contract residential teachers
-
సీఆర్టీల నియామకాల్లో అక్రమాలు!
సాక్షి, మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సీఆర్టీ (కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)ల నియామకాల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఐటీడీఏల ఆధ్వర్యంలో అధికారులు నిరుద్యోగ యువతీయువకుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేసి ఉద్యోగాలిచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు తీసుకొని అర్హతల్లేని వారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2016–17 విద్యా సంవత్సరానికి 48 మంది అభ్యర్థులను సీఆర్టీలుగా నియమించారు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా.. కనీసం కలెక్టర్ అనుమతి తీసుకోకుండా ఈ నియామకపు ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ఐటీడీఏలో ఏటీడబ్ల్యూవోలుగా పనిచేసిన అధికారులు కీలకంగా వ్యవహరించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేసి, అడ్డదారుల్లో నియామకాలు తెలుస్తోంది. వీరిలో 22మంది సీఆర్టీలను మహబూబాబాద్ జిల్లాకు, 16 మందిని భూపాలపల్లి జిల్లాకు, నలుగురిని వరంగల్ అర్బన్ జిల్లాకు, నలుగురిని రూరల్ జిల్లాకు, ఇద్దరిని జనగామ జిల్లాకు కేటాయించారు. ఏడాదిన్నర కాలంగా వేతనాల్లేవ్ వీరంతా గత విద్యా సంవత్సరం మొత్తం పాఠశాలల్లో పనిచేసినా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా 48 మందిలో 36 మందిని మాత్రమే రెన్యూవల్ చేశారు. మిగతా వారిని తీసుకోలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెన్యూవల్ చేసిన సీఆర్టీలు కూడా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అర్హతల్లేని వారికి ఉద్యోగాలు ప్రస్తుత విద్యా సంవత్సరానికిగానూ ఆశ్రమ పాఠశాలల్లో నియమించిన సీఆర్టీల్లో పలువురికి అర్హతలు లేకున్నా ఉద్యోగాల్లో నియమించినట్టు అవగతమవుతోంది. ఇంటర్, టీటీసీ చదివిన వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో, తెలుగు పండిట్ చదివిన వారిని గణితం స్కూల్ అసిస్టెంట్‌గా నియమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ప్రీతిమీనా ఇటీవల మహబూబాబాద్‌లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సమయంలో ఓ సీఆర్టీతో ఇంగ్లిషు పాఠం చదివించారు. సరిగా చదవడం రాకపోవడంతో విస్మయం చెందారు. సీఆర్టీలు అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందుతున్నారనే నిర్థారణకు వచ్చిన ఆమె, త్వరలో జిల్లాలోని సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్షను నిర్వహించాలని, వారి సర్టిఫికెట్లను పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చారు. విచారణ జరుగుతోంది సీఆర్టీల నియామకంపై ఆరోపణలు రావడంతో కలెక్టర్‌కు నివేదించాం. వేతనాలు చెల్లించాలా.. వద్దా.. అనే విషయంపై కలెక్టర్‌కు రాశాం. విచారణ జరుపుతున్నారు. సీఆర్టీలందరికీ సామర్థ్య పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని నియమించుకొని మిగతా వారిని పక్కకు పెట్టడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనే ఆలోచనలో కలెక్టర్ ఉన్నారు. – నారాయణస్వామి, డీటీడబ్ల్యూవో, మహబూబాబాద్ -
సీఆర్టీలకు పరీక్షే !
వచ్చే నెల 3న పెర్ఫార్మెన్స్ టెస్టు నిర్వహించాలని నిర్ణయం ► ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ► కేజీబీవీల్లో పనిచేసే ఉపాధ్యాయులకు రెన్యువల్ గండం ► ఏడేళ్ల బోధనకు ఫలితం ఇదేనా అంటున్న సీఆర్టీలు సాక్షి, ఖమ్మం: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీ (కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్)లకు ఇప్పుడు రెన్యువల్ గండం పట్టుకుంది. ఏడేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిన బోధన చేస్తున్న వీరికి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఉత్తర్వులతో దడ పుడుతోంది. సీఆర్టీలుగా పనిచేస్తున్న వారికి పెర్ఫార్మెన్స్ టెస్టు (పనితీరు అంచనా పరీక్ష) నిర్వహించాలని ఇందులో పేర్కొన్నారు. జూన్ 3న అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ టెస్టు నిర్వహించాలని డీఈఓలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశించారు. అయితే తమ బోధనతో కేజీబీవీల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని.. ఇంకా పెర్ఫార్మెన్స్ టెస్టు ఎందుకని సీఆర్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 13 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో 2,352 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.వీటిల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన చేసేందుకు రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి. గణితం, సోషల్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తోపాటు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సీఆర్టీలు, ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలు, ఏఎన్ఎం, వంట మనుషుల, వాచ్మెన్లను నియమించారు. వీరిపై పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిని కూడా నియమించారు. పీజీ, బీఈడీ అర్హత ఉన్న వారిని సబ్జెక్టు సీఆర్టీలుగా నియమించి నెలకు రూ.15వేలు వేతనం అందజేస్తున్నారు. ఇలా జిల్లాలో 91 మంది సీఆర్టీలు పనిచేస్తున్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి( ప్రిన్సిపల్) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్ఎస్ఏ అధికారులు రెన్యువల్ చేస్తూ వచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి పనితీరు అంచనా పరీక్ష పెట్టాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కేజీబీవీలు ప్రారంభించినప్పుడు అర్హతలు, డెమో పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్న సీఆర్టీలను ప్రతీ సంవత్సరం సర్వశిక్ష అభియాన్ అధికారులు ఏ అడ్డంకి లేకుండా రెన్యువల్ చేస్తూ వచ్చారు. అయితే ఈనెల 24న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ జారీ చేసిన ఉత్తర్వులతో సీఆర్టీలు లబోదిబోమంటున్నారు. నిఘా నీడలో జిల్లా కేంద్రంలో.. వచ్చేనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనుండడంతో ఈప్రక్రియ అంతా పూర్తి చేయాలనే ఆలోచనతో జూన్ 3న సీఆర్టీలకు జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహించనున్నారు. డీఈఓ, ఎక్స్ అఫీషియో, పీఓ, ఎస్ఎస్ఏ, సెక్టోరియల్ అధికారులకు పరీక్ష నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, అన్ని వసతులు ఉండేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం విశేషం. పరీక్ష కేంద్రానికి నిర్దేశించిన సమయానికి గంట ముదు రావాలని, వచ్చేటప్పుడు పాఠశాల ప్రత్యేకాధికారి నుంచి పొందిన గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. పరీక్ష వ్యాసరూప, షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ రూపంలో ఉంటుందని, పరీక్ష రాసేందుకు సీఆర్టీలు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్స్ అఫిషియో ప్రాజెక్టు ఆధికారి జి.కిషన్ పేరున ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ టెస్టులో అర్హత సాధించని సీఆర్టీలను ఇంటిబాట పట్టించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టెస్టు రద్దు చేయాలంటున్న సీఆర్టీలు.. ఓవైపు టెస్టు నిర్వహిస్తే అర్హత సాధించకపోతే ఎలా..? అని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆందోళన.. ఏడేళ్లుగా ఏ ఇబ్బంది లేకుండా పనిచేసిన సీఆర్టీలకు ఇప్పుడు పనితీరు అంచనా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షను రద్దు చేయాలని యూటీఎఫ్, కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగు సంఘం, ఇతర ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ఆచార్యను కలిసి సీఆర్టీల వివరాలు, వారు పనిచేస్తున్న తీరును వివరించినట్లు తెలిసింది. అయితే పరీక్షలు తాత్కాలికంగా వాయిదా వేసేలా చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయ సంఘాలకు ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సీఆర్టీల పరీక్షల ఉత్తర్వు రద్దు చేయాలని, లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన బాట పడతామని డిమాండ్ చేస్తున్నారు. -
ఆశ్రమాల్లో బోధనకు బ్రేక్
ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధనకు బ్రేక్ పడింది. డిమాండ్ల సాధన కోసం సీఆర్టీలు(కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు) ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టడంతో చదువు ముందుకు సాగడం లేదు. అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో గిరిజన విద్య కుంటుపడుతుండగా.. సీఆర్టీల ఆందోళన పదో తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 34వేల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలోని 71 ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. 2,683 ఉపాధ్యాయ పోస్టులుండగా ఇందులో 645 ఖాళీలతోపాటు 2013లో మంజూరైన మరో 569 ఖాళీలున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1,200 సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఆర్టీలు విధులు బహిష్కరించి ఆరు రోజులుగా ఐటీడీఏ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఆర్టీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.5,500, ఎస్జీటీలకు రూ.4,500 ఐటీడీఏ చెల్లిస్తున్నా చాలీచాలని వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితాలపై ప్రభావం గత విద్యాసంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఎన్నటూ లేనంత దారుణంగా 35.55శాతానికి పడిపోయాయి. దీని దృష్ట్యా అధికారులు మొదటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ తరగతులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కొద్ది రోజుల క్రితం కలెక్టర్ జగన్మోహన్ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో సీఆర్టీలు ఆందోళన బాట పట్టడం పదో తరగతి విద్యార్థులు, వార్షిక పరీక్షల్లో సాధించే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మార్చిలో వార్షిక పరీక్షల నిర్వహణ ఉండగా అంతకుముందు అర్ధ వార్షిక, యూనిట్ తదితర పరీక్షల నిర్వహణ ఉంది. సీఆర్టీలు ఆందోళనబాట పట్టడంతో ఆశ్రమాల్లో బోధించేవారు కరువయ్యారు. ఉపాధ్యాయులు తప్పా మిగితా సమయంలో పాఠ్యాంశాలు బోధించే వారు లేక తరగతి గదులు వెలవెలబోతున్నాయి. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. సర్వీస్‌తో సంబంధం లేకుండా సీఆర్టీలందరినీ క్రమబద్ధీకరించాలి. కేజీబీవీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860, ఎస్జీటీలకు రూ.10,900 వేతనం చెల్లిస్తున్నట్లుగానే సీఆర్టీలకు చెల్లించాలి. పతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి. సీఆర్టీలకు సంవత్సరానికి 22 సీఏల్ మంజూరు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా సీఆర్టీలకు ప్రసుతి సెలవులు ఇవ్వాలి. నాలుగు నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.