కుర్చీలు ఖాళీ!
కలెక్టరేట్... జిల్లా పాలనా కేంద్రం..అందుకే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జనం ఇక్కడికి తరలివస్తారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అధికారుల ఎదుట బారులు తీరుతారు. కానీ మెతుకుసీమలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలనకంటూ దాదాపు అధికారులంతా వెళ్లిపోతుండడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వచ్చిన వివిధ గ్రామాల వారు నిరాశగా ఇంటిదారిపడుతున్నారు. దాదాపు ప్రతిరోజూ ఇదే తంతు కొనసాగుతుండడంతో అధికారుల తీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా అధికారులంతా దాదాపు ప్రతిరోజూ టూర్లలోనే ఉంటున్నారు. గ్రీవెన్స్‌సెల్ రోజైన సోమవారం మినహా మిగతా రోజుల్లో ఏ ఒక్క అధికారి కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. అదేమంటే సార్ టూర్‌లో ఉన్నారని అక్కడి సిబ్బంది నుంచి సమాధానం వస్తోంది. జిల్లాలో మరెక్కడైనా ఏ కార్యక్రమంలోైనె నా పాల్గొన్నారా? అంటే అదీ ఉండడం లేదు.
ఇక శని, ఆదివారాలు వచ్చాయంటే చాలు కలెక్టరేట్‌లో కనిపించే నాథుడే ఉండడు. దీంతో వ్యయప్రయాసలచోర్చి సమస్యలు చెప్పుకునేందుకు ఇక్కడు వచ్చే ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సమీకృత కలెక్టరేట్ భ వనంలోని అన్ని శాఖల కార్యాలయాలను సందర్శించగా దాదాపు 80 శాతం కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సార్ ఎక్కడంటే...టూర్‌లో ఉన్నాడని అక్కడి శాఖ సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ 20 రోజలుగా సెలవులో ఉండటంతో ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషా ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
దీంతో ఐసీడీఎస్ శాఖలో ఆమె కుర్చీ ఖాళీగా ఉంది. ఇక టీఎస్‌ఎంఐపీ శాఖ పీడీ రామలక్ష్మి, ఉద్యాన వన శాఖ పీడీగా అదనపు బాధ్యలు నిర్వహిస్తున్నారు. శనివారం ఆమె గుమ్మడిదల క్యాంప్‌లో ఉండడంతో ఆ కుర్చీ కూడా ఖాళీగానే కనిపించింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు సీహెచ్ శ్రీనివాస్‌లు సైతం శనివారం టూర్‌లోనే ఉన్నారు. డీఎస్‌డబ్ల్యుఓ ఎం.సత్యనారాయణ మనూరు మండల ప్రత్యేకాధికారిగా ఉండగా, ఆయన కూడా క్షేత్రస్థాయి పరిశీలనకంటూ సీటు వదిలి వెళ్లిపోయారు. సోషల్ వెల్ఫేర్ ఈఈ ఎం.అనిల్‌కుమార్, భూగర్భ జల శాఖ డిప్యూటీ డెరైక్టర్ జాన్ సత్యరాజ్‌లు సైతం క్యాంప్‌లోనే ఉన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్‌గా ఉన్న ఎం.శ్రీనివాస్‌రెడ్డి మూడు శాఖల బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన గిరిజన సంక్షేమ శాఖతో పాటు సంగారెడ్డి మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా సహకార అధికారి సాయికృష్ణుడు సైతం శనివారం టూర్‌లోనే ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీచరణ్‌దాస్ జిల్లా వెనుకబడిన త రగతుల సేవా సహకార సంస్థ ఈడీగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఆయన కూడా వివిధ సమావేశాల పేరుతో టూర్‌లోనే ఉన్నారు. యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి బి.శ్రీనివాసులు మూడు రోజులుగా సెలవులో ఉన్నారు.
వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు లక్ష్మణాచారి రామచంద్రపురం టూర్‌లో ఉన్నారు. ఇలా అధికారులంతా క్షేత్రస్థాయి పరిశీలనకంటూ జిల్లా కేంద్రాన్ని వీడి వెళ్తుండగా, కలెక్టరేట్‌లోని కింది స్థాయి సిబ్బంది తామేం తక్కువన్నంటూ ఎంచక్కా ఇంటికి చెక్కేస్తున్నారు. దీంతో వివిధ శాఖల సెక్షన్లలో మధ్యాహ్నం 12.30 గంటలనే కుర్చీలన్ని ఖాళీ అయిపోయాయి. దీంతో వివిధ సమస్యల పరిష్కారం కోసం ఎంతోఆశతో వచ్చిన పల్లెజనం తమ ప్రాప్తం ఇంతేనంటూ ఇంటిదారిపట్టారు.