సామాజిక తెలంగాణ కోసం కొత్త పార్టీ
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ వెల్లడి
హైదరాబాద్: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అణగారిన రాష్ట్ర ప్రజల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లిన వారిని పక్కన పెట్టారని, తెలంగాణ ద్రోహులు నేడు అధికార దాహంతో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించి, అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొంది జూన్ 2 నాటికి నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని పేర్కొన్నారు. బడుగు, బలహీన అణగారిన వర్గాల వారు నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారన్నారు. గౌని నర్సింహ్మగౌడ్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.