సాక్షి, మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్‌టీ (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)ల నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఐటీడీఏల ఆధ్వర్యంలో అధికారులు నిరుద్యోగ యువతీయువకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలిచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు తీసుకొని అర్హతల్లేని వారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరానికి 48 మంది అభ్యర్థులను సీఆర్టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా.. కనీసం కలెక్టర్ అనుమతి తీసుకోకుండా ఈ నియామకపు ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ఐటీడీఏలో ఏటీడబ్ల్యూవోలుగా పనిచేసిన అధికారులు కీలకంగా వ్యవహరించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసి, అడ్డదారుల్లో నియామకాలు తెలుస్తోంది. వీరిలో 22మంది సీఆర్టీలను మహబూబాబాద్ జిల్లాకు, 16 మందిని భూపాలపల్లి జిల్లాకు, నలుగురిని వరంగల్ అర్బన్ జిల్లాకు, నలుగురిని రూరల్ జిల్లాకు, ఇద్దరిని జనగామ జిల్లాకు కేటాయించారు.
ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేవ్ వీరంతా గత విద్యా సంవత్సరం మొత్తం పాఠశాలల్లో పనిచేసినా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా 48 మందిలో 36 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు. మిగతా వారిని తీసుకోలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేసిన సీఆర్టీలు కూడా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.
అర్హతల్లేని వారికి ఉద్యోగాలు
ప్రస్తుత విద్యా సంవత్సరానికిగానూ ఆశ్రమ పాఠశాలల్లో నియమించిన సీఆర్టీల్లో పలువురికి అర్హతలు లేకున్నా ఉద్యోగాల్లో నియమించినట్టు అవగతమవుతోంది. ఇంటర్, టీటీసీ చదివిన వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో, తెలుగు పండిట్ చదివిన వారిని గణితం స్కూల్ అసిస్టెంట్‌గా నియమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కలెక్టర్ ప్రీతిమీనా ఇటీవల మహబూబాబాద్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఓ సీఆర్‌టీతో ఇంగ్లిషు పాఠం చదివించారు. సరిగా చదవడం రాకపోవడంతో విస్మయం చెందారు. సీఆర్టీలు అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందుతున్నారనే నిర్థారణకు వచ్చిన ఆమె, త్వరలో జిల్లాలోని సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్షను నిర్వహించాలని, వారి సర్టిఫికెట్లను పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చారు.
విచారణ జరుగుతోంది
సీఆర్టీల నియామకంపై ఆరోపణలు రావడంతో కలెక్టర్‌కు నివేదించాం. వేతనాలు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంపై కలెక్టర్‌కు రాశాం. విచారణ జరుపుతున్నారు. సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని నియమించుకొని మిగతా వారిని పక్కకు పెట్టడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనలో కలెక్టర్ ఉన్నారు.
– నారాయణస్వామి, డీటీడబ్ల్యూవో, మహబూబాబాద్
Comments
Please login to add a commentAdd a comment