
కేసీఆర్ నన్నూ అమ్మాలనుకున్నాడు: చంద్రబాబు
ఖమ్మం ప్రజాగర్జనలో చంద్రబాబు
దళితుడిని సీఎం చేస్తానని ఇప్పుడా ఊసే ఎత్తడంలేదు
టీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే తెలంగాణనూ అమ్మేస్తాడు
కేసీఆర్ సోమరిపోతు.. తెలంగాణను దోచుకునేందుకే పుట్టాడు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘‘గత ఎన్నికల్లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని 45 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇస్తే 10 స్థానాల్లో గెలిచాడు. కౌంటింగ్ కూడా పూర్తికాక ముందే ఢిల్లీ వెళ్లి బీజేపీతో బేరాలాడాడు. నన్ను కూడా అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన్ని నమ్మి టీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే తెలంగాణను కూడా అమ్మేస్తాడు’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. కేసీఆర్ తెలంగాణను దోచుకోవడానికే పుట్టాడు తప్ప ఉద్ధరించడానికి కాదని అన్నారు. శనివారం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్‌లో నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. నా దగ్గర పనిచేసినప్పుడు ఆయన సోమరిపోతు. ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం అంటే 12 గంటలకు వచ్చేవాడు. ఇప్పుడు పోజులు కొడుతున్నాడు. కేసీఆర్‌కు ఇటలీ నుంచి వచ్చిన సోనియా అంటే భయం, ప్రేమ. నేనంటే చులకనగా మాట్లాడుతున్నాడు. అయినా ప్రజల కోసం ఏదైనా పడతాం. కానీ ప్రజలకు అన్యాయం చేస్తే గుండెల్లో నిద్రపోతాం’’ అని అన్నారు. కేసీఆర్ ఎకరానికి కోటి రూపాయలు సంపాదిస్తానని చెపుతున్నాడని, అధికారంలోకి వస్తే ఫాంహౌజ్‌లో కూర్చుని ఎకరాకు 5 కోట్లు సంపాదిస్తానని చెప్పే దుర్మార్గుడని వ్యాఖ్యానించారు. తెలంగాణలో దళితుడుని సీఎం చేస్తానని, మైనార్టీలను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఆ ఉసెత్తడం లేదని అన్నారు.
తెలంగాణ ఇవ్వాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలియదని చెప్పిన కేసీఆర్.. మరి తెలంగాణ తెచ్చానని గుర్రాలు, ఒంటెలపై ఎలా ఊరేగాడని ఎద్దేవా చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, సంపదను పెంచానని, అయితే ఆ సంపద కేసీఆర్ కుటుంబం కోసం కాదని చంద్రబాబు అన్నారు. ఇటీవలే ఒక కొత్త పార్టీ వచ్చిందని, ఆ పార్టీ ఎంపీ స్థానానికి రూ.50 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.10 కోట్లు, ఎస్సీలకయితే రాయితీ ఇచ్చి రూ.6 కోట్లకు టికెట్ ఇస్తానని బేరం పెడుతున్నాడని ఆరోపించారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రలో తామే అధికారంలోకి వచ్చి ఢిల్లీలో చక్రం తిప్పుతామని అన్నారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేయిస్తామని అంటున్నారని, అది ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. సైకిల్ స్పీడ్ పెంచి బుల్లెట్‌లా దూసుకెళుతుందని, అడ్డం వస్తే తొక్కుకుని వెళుతుందే తప్ప వెనక్కు తగ్గేదిలేదని చెప్పారు. తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను కూతురికి, కొడుక్కి, అల్లుడికి మూడుమూడు జిల్లాల చొప్పున సామంత రాజ్యాలుగా పంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.
మరో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎమ్మెల్యే టికెట్ అడిగితే మెడపట్టి గెంటిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ ఆమెకు టికెట్ ఇవ్వకపోతే తామే ఇస్తామని చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, ఊకె అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సభలో బాబు ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. దీంతో సభకు హాజరైన జనం ఆయన ప్రసంగిస్తుండగానే మెల్లమెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.