
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ఆదిలాబాద్ అర్బన్ : కార్మికులు చేస్తున్న సమ్మె దిక్కుమాలినదని, వారికి మద్దతు ఇస్తున్న సంఘాలు దిక్కుమాలినవని సీఎం కేసీఆర్ చేసిన వ్యఖ్యలపై వామపక్షాలు భగ్గుమన్నాయి. వాటిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా మంగళవారం కలెక్టరేట్ ఎదుట వామపక్షాల నాయకులు ఆందోళన, ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్నారు. ముఖద్వారం వద్ద నిల్చోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మండిపడడం సరికాదన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే పరిష్కరించాల్సింది పోయి సీఎం కేసీఆర్ సమ్మెను పనికిమాలినదిగా అభివర్ణించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులుగా చాలీచాలని వేతనాలతో జీవితాలను వెళ్లదీస్తున్నా వారిపై కనీస కనికరం లేకుండా మాట్లడడం సరికాదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, పీడీఎస్‌యూ నాయకులు చంటి, సచిన్, వెంకటేష్, బొమ్మెన సురేష్, తదితరులు పాల్గొన్నారు.