టీఆర్‌ఎస్‌ది ఒంటెత్తు పోకడ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సప్తగిరి కాలనీ(కరీంనగర్): టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒంటెత్తు పోకడలతో ప్రతిపక్షాలను అణచివేయాలనే ధోరణితో వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నేరెళ్ల ఘటన జరిగిన నెల రోజుల తరువాత కేటీఆర్ బాధితులను పరామర్శించడానికి రావడం కపట ప్రేమేనని అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం రీ డిజైన్‌ల పేరుతో రూ. వందల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు.
పునరుజ్జీవ సభ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తూ కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంపై దాడి అమానుషమని అసలు తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చిందా? అన్నట్లుగా అనిపిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 21న సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.