ఆశ్రమాల్లో బోధనకు బ్రేక్
ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధనకు బ్రేక్ పడింది. డిమాండ్ల సాధన కోసం సీఆర్టీలు(కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు) ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టడంతో చదువు ముందుకు సాగడం లేదు. అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో గిరిజన విద్య కుంటుపడుతుండగా.. సీఆర్టీల ఆందోళన పదో తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 34వేల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వీటిలోని 71 ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. 2,683 ఉపాధ్యాయ పోస్టులుండగా ఇందులో 645 ఖాళీలతోపాటు 2013లో మంజూరైన మరో 569 ఖాళీలున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1,200 సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఆర్టీలు విధులు బహిష్కరించి ఆరు రోజులుగా ఐటీడీఏ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఆర్టీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.5,500, ఎస్జీటీలకు రూ.4,500 ఐటీడీఏ చెల్లిస్తున్నా చాలీచాలని వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫలితాలపై ప్రభావం
గత విద్యాసంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఎన్నటూ లేనంత దారుణంగా 35.55శాతానికి పడిపోయాయి. దీని దృష్ట్యా అధికారులు మొదటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ తరగతులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కొద్ది రోజుల క్రితం కలెక్టర్ జగన్మోహన్ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో సీఆర్టీలు ఆందోళన బాట పట్టడం పదో తరగతి విద్యార్థులు, వార్షిక పరీక్షల్లో సాధించే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
మార్చిలో వార్షిక పరీక్షల నిర్వహణ ఉండగా అంతకుముందు అర్ధ వార్షిక, యూనిట్ తదితర పరీక్షల నిర్వహణ ఉంది. సీఆర్టీలు ఆందోళనబాట పట్టడంతో ఆశ్రమాల్లో బోధించేవారు కరువయ్యారు. ఉపాధ్యాయులు తప్పా మిగితా సమయంలో పాఠ్యాంశాలు బోధించే వారు లేక తరగతి గదులు వెలవెలబోతున్నాయి. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.
సర్వీస్‌తో సంబంధం లేకుండా సీఆర్టీలందరినీ క్రమబద్ధీకరించాలి.
కేజీబీవీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860, ఎస్జీటీలకు రూ.10,900 వేతనం చెల్లిస్తున్నట్లుగానే సీఆర్టీలకు చెల్లించాలి.
పతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి.
సీఆర్టీలకు సంవత్సరానికి 22 సీఏల్ మంజూరు చేయాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి.
మహిళా సీఆర్టీలకు ప్రసుతి సెలవులు ఇవ్వాలి.
నాలుగు నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి.