ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు 92వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద గురువారం కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌లతో కలిసివచ్చి ఎన్టీఆర్ సమాధిపై పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన వారిలో ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మరో కుమారుడు హరికృష్ణ, మనుమళ్లు సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కుమార్తె పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు.
టీడీపీకి నందమూరి వంశాన్ని దూరంచేసే కుట్ర: లక్ష్మీపార్వతి
నందమూరి వంశాన్ని టీడీపీకి దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఆమె గురువారం ఎన్టీఆర్‌ఘాట్‌లో తన భర్తకు నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ అవగాహన లేని లోకేశ్‌ను ప్రమోట్ చేసేం దుకు బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఏపీ కొత్త రాజధాని పేరుతో చంద్రబాబు పదివేల ఎకరాలు సింగపూర్‌కు ధారాదత్తం చేయనున్నారని చెప్పారు.