అమ్మో పులి.. వచ్చెను మళ్లీ
* భిక్కనూరులో చిరుత సంచారం
* భయాందోళనల్లో ప్రజలు
భిక్కనూరు : నియోజకవర్గ ప్రజలను కొంతకాలంగా చిరుత పులి భయపెడుతూనే ఉంది. ఏదో ఒక ప్రాంతంలో పులి సంచారం కనిపిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రంలోని ఎల్లాడి చెరువు సమీపంలో ఉన్న అవ్వగారి మామిండ్ల వద్ద శనివారం వేకువ జామున చిరుతపులి కనిపించిందని రైతులు గూడూరి తిరుపతి, శ్రీకాంత్ పేర్కొన్నారు. వేకువజామున పొలం వద్దకు వెళ్లామని, దూరంలో చిరుత కనిపించడంతో పరుగెత్తుకుంటూ వచ్చేశామని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని సర్పంచ్ నర్సింహారెడ్డికి తెలిపారు. ఆయన ఫారెస్టు అధికారులకు సమచారం అందించారు.
ఫారెస్టు సెక్షన్ అధికారులు వే ణు, భీంరెడ్డి, బీట్ అధికారులు ఫారూఖ్, బాబు తదితరులు సంఘటన స్థలానికి వచ్చారు. రైతుల నుంచి వివరాలు సేకరించారు. పులి అడుగు జాడల కోసం వెతికారు. సెక్షన్ అధికారులు వేణు, భీంరెడ్డి మాట్లాడుతూ రైతులు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లవద్దన్నారు. ఇద్దరు ముగ్గురు రైతులు కలిసి, చేతిలో కర్రలు ధరించి చప్పుడు చేస్తూ పొలాలవద్దకు వెళ్లాలని సూచించారు. భిక్కనూరులో పులి కనిపించిందన్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవునిపల్లి, భిక్కనూరు గ్రామాలకు చెందిన ప్రజలు అవ్వగారి మామిండ్ల వద్దకు భారీగా తరలివచ్చారు. పులి సంచరించిన చోటును పరిశీలించారు.