో తిరుగుతూ వందకు పైగా చోరీలకు పాల్పడ్డాడు. మరికొంతమంది జేబుదొంగలను కలుపుకుని హజీగ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. చిలకలగూడ పీఎస్‌లో క్రిమినల్ డోషియర్( సీడీసీ)గా నమోదయ్యాడు. మహంకాళి, మారేడుపల్లి, చిలకలగూడ తదితర ఠాణాల్లో హజీపై కేసులున్నాయి.
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట క్రాస్‌రోడ్ వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న హజీబాబాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తన చోరీల చిట్టా విప్పాడు. ఇతడి వద్ద నుంచి రూ.52 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హజీని గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.