సంగారెడ్డిలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి (ఫైల్)
సాక్షి, సంగారెడ్డి: వామపక్షాలు చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. జిల్లాలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం, భారతీయ జనతా పార్టీ అధికశాతం పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతున్న క్రమంలో వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాటా లతో బలోపేతమయ్యేందుకు ప్రయత్ని స్తున్నాయి. వీటితోపాటు అనుబంధ సంఘా లు సైతం నిరంతరం ప్రజా సమస్యలపై, కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి చేరువవుతున్నాయి. వామపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తక్కువగా ఉన్నప్పటికీ సమస్యల పోరాటంలో ఆ పార్టీ యే ముందుంటోంది. ముఖ్యంగా కార్మికులకు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది, పంచాయతీ పారిశుధ్య కార్మికులు.. ఇలా సమాజంలోని పలు వర్గాల పోరాటాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వారి మన్నన చూరగొంటున్నారు.
కార్మికులకు, ప్రజలకు అండగా..
సీపీఎం, సీపీఐ పార్టీలతోపాటు వాటి అనుబంధ సంఘాలు కార్మికులకు, ప్రజలకు అండగా ఉంటున్నాయి. కార్మికులు, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నాయి. సమాజంలోని ఏ వర్గానికి అన్యాయం జరిగినా, కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, నిరసనలు తెలిపినా వారికి మద్ధతుగా నిలుస్తున్నాయి. అదే విధంగాఅంగన్‌వాడీ వర్కర్లు, పంచాయతీ పారిశుధ్య వర్కర్ల సమస్యల పరిష్కారానికి అనుబంధ సంఘాలు ప్రత్యక్షంగా వారితో కలిసి పోరాటం చేస్తున్నాయి. సీపీఐకి అనుబంధంగా ఏఐటీయూసీ, రైతు సంఘాలు, ఏఐఎస్‌ఎఫ్, మహిళా సమాఖ్య, బీకేఎం, ఏవైఎఫ్‌లు ఉన్నాయి.
అదే విధంగా సీపీఎంకు అనుబంధంగా సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, మహిళా సంఘాలు, హమాలీ వర్కర్స్, తాపీ మేస్త్రీలు, మోటార్ వెహికిల్స్ యూనియన్లు ఉండి ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ఆర్టీసీ కార్మికులు గడిచిన 50రోజులుగా చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతునిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కొత్త బస్‌స్టేషన్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమాలకు నిరంతరం హాజరవుతున్నారు. వారికి పూర్తిస్థాయి మద్దతు తెలియజేస్తున్నారు. వారి తరఫున నిరసన గళం వినిపిస్తున్నారు. అనుబంధ సంఘాల్లోని కళాకారులు పాటలు, ఆటల ద్వారా ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం ప్రకటిస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతున్నారు.
అదే విధంగా విద్యుత్ ఉద్యోగులకు కూడా అండగా నిలుస్తున్నారు. డబుల్‌బెడ్ రూం ఇళ్ల మంజూరు, రైతుబంధు డబ్బు ఖాతాల్లో జమకాని వారికోసం అధికారులకు ప్రజల తరఫున విన్నవిస్తున్నారు. ప్రధాన సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అదే విధంగా జిల్లాలోని పటాన్‌చెరు, జహీరాబాద్, సదాశివపేట్, తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలు, ఖార్ఖానాలు అధికంగా ఉన్నాయి. వీటిలో పనిచేసే కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగినా, యాజమాన్యాలు వేధించినా వీరు కలుగజేసుకొని న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, అవర్ బేస్డ్ ఉద్యోగులు, పార్ట్ టైం, తదితర రెగ్యులర్ కాని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సైతం వామపక్ష, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం వీరు పోరాటాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. రోజు రోజుకూ ప్రజల్లో అభిమానం సంపాదించుకుంటూ వామపక్ష పార్టీలు పుంజుకుంటున్నాయి. వామపక్ష, అనుబంధ పార్టీలు మాత్రం ప్రజల్లో, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, తదితర ఉద్యోగుల మన్ననలు పొందడానికి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే విషయాలు పార్టీ నిర్ణయం మేరకే ఉంటాయని పార్టీ నాయకుడొకరు తెలిపారు.
జిల్లా వేదికగా రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు
జిల్లా వేదికగా వామపక్ష, అనుబంధ సంఘాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇటీవల అంగన్‌వాడీ రాష్ట్ర మూడవ మహాసభలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సభలకు అంగన్ వాడీ వర్కర్స్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి సింధు, తదితర ప్రముఖులు హాజరయ్యారు. గత నెలలో రైతు శిక్షణ రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మూడు రోజులపాటు స్థానిక కేవల్‌కిషన్ (కేకే) భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో రైతుసంఘం నేతృత్వంలో నిర్వహించారు. గత నెలలోనే ఏఐటీయూసీ ఆవిర్భావ ఉత్సవాలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. 50 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు హాజరవుతూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment