ఊబిలో కూరుకుపోయిన బాబు
- బాబూ.. కేసీఆర్‌తో పోటీకి తగవు
- కేసీఆర్‌తో పెట్టుకుంటే పొయ్యిలో చేయి పెట్టినట్లే
- ఎంపీ సీతారాం నాయక్
హన్మకొండ : ఏపీ ముఖ్యమంత్రి ఊబిలో కూరుకుపోయారని, ఆయనను ఊబిలోకి ఎవరు తోసివేయలేదని, తనకు తానుగా వెళ్లాడని మహబూబాబాద్ లోక్‌సభ సభ్యుడు ఆజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తప్పు చేసినా అని ఒప్పుకోకుండా మాటలతో దాడి చేయడం ద్వారా తప్పించుకోవాలని చూస్తే కుదరదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోటీకి తగవని, కేసీఆర్‌తో పోటీ పెట్టుకోవాలంటే మండే పొయ్యిలో చేయిపెట్టినట్లుగా ఉంటుందన్నారు.
ఈ తోవలోనే వెళ్లి ఏసీబీకి అడ్డంగా దొరికారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళుతుంటే ఓర్వలేక టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు చూశారన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తాను నియోజకవర్గ అభివృద్ధికి రూ.250 కోట్లు మంజూరు చేయాలని చెప్పానని, టీడీఎల్పీ నేత ఎర్రబఎల్లి దయాకర్‌రావులా ప్యాకేజీలు కోరలేదన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు తెలంగాణ టీడీపీ నాయకులు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని తూర్పారబట్టారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవరెడ్డి, నయిమోద్దీన్, భీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, గైనేని రాజన్ పాల్గొన్నారు.