రుణమాఫీపై సీఎం స్పష్టత ఇస్తారు
విపక్షాల విమర్శలపై మంత్రుల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో రుణమాఫీతో సహా అన్ని విషయాలపై ముఖ్యమంత్రి స్పష్టత ఇస్తారని తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పద్మారావు, శాసనసభ్యులతో కలసి వారు బుధవారం మీడియాపాయింట్‌లో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంపై విమర్శలు చేయడం ద్వారా విపక్షాలు తమ కుసంస్కారాన్ని చాటుకున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
గవర్నర్ ప్రసంగం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మను ఆవిష్కరించేలా ఉందన్నారు. అన్ని వర్గాలవారికి సమాన విద్యావకాశాలు కల్పిస్తామని, జనాభా ప్రాతిపదిక న ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాజకీయ అవినీతికి తావు లేకుండా నిధులు ఖర్చుచేస్తామని, ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయిలో ఆస్పత్రిని నెలకొల్పుతామన్న హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్టు ఇదివరకే తేల్చి చెప్పామన్నారు. పోలవరం ముంపుగ్రామాల అంశంపై అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని, సభలో తీర్మానం చేస్తామని పోచారం తెలిపారు.