
చైర్‌పర్సన్ సునీత రాజీనామా లేఖ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి పదవికి రాజీనామా చేశారు. సునీతారాణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె తన రాజీనామాను కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్‌కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ఒక వాక్యంతో కూడిన లేఖను కలెక్టర్‌కు అందజేసి, రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు.
చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం రాకుండా చూసేందుకు, క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాష్ట్ర మంత్రుల స్థాయిలో ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు. చివరికి తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేకంగా కౌన్సిల్‌ను సమావేశపరిచే అర్హత కలెక్టర్‌కు లేదని మంగళవారం చైర్‌పర్సన్ సునీతారాణి ఏకంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే 28 మంది సభ్యులు కలిసి ఒక కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేశారని కూడా హైకోర్టుకు నివేదిస్తూ తనపై అవిశ్వాసం పెట్టిన తీర్మానాన్ని తిరస్కరించాలని కోరారు.
అయితే కోర్టులో కూడా సునీతారాణికి చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో గురువారం జరిగే కౌన్సిల్ సమావేశంలో తనకు ఓటమి తప్పదని నిర్ణయించుకున్న ఆమె కలెక్టర్ కార్యాలయంలో రాజీనామా అందజేశారు. ఈ లేఖను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్ గురువారం నాటి కౌన్సిల్‌కు అధ్యక్షత వహించే బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు పంపించారు.
రాజీనామా చేసినా... కౌన్సిల్‌లోనే ఆమోదం
గురువారం నాటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో చైర్‌పర్సన్‌గా తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఖాయమని భావించిన సునీతారాణి ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. అయితే కౌన్సిల్‌లో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు తేదీ ఖరారైన నేపథ్యంలో రాజీనామాను ఆమోదించే అధికారం కలెక్టర్‌కు లేదు. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమయిన వెంటనే మున్సిపల్ కమిషనర్ రాజు కౌన్సిల్‌లోని సభ్యులకు చైర్‌పర్సన్ రాజీనామా విషయాన్ని తెలియజేస్తారు.
ఈ రాజీనామాకు సభ్యులంతా సమ్మతం తెలిపితే అవిశ్వాసంపై ఓటింగ్ జరపకుండానే సభను వాయిదా వేస్తారు. కౌన్సిల్ సమావేశమైనప్పుడు ఒకవేళ సాంకేతిక కారణాలతో రాజీనామా లేఖ అంశం సభ దృష్టికి తీసుకురాని పక్షంలో అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుంది. అవిశ్వాసంపై ఓటింగ్ చేపట్టే ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి మాత్రమే సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ నేతృత్వం వహిస్తారు. రాజీనామా అంశం సభ దృష్టికి వస్తే ఆయన అవసరం ఉండదు.
నెల పదిరోజుల్లో ఎన్ని మలుపులో...
రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లు, ఎంపీపీలు అవిశ్వాస సమస్యను ఎదుర్కొన్నా... బెల్లంపల్లిలో జరిగినంత రచ్చ ఎక్కడా లేదు. అవిశ్వాస నోటీసు ఇవ్వడానికి పది రోజుల ముందే జూన్ 23వ తేదీన 29 మంది కౌన్సిలర్లు రహస్య క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, ఇండిపెండెంట్ సభ్యులంతా ఈ క్యాంపులో ఉండడం విశేషం. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లను వెనక్కి రప్పించేందుకు ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన ప్రయత్నాలు, తదనంతర పరిణామాలు విమర్శలకు కారణమయ్యాయి.
ఎమ్మెల్యే చిన్నయ్య ఓ కౌన్సిలర్ కూతురిని ఫోన్‌లో బెరించడం, సింగరేణిలో ఉద్యోగం చేసే ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలను మణుగూరుకు బదిలీ చేయిస్తానని చెప్పి మరీ ఉత్తర్వులు ఇప్పించారు. 18వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి రాములును కిడ్నాప్ చేశారనే ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌లో ఐదుగురు అసమ్మతి సభ్యులు, ఓ నాయకుడిపై కేసు నమోదు అయ్యింది. వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment