జగడం..సమాప్తం | Chief Ministers of Andhra Pradesh and Telangana Meet over Nagarjuna Sagar Dam Issue | Sakshi
Sakshi News home page

జగడం..సమాప్తం

Published Sun, Feb 15 2015 1:31 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM

జగడం..సమాప్తం - Sakshi

జగడం..సమాప్తం

శనివారం ఉదయం డ్యాంపై ఉద్రిక్త పరిస్థితులు
     ఆంధ్రా డీఐజీ, గుంటూరు ఎస్పీలతో కలిసి వచ్చిన అక్కడి పోలీసులు
     హుటాహుటిన డ్యాం వద్దకు చేరుకున్న మన రాష్ట్ర డీఐజీ గంగాధర్, జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు
     సీఎంల చర్చల తర్వాత ఎడమకాల్వకు నీటి నిలిపివేత.. ఆన్‌ఆఫ్ పద్ధతిలో ఇస్తామన్న ఎస్‌ఈ
     డ్యాంను సందర్శించిన ఎస్పీఎఫ్ కమాండెంట్.. ఉదయాన్నే టీఆర్‌ఎస్ ఆందోళన
 
 నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ డ్యాంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జగడానికి తాత్కాలికంగా తెరపడింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపి రెండు రాష్ట్రాల్లోని పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేసుకోవాలని నిర్ణయించడంతో సాగర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయాయి. సీఎంలతో చర్చల అనంతరం డ్యాం వద్ద భారీగా మోహరించిన ఇరు రాష్ట్రాల పోలీసులు ఎటువారు అటే వెళ్లిపోవడంతో ఉపశమనం లభించినట్టయింది. దీంతో శనివారం ఏం జరుగుతుందోనని ఆందోళన చెందిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, సీఎంలతో చర్చల అనంతరం ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసుకున్న పంటలకు ఆన్‌ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేస్తామని డ్యాం ఎస్‌ఈ తెలిపారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుడికాల్వకు నీటి విడుదలను ఏడువేల క్యూసెక్కులకు పెంచారు. విద్యుత్ కేంద్రం ద్వారా 2వేలు, హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 5వేల క్యూసెక్యులను మధ్యాహ్నం నుంచి విడుదల చేశారు.
 
 ఉదయం... ఉద్రిక్తం
 సాగర్ డ్యాంపై శుక్రవారం నాటి ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యాంకు అవతలి వైపు ఆంధ్ర పోలీసులు, ఇవతలివైపు తెలంగాణ పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. డ్యాం వద్ద గుంటూరు డీఐజీ సంజీవ్, ఎస్‌పీ రామకృష్ణ, గురజాల డీఎస్‌పీ నాగేశ్వర్‌రావు, మాచర్ల సీఐతో పాటు పోలీసు బలగాలు మోహరిస్తున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణ డీఐజీ గంగాధర్,  జిల్లా ఎస్‌పీ ప్రభాకర్‌రావుల నేతృత్వంలో ఆంధ్రాసరిహద్దులోని బ్రిడ్జి వద్ద, బుద్ధవనం వద్ద తాత్కాలిక పోలీస్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతివాహనాన్ని తనిఖీచేసి పంపారు. దీంతోపాటు  స్పెషల్ పార్టీ పోలీస్‌లను దింపారు. మొత్తం 597మంది పోలీస్‌ఫోర్స్‌ను రం గంలోకి దింపారు.
 
 మరోవైపు రైతుసంఘాల నేత లు కూడా డ్యాం వద్ద ఆందోళన చేపట్టారు. తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వారి నిరసన విరమించారు. సీఎంల సమావేశంలో చర్చలు ఫల ప్రదం కావడంతో ఇరు వర్గాలు డ్యాం వద్ద నుంచి వెళ్లిపోయాయి. క్రమేపీ పోలీసులు డ్యాం వద్ద నుంచి వెళ్లిపోవడంతో సాగర్‌లో ప్రశాంతత నెలకొంది. అప్పటి వరకు డీఐజీతో పాటు జిల్లా ఎస్పీ, ఓఎస్డీ, మిర్యాలగూడ  డీఎస్‌పీ గోనె సందీప్, మిర్యాలగూడ ఆర్‌డీఓ కిషన్‌రావు, పెద్దవూర తహసీల్దార్ ఖలీల్ అహ్మద్, నాగార్జునసాగర్‌డ్యాం ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈలు విజయకుమార్, హాలియా సీఐ పార్థసారధి ఉన్నారు.
 
 ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్
 సాగర్ ఆయకట్టు ఎడమ కాల్వకు శుక్రవారం అర్ధరాత్రి నీటి విడుదలను నిలిపివేశారు. ఖరీఫ్ సీజన్‌లో ఆలస్యంగా వేసిన ఆయకట్టుకు ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్‌ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లుగా సాగర్ డ్యాం ఎస్‌ఈ విజయ్‌భాస్కర్‌రావు తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి 13వ తేదీ అర్ధరాత్రి వరకు నీటిని విడుదల చేసినట్లు వివరించారు. ఐదు రోజులపాటు నీటిని నిలిపివేసి అనంతరం 19వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. పది రోజులు నీటిని విడుదల చేసి 28వ తేదీ నీటిని  నిలిపివేయనున్నట్లు తెలిపారు. తిరిగి ఐదు రోజుల అనంతరం నీటిని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
 పరిస్థితి యథావిధి
 నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఆదివారం నుంచి యథావిధిగా ఉంటుందని మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు తెలిపారు.  ప్రాజెక్టు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న మాదిరిగానే ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని తెలిపారు. డ్యాం ఎస్‌ఈ నిర్వహణలో కొనసాగుతుందన్నారు.
 
 ఆంధ్ర అధికారుల విగ్రహాలను తొలగించాలి
 నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలోనే తెలంగాణ రైతులకు అన్యాయాన్ని తలపెట్టిన ఆంధ్రా ఇంజినీర్ల, నాయకుల విగ్రహాలను డ్యాం మీదనుంచి తొలగించాలని సాగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సాగర్ పైలాన్ పిల్లర్ వద్ద  తెలంగాణ పోలీస్‌లకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మలిగిరెడ్డి లింగారెడ్డి, రావుల భిక్షం, రవినాయక్, బషీర్, రమేశ్‌జీ, వర్రవెంకట్‌రెడ్డి, వల్లపురెడ్డి, కృష్ణ, నర్సిరెడ్డి, సైదులు. ఖాళీదా, నజీర్, హనుమంతు, వెంకోజీ  ఉన్నారు.
 
 సాగర్ భద్రతను పరిశీలించిన ఎస్‌పీఎఫ్ కమాండెంట్
  నాగార్జునసాగర్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న రగడపై స్పందించిన ఎస్‌పీఎఫ్ కమాండెంట్ అన్వర్‌పాషా శనివారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. భద్రతపై ఆరాతీశారు.  
 
 పేరుకు 7 వేలు.. వెళ్లేది 10వేల క్యూసెక్కులు
 ఆంధ్రారాష్ట్రానికి విడుదల చేసేది ఏడు వేల క్యూసెక్కులైతే వెళ్లేది మాత్రం 10వేల క్యూసెక్కులని టీఆర్‌ఎస్‌సాగర్ నియోజకవర్గం  ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కుడికాల్వలో ఏర్పాటు చేసిన స్కేలు తప్పుల తడక అని తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement