సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ 8వ శాసనసభ సమావేశాల నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఛలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల నుంచి భారీ ఎత్తున్న కార్యకర్తలను తరలించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుండగా.. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు, 3 వేల మంది పోలీసులతో మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్లు పక్కల 4 కిలోమీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. సభలకు, ర్యాలీలకు అనుమతి లేదని.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. విజయవాడ-హైదరాబాద్ హైవేతోపాటు జిల్లాల సరిహద్దులలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఎక్కడిక్కడే అడ్డుకుంటుండగా.. పలువురు వాగ్వాదానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ, బిన్నురు, కరీంనగర్, జగిత్యాల ఇలా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారిని అడ్డుకుని, ముఖ్య నేతలను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు గాంధీ భవన్ వద్ద పలువురు నేతలను అరెస్ట్ చేయటంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్గొండ ఉభయ జిల్లాలో రెండు రోజుల ముందు నుంచే అరెస్ట్ పర్వాలు కొనసాగాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సూర్యాపేట నుంచి బయలుదేరిన రేషన్ డీలర్లను అరెస్ట్ చేశారు.
మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇంట్లో సోదాలు పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన తనయుడు అరవింద్‌ను అదుపులోని తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశ్‌ను గృహ దిగ్భందం చేశారు. ప్రతిపక్షానికి నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. పోలీసులు అడ్డకున్నా సరే ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరతామని కాంగ్రెస్ నేత డీకే అరుణ తీవ్రంగా స్పష్టం చేశారు.
గాంధీ భవన్ వద్ద మళ్లీ ఉద్రికత్త
ఛలో అసెంబ్లీ నేపథ్యంలో గాంధీ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు యత్నంచిన ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇలా అరెస్టయిన వారిలో ఉన్నారు. అంతకు ముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని విమర్శించారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి గృహ దిగ్భందం చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment