సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లోని బోగస్ టీచర్లకు చెక్ పెట్టేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించాలని నిర్ణయించింది. పాఠశాలలవారీగా ‘ఆధార్’అనుసంధానంతో టీచర్ల వివరాల సేకరణను వచ్చే వారంలో ప్రారంభించి, నెల రోజుల్లోగా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అర్హత లేనివారు కూడా టీచర్లుగా ఉన్నారని, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కొంతమంది రెగ్యులర్ టీచర్లకు బదులుగా ఇతరులు పాఠాలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా వాటికి అడ్డుకట్ట పడుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
మరోవైపు పాఠశాలలవారీగా టీచర్ల సమగ్ర వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒక పాఠశాలలో పనిచేసే టీచర్‌ను మరో పాఠశాలలో చూపించకుండా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,821 పాఠశాలలుండగా, అందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు పాఠశాలలు 28,582, ఎయిడెడ్ పాఠశాలలు 742, సెంట్రల్ స్కూళ్లు 47, ప్రైవేటు పాఠశాలలు 11,470 ఉన్నాయి. 28,582 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు, 1.30 లక్షల మంది టీచర్లు ఉన్నారు. అయినా ఇంకా టీచర్ల కొరత ఉంది. 11,470 ప్రైవేటు పాఠశాలల్లో 30 లక్షల మంది విద్యార్థులు ఉండగా, టీచర్ల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సంఖ్య ఉందని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే, ఆ లెక్క తేల్చేందుకు విద్యాశాఖ ఇప్పుడు సిద్ధమైంది. ఆధార్ అనుసంధానంతో వారి వివరాలను తీసుకోవడం ద్వారా తప్పుడు లెక్కలను అరికట్టవచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
బోగస్ ఉపాధ్యాయులకు చెక్!
Published Fri, Feb 15 2019 2:32 AM | Last Updated on Fri, Feb 15 2019 2:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment