
మనీలా అంతర్జాతీయ సదస్సుకు చాడ
సాక్షి, హైదరాబాద్: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హాజరుకానున్నారు. ఈ నెల 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు తెలంగాణ నుంచి చాడతోపాటు కె.యాదవరెడ్డి (టీఆర్‌ఎస్), ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి (టీపీసీసీ) హాజరవుతున్నట్లు సమాచారం. వీరితోపాటు సీపీఎం నుంచి మాజీ ఎంపీ నీలోత్పల్‌బసు హాజరుకానున్నారు.
ఆల్ ఇండియా పీపుల్స్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ (అయిప్సో) ప్రతినిధి బృందంలో సభ్యులుగా వీరు గురువారం రాత్రి ఇక్కడి నుంచి మనీలా బయలుదేరనున్నారు. క్యూబాపై ఆర్థిక, వాణిజ్య తదితర ఆంక్షలను అమెరికా, ఇతర దేశాలు విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశానికి సంఘీభావంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు.