భువనగిరి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం యాదగిరిగుట్టకు రానున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం గుట్ట అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం ఆయన మెదక్ జిల్లా గణపురం వెళ్లనున్నారు. కాగా సీఎం రాక సందర్భంగా కలెక్టర్ చిరంజీవులు మంగళవారం యాదగిరిగుట్టకు చేరుకుని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రధానంగా హెలిపాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలని స్థానిక అర్డీఓ ఎన్.మధుసూదన్, డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డి, దేవస్థానం ఈఓ గీతారెడ్డి, ఆర్‌ఆండ్‌బీ ఈఈ లింగయ్యలతో సమీక్షించారు. యాదగిరి గుట్టకు పక్కనే ఉన్న భువనగిరి మండలం వడాయిగూడెంలోని ఓ వెంచర్‌లో హెలిపాడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడి పరిస్థితులను కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసిన హెలిపాడ్ ద్వారా దిగి అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. మళ్లీ అదే స్థలంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తే రోడ్డు మార్గం గుండా గుట్టపైకి నేరుగా చేరుకోవచ్చునని అధికారులు నిర్ణయించారు. సురేంద్రపురి వద్ద గల ఈ స్థలంలో హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు.
శాశ్వత హెలిపాడ్ అవసరం ఉంది..
గుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో పలుమార్లు ఆయన గుట్టకు రానున్నారు. అలాగే మిగతా వీఐపీలు ఎవరైనా గుట్టకు నేరుగా రావడానికి హెలిపాడ్ అవసరం ఉందని భావించిన కలెక్టర్ గుట్ట పక్కన గల గోశాల ఆవరణలో శాశ్వత హెలిపాడ్ ఏర్పాటు చేస్తే బాగుంటుం దని భావించి స్థల పరిశీలన చేశారు. కలెక్టర్ వెంట ఆర్‌ఆండ్‌బీ ఈఈ బాల స్వామి, తహసీల్దార్‌లు సోమ్లానాయక్, వెంకట్‌రెడ్డి, గుట్ట సీఐ శంకర్‌గౌడ్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
భూసేకరణ ఫైల్ సిద్ధం చేసిన కలెక్టర్
గుట్టను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న కేసీఆర్ బడ్టెట్‌లో రూ.100 కోట్లు కేటాయించడంతోపాటు, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి బోర్డును నియమించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 17న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం తిరుపతి తరహాలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. కలెక్టర్ చిరంజీవులు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు 2వేల ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలను తయారు చేశారు. ఇందులో 130 ఎకరాలు దేవస్థానానికి చెందినవికాగా, మరో 300 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండగా, మిగిలిన 1570 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులోకూడా మరో 270 ఎకరాల ప్రభుత్వ భూమి లభించినా 1300 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించడానికి అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. గుట్టకు 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న దాతర్‌పల్లి, యాదగిరిపల్లి, మల్లాపురం, సైదరాపురంతోపాటు, భువనగిరి మండలం రాయగిరి గ్రామాల్లోని గుట్టలను సేకరించడానికి అధికారులు పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేశారు.
అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్న కేసీఆర్ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు యాదగిరిగుట్టకు వచ్చిన 12 గంటలకు మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత తెలిపారు. హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట చేరుకోగానే మొదట గుట్టపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. అనంతరం గుట్ట అభివృద్ధి కోసం ఆయన రూపొందించిన ప్రణాళికపై అధికారులతో చర్చలు జరుపుతారన్నారు. ప్రధానంగా గుట్ట చుట్టూ రెండు వేల ఎకరాల భూసేకరణ, గుట్టపైన చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారన్నారు. సీఎం వెంట గుట్ట డెవలప్‌మెంట్ అధారిటీ ప్రత్యేకాధికారి కూడా వస్తారని తెలిపారు.
ఇవీ.. అంచనాలు..
కేసీఆర్ ఆలోచన ప్రకారం యాదగిరి క్షేత్రాన్ని వాటికన్ సిటీ, తిరుపతి క్షేతం తరహాలో అభివృద్ధి చేయడానికి పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.750 కోట్లు అవసరం అవుతాయని నిర్ణయించారు.
ఇందులో గుట్ట మాస్టర్‌ప్లాన్ ప్రధానమైంది. దీనికోసం రూ.200 కోట్లు, అభయారణ్యం, జింకల పార్క్‌కు 100 కోట్లు, ఆలయగోపురం ఎత్తుపెంపు, స్వర్ణ తాపడానికి రూ.50 కోట్లు, ఆలయ మండపం, మాడ వీధుల విస్తరణకు రూ.100 కోట్లు, ఎత్తై ఆంజనేయ విగ్రహం ఏర్పాటుకు రూ.50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం అదనంగా మరో రూ.100 కోట్లు అవసరం అవుతాయని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నివేదికలను రూపొందించారు. ముఖ్యమంత్రి ఇప్పటికే బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ఏ పనులు ముందుగా చేపట్టాలి. ఏ పనులు ఎప్పుడు చేపట్టాలి అనే విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో అధికారులు సైతం ఇప్పుడే ఏమీ చెప్పలేకపోతున్నారు.
సీఎం సమీక్ష అనంతరం పనుల విషయంలో ఒక అంచనాకు వస్తామని అధికారులు భావిస్తున్నారు.
నేడు గుట్టకు సీఎం కేసీఆర్ రాక
Published Wed, Dec 17 2014 2:17 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement