7 మండలాలు సీమాంధ్రకు | Cetre approval to polavaram ordinance | Sakshi
Sakshi News home page

7 మండలాలు సీమాంధ్రకు

Published Thu, May 29 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

Cetre approval to polavaram ordinance

* ‘పోలవరం ఆర్డినెన్స్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం
* ముంపు మండలాలపై నేడో రేపో ఉత్తర్వులు జారీ
* ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు తెలంగాణకు
* భద్రాచలం పట్టణం, రామాలయం కూడా
 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంబంధిత ఫైలు బుధవారం రాష్ట్రపతి కార్యాలయానికి చేరడం, దానిపై ఆయన సంతకం చేయడం కూడా జరిగిపోయినట్టు పలు చానళ్లలో బుధవారం సాయంత్రం వార్తలుచ్చాయి. ఆర్డినెన్స్ నేడో రేపో జారీ కానుందని విశ్వసనీయ సమాచారం.

నిజానికి విభజన బిల్లు గతంలో రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటన మేరకు గత కేంద్ర కేబినెట్ మార్చి 2వ తేదీనే ఆర్డినెన్స్ నిర్ణయం తీసుకుంది. కానీ సంబంధిత ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేయలేదు. మంత్రిమండలి సమావేశం జరిగిన 3 రోజులకే మార్చి 5న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం తెలిసిందే. పైగా విభజన చట్టం అమల్లోకైనా రాకముందే మళ్లీ సవరణ తేవడం సమంజసం కాదన్న యోచనతో రాష్ట్రపతి అప్పుడు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలుపకుండా ఫైలు తిప్పి పంపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు... గత మంత్రిమండలి నిర్ణయాన్ని అమలు చేసేందుకు మోడీ కేబినెట్ పూనుకుంది. మంగళవారం తన తొలి భేటీలోనే సంబంధిత ఫైలును మళ్లీ ఆమోదించి బుధవారం రాష్ట్రపతికి పంపింది. మంగళవారం నాటి మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన సందర్భంగా కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ఆర్డినెన్స్ తదితరాలపై ప్రశ్నించగా, అసలు పోలవరంపై చర్చే జరగలేదని చెప్పడం తెలిసిందే.

ఆర్డినెన్స్‌లో ఏముంది..
పోలవరం నిర్వాసితులకు సొంత మండలంలోనే భూమికి బదులు భూమి లభించేలా పునరావాస ప్యాకేజీని అమలు చేసేందుకు ఆర్డినెన్స్ దోహదపడుతుంది. ఇందుకోసం మండలాలను యూనిట్‌గా తీసుకుని నిర్వాసిత ప్రాంతాలను యూపీఏ-2 సర్కారు సీమాంధ్రలో కలిపింది. అయితే భద్రాచలానికి దారినిచ్చే బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను, భద్రాచలం పట్టణాన్ని మాత్రం తెలంగాణలోనే ఉంచింది. ఈ విషయమై మార్చి 2న జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రానికి చెందిన అప్పటి మంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, కావూరి సాంబశివరావు, పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ పాల్గొన్నారు. ఏడు పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపాలన్న అంశంపై చర్చ జరిగింది. దాన్ని జైపాల్ తీవ్రంగా వ్యతిరేకించారు.

విభజన బిల్లులో ఇలా...
నిజానికి భద్రాచలం పట్టణం, రామాలయం మినహా ఏడు మండలాల్లోని రెవెన్యూ గ్రామాలను మాత్రమే విభజన బిల్లులో చేర్చారు. ముంపు గ్రామాల జీవోను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ కేవలం ముంపు గ్రామాలను మాత్రమే కలిపితే నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలంటే సీమాంధ్ర రాష్ట్రానికి కష్టమవుతుందన్న అక్కడి ప్రజాప్రతినిధుల డిమాండ్ మేరకు అప్పటి కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అప్పట్లో రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. నిర్వాసితుల పునరావాసం విషయంలో అవసరమైన అన్ని చర్యలూ కేంద్రం తీసుకుంటుందని అందులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రెవెన్యూ గ్రామాలను కాకుండా పూర్తిగా మండలాలనే సీమాంధ్రకు ఇస్తే భూమికి బదులు భూమిని సొంత మండలంలోనే ఇవ్వొచ్చని యూపీఏ-2 సర్కారు భావించింది. ఆ మేరకు మండలాలను యూనిట్‌గా తీసుకునేందుకు మార్చి 2న జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించింది. కానీ దీన్ని జైపాల్ తప్పుబట్టారు. మండలాలన్నింటినీ ఇచ్చేస్తే భ ద్రాచలం పట్టణానికి తెలంగాణతో అనుసంధానం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాంతో అనుసంధానానికి అవసరమైన బూర్గంపాడు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను తెలంగాణలోనే ఉంచేందుకు కేబినెట్ తీర్మానించి, ఆ మేరకు చట్ట సవరణ చేయాలని భావించింది.
 
 ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లే మండలాలివీ...
 పాల్వంచ రెవెన్యూ డివిజన్:
 కుకునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు (పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, నకిరిపేట, సోంపల్లి రెవెన్యూ గ్రామాలు మినహా. ఈ 12 గ్రామాలూ తెలంగాణకు వెళ్తాయి)

 భద్రాచలం రెవెన్యూ డివిజన్:
 చింతూరు, కూనవరం, వీఆర్ పురం, భద్రాచలం
 (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) మండలాలు
 భద్రాచలం టౌన్, రామాలయం తెలంగాణలో ఉంటాయి

 ఎందుకీ నిర్ణయం?
 దీనివల్ల ముంపు, పునరావాస ప్రాంతాలు రెండూ సీమాంధ్రలోనే ఉంటాయి. కాబట్టి ముంపు బాధితులు తాము కోల్పోయే భూమికి బదులుగా సొంత మండలంలోనే భూమి పొందుతారు. తద్వారా పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలూ ఉండవు.
 
ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దు: రాష్ట్రపతికి కేసీఆర్ లేఖ
‘పార్లమెంటు ఆమోదంతో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలోని 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సును ఆమోదించకండి’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు లేఖ రాశారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ధిక్కరిస్తూ నరేంద్ర మోడీ సర్కారు ఇలా ఆర్డినెన్స్ తేవడం పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనన్నారు.

‘‘రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదించింది. అందులో పార్లమెంట్ నిర్దేశించిన రాష్ట్రాల సరిహద్దులను మార్చేలా ప్రధాని ఆర్డినెన్స్ తేవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మార్చకుండా, ఆంక్షలు లేకుండా ఉండేలా కృషి చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్‌కు ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టారు. వారెన్నుకున్న ప్రజా ప్రభుత్వం జూన్ 2 నుంచి ఏర్పాటవనుంది. కానీ అలా ప్రభుత్వం ఏర్పాటవకముందే సరిహద్దులను మార్చడం రాజ్యాంగ విరుద్ధం. అప్రజాస్వామికం. వారం రోజుల్లో పార్లమెంటు కొలువుదీరనుండగా ఆర్డినెన్స్ తేవడం సరికాదు’’ అని పేర్కొన్నారు.

ఇది కేసీఆర్ అనవసర రాద్ధాతం: మురళీధర్ రావు
పోలవరం ముంపు గ్రామాలపై రాజ్యసభలో చర్చించి తీసుకున్న తుది నిర్ణయం మేరకే ఆర్డినెన్స్ రూపొందుతుంది. యూపీఏ హయాంలో ఈ కసరత్తు జరిగింది. దాన్ని ఆర్డినెన్స్‌గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇపుడు ఆ తంతే జరిగింది. ఇందులో కొత్త విషయమేమీ లేదు. ముంపు గ్రామాలకు సంబంధించి రాజ్యసభలో  తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో అన్ని పార్టీలు ఆమోదించాయి. ఆ తరవాతనే,.. తెలంగాణ బిల్లు ఆమోదం నేపథ్యంలో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో సోనియాగాంధీ నివాసానికి వెళ్లి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డినెన్స్‌పై ఇపుడు కేసీఆర్ చేసే రాద్ధాంతం, మోడీపై బురద జల్లేందుకే. దీన్ని ప్రజలు హర్షించరు. తెలంగాణ  సాకారమయ్యే దిశలో పట్టువిడుపుల ధోరణితోనే పోలవరం ముంపు గ్రామాలపై నిర్ణయం తీసుకున్నారు.
 - మురళీధర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement