
మెట్రో రెండో దశ ప్రాజెక్టులో తొలుత అనుకున్న రూట్లలో కొన్ని మార్పులు జరిగాయి. తాజాగా బీహెచ్‌ఈఎల్– లక్డీకాపూల్ (25 కి.మీ) రూట్‌లో మెట్రో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు రాయదుర్గం– శంషాబాద్ (30 కి.మీ), ఎల్బీనగర్– నాగోల్ (5 కి.మీ) మార్గాల్లో మొత్తంగా 60 కి.మీ రూట్‌లో రెండో దశ మెట్రో ప్రాజెక్టు ఏర్పాటుపై వేగంగా కసరత్తు జరుగుతోంది.
దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఈ నెలాఖరుకు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెండో దశ ప్రాజెక్టుకు సుమారు రూ.10 వేల కోట్లు వ్యయం కానుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెండో దశ మార్గాల్లో చేపట్టనున్న డిపోలు, స్టేషన్లు, పార్కింగ్ సదుపాయాల కల్పనకు అవసరమైన స్థలాలను ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. – సాక్షి, హైదరాబాద్
బీహెచ్‌ఈఎల్– లక్డీకాపూల్ రూట్ ఇలా..
బీహెచ్‌ఈఎల్(రామచంద్రాపురం)లో మెట్రో డిపోకు సుమారు70 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ కారిడార్ పరిధిలో 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గంలో బీహెచ్‌ఈఎల్, మదీనగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, కొత్తగూడ జంక్షన్,షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డీకాపూల్‌లలో మెట్రో స్టేషన్లు ఏర్పాటుకానున్నాయి.
రాయదుర్గం– శంషాబాద్ రూట్ ఇలా..
రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయనున్నారు. ఈ మార్గంలో బుద్వేల్ లేదా శంషాబాద్ ప్రాంతాల్లో 60 ఎకరాల స్థలాన్ని మెట్రో డిపో ఏర్పాటు కోసం కేటాయించనున్నారు.
ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు సమయం ఆదా కానుంది. ఈ మేరకు డీఎంఆర్‌సీ అధికారులు రెండో దశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా?
ప్రస్తుతం రెండో దశ ప్రాజెక్టుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినప్పటికీ గతంలో మరో ఐదు మార్గాల్లో రెండో దశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఆ దిశగా అడుగులు పడకపోవడంతో ఎల్బీనగర్– హయత్‌నగర్, ఎల్బీనగర్– ఫలక్‌నుమా– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మియాపూర్– పటాన్‌చెరు, తార్నాక– ఈసీఐఎల్, జేబీఎస్– మౌలాలి మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
డీఎంఆర్‌సీ నివేదికలో అంశాలివే..
♦ రెండో దశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక, ట్రాక్‌ల నిర్మాణం ఎలా ఉండాలో సూచించనుంది.
♦ భద్రతాపరమైన చర్యలు
♦ టికెట్ ధరల నిర్ణయం
♦ రెండో దశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ
♦ వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన
♦ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూల్ ఖరారు
సెప్టెంబర్ తొలి వారంలో ఎల్బీనగర్– అమీర్‌పేట్..
గ్రేటర్‌వాసుల కలల మెట్రో రైళ్లు ఎల్బీనగర్– అమీర్‌పేట్ (16 కి.మీ) మార్గంలో సెప్టెంబర్ తొలి వారంలో పరుగులు పెట్టనున్నాయి. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ అందనుందని హెచ్‌ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ మార్గంలో మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలకు మార్గం సుగమం కానుంది.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ రూట్‌లో నిత్యం సుమారు లక్ష మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్– హైటెక్ సిటీ (13 కి.మీ) మార్గంలో ఈ ఏడాది నవంబర్‌లో మెట్రో రైళ్లు కూతపెట్టనున్నాయి. ఇక జేబీఎస్– ఫలక్‌నుమా మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment