మొదలుకాని జంపన్నవాగు చెక్‌డ్యాంల నిర్మాణం
జాతర సమయంలోనే హడావుడి
గతంలో స్నానఘట్టాల్లోనూ ఇదే తీరు ఆలస్యమైతే మరో రెండేళ్లు నిరీక్షణే..
సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గత ఏడాది డిసెంబర్ లో ఈ చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం పాలన అనుమతి మంజూరు చేసింది. జాతర సమయానికే పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నెల గడిచినా ఇంత వరకు ఉలుకూపలుకు లేదు. ఈ పనులు చేపట్టాల్సిన చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు.
హన్మకొండ : తాడ్వారుు మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు జంపన్న వాగులో తప్పనిసరిగా స్నానం చేస్తారు. ఈ వాగు ఒడ్డునే తల నీలాలు సమర్పిస్తారు. జంపన్నవాగులో వర్షాకాలం మినహా మిగిలిన సమయాల్లో స్నానం చేసేందుకు సరిపడా నీరు ప్రవహించదు. జాతర జరిగే సమయంలో లక్నవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా జంపన్నవాగులోకి చేరిన నీటిలో భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఇసుక కట్టలతో తాత్కాలిక చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు 2016 జాతర కల్లా జంపన్నవాగులో పుణ్యస్నాణాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 13.96 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 2015 డిసెంబరు 21న ఉత్తర్వులు జారీ చేసింది. యుద్ధప్రతిపాదికన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించి జాతర సమయానికి కల్లా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
జాతర ముగిసినా..
జంపన్నవాగుపై ఊరట్టం, పడిగాపూర్, రెడ్డిగూడెం, మేడారం వద్ద నాలుగు చెక్‌డ్యాంలు నిర్మిం చాల్సి ఉంది. జాతర సమయానికి నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించినా ఉత్తర్వులు విడుదలైన రోజు నుంచి జాతర వరకు అందుబాటులో ఉన్న 57 రోజుల వ్యవధిలో టెండర్లు నిర్వహించినా పనులు పూర్తి చేయలేమని చిన్ననీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేశారు. జాతర ముగి సిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. జా తర ముగిసి నెల గడుస్తున్నా ఇంతవరకు చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఉలుకుపలుకు లేకుండా పోయింది. జాతర ముగిసి నెల దాటిన టెండర్ల నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈ చెక్‌డ్యాంల టెండర్లు ని ర్వహించేందుకు సాంకేతిక మంజూరు కోసం ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం.
గతంలో ఇదే తంతు
2014 మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగు వెంట ఊరట్టం, రెడ్డిగూడెం సమీపంలో స్నానఘట్టాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు రెండు విడతల్లో చేపట్టాలని పేర్కొంది. దీని ప్రకారం జాతరకు ముందు రెడ్డిగూడెం, ఊరట్టం కాజ్‌వే వద్ద తొలి విడత పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఊరట్టం కాజ్‌వే, చిలకలగుట్ట వద్ద రూ.10 కోట్లతో చేపట్టాల్సిన పనులను ప్రారంభించలేదు. రెండేళ్ల తర్వాత 2016 జాతర సందర్భంగా మంజూరైన నిధులతోనే రెండో విడత స్నానఘట్టాల పనులు పూర్తి చేశారు. గతంలో స్నానఘట్టాల విషయంలో జరిగినట్లుగానే చెక్‌డ్యామ్‌ల విషయంలో ఆలస్యం జరిగేందుకు ఆస్కారం ఉందని భక్తులు సందేహిస్తున్నారు. గతంలో పోల్చితే సమ్మక్క-సారలమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారాలు, సెలవు దినాల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ఈ వేసవిలో ప్రారంభమైతే వర్షకాలం వరకు పూర్తవుతుంది. చెక్‌డ్యామ్‌లలో నిల్వ ఉండే నీరు ఇటు రైతులకు ఉపయోగపడటమే కాకుండా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అక్కరకు వచ్చేది.