మందుబాబులూ.. మీ జేబు జాగ్రత్త | Challans And Prison Punishment on Drunk And Drive Case Hyderabad | Sakshi
Sakshi News home page

చుక్కేస్తే చుక్కలే..

Published Sat, Dec 21 2019 7:58 AM | Last Updated on Sat, Dec 21 2019 7:58 AM

Challans And Prison Punishment on Drunk And Drive Case Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘‘వీకెండ్‌.. ఫ్రెండ్‌ పార్టీకి పిలిచాడు.. ఒకటి రెండు పెగ్గులేసి వాహనం డ్రైవ్‌ చేసుకుంటూ ఇంటికిపోదాం.. ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకుంటే మహా అయితే రూ.2 వేలు ఫైను కోర్టులో కట్టేస్తే సరి’’ అనుకుంటూ లైట్‌ తీసుకుంటే కుదరదు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న న్యాయస్థానాలు భారీ మొత్తం జరిమానాలు విధిస్తున్నాయి. ఇటీవల సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఓ మందుబాబుకు రూ.25 వేల జరిమానాతో పాటు మూడు రోజుల జైలు శిక్ష కూడా పడింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చిక్కిన ‘నిషా’చరులకు రూ.16 వేల నుంచి రూ.21 వేల వరకు జరిమానాలు విధించారు. ‘డిసెంబర్‌ 31’ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో డ్రంకన్‌ డ్రైవ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. సాధారణంగా పోలీసులు ట్రాఫిక్‌ ఉల్లంఘనల్ని మూడు రకాలుగా విభజిస్తుంటారు. వాహన చోదకుడికి మాత్రమే ముప్పుగా మారేవి. ఎదుటి వ్యక్తిని ముప్పుగా పరిగణించేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు తెచ్చేవి. మిగిలిని రెండింటి కంటే మూడో కోవకు చెందిన వాటిని ట్రాఫిక్‌ విభాగం అధికారులు తీవ్రంగా పరిగణిస్తారు.

మద్యం తాగి వాహనాలు నడపటం కూడా ఈ కోవకు చెందినదే కావడంతో స్పెషల్‌ డ్రైవ్స్‌ సహా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘నిషా’చరులకు జరిమానాతో పాటు జైలు శిక్షణ విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్‌ 185 ప్రకారం బుక్‌ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ట్రాఫిక్‌ పోలీసులు గతంలో ‘నిషా’చరులను ర్యాష్‌ డ్రైవింగ్‌ (సెక్షన్‌ 184బి) కిందే కేసు నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. ఆపై సెక్షన్‌ 185 ప్రకారం బుక్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ నుంచి వచ్చిన ప్రింట్‌ అవుట్‌ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ  ఉల్లంఘనకు ఈ ఏడాది ఆగస్టు వరకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించేవారు. అయితే, సెప్టెంబర్‌ 1 నుంచి భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తున్నారు. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగాడని లేదా పదేపదే మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కుతున్నాడని న్యాయమూర్తి భావిస్తే 2 నెలల వరకు జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు కౌంట్‌ చూపించిన వారికి, ఒకటి కంటే ఎక్కువ సార్లు చిక్కిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండడంతో భయపడిన కొందరు తమ వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసుల వద్దే వదిలేస్తున్నారు. ఈ తరహా 430 కార్లు/ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ఆయా ట్రాఫిక్‌ ఠాణాల్లో పడి ఉన్నాయి.  

భారీ జరిమానాల్లో కొన్ని..
ఈ ఏడాది సెప్టెంబర్‌ 22న అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన ద్విచక్ర వాహన చోదకుడికి న్యాయస్థానం రూ.25 వేల జరిమానా, మూడు రోజుల జైలు శిక్ష విధించింది.  
అక్టోబర్‌ 8న జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చిక్కిన వాహన చోదకుడిని కోర్టు రూ.21 వేలు జరిమానా విధించింది.
నగరంలోని వివిధ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో చిక్కిన పలువురు ‘నిషా’చరులకు కోర్టులు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానాలుగా విధించాయి.

‘డిసెంబర్‌ 31’ వరకు ప్రతి రోజూ..
నగరంలో వాహన చోదకులతో పాటు పాదచారుల భద్రత, ప్రమాదాలు నిరోధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అందులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై స్పెషల్‌ డ్రైవ్స్‌ చేపడుతున్నాం. సాధారణ రోజుల్లో వారానిరి రెండు మూడు రోజులు ఈ డ్రైవ్స్‌ ఉంటాయి. ‘డిసెంబర్‌ 31’ సమీపిస్తున్న నేపథ్యంలో అది ముగిసే వరకు ప్రతి రోజూ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశాం. నిత్యం 10 నుంచి 15 బృందాలు, వారాంతాల్లో 30 నుంచి 35 టీమ్స్‌ వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. చిక్కిన ప్రతి ఒక్కరికీ కౌన్సిలింగ్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. జరిమానా విధింపు అనేది న్యాయస్థానం పరిధిలోని అంశం. ఒకటి కంటే ఎక్కువ సార్లు చిక్కిన వారికి కోర్టులు జైలు శిక్షలు కూడా వేస్తున్నాయి.     – అంజనీకుమార్, సిటీ పోలీసు కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement