
హమ్మయ్య.. బాబు దొరికాడు..!
► తెల్లవారు జామున ఆస్పత్రి నుంచి అపహరణ..
► అర్ధరాత్రి కరీంనగర్ శివారులో దొరికిన వైనం..
కరీంనగర్ రూరల్: కరీంనగర్ శివారులోని చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం వేకువజామున అపహరించుకుపోయారు. అయితే, చిన్నారి అర్ధరాత్రి 12గంటల సమయంలో కరీం నగర్ శివారులో లభ్యమైనట్లు విశ్వసనీ యంగా తెలిసింది. పోలీసులు చిన్నారిని తల్లివద్దకు చేర్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కరీంనగర్ మండలం చామన్‌పల్లికి చెందిన వడ్లకొండ రమ్య, ప్రవీణ్ దంపతులు. రమ్య తొలి కాన్పు కోసం చల్మెడ ఆనందరావు ఆస్పత్రిలో చేరగా, ఈనెల 14న ఆమెకు మగ బిడ్డ పుట్టాడు.
సోమవారం రాత్రి బాబును పొత్తిళ్లలో పడుకోబెట్టుకుని రమ్యమ నిద్రిం చింది. మంగళవారం ఉదయం 5 గంటల కు నిద్రలేచిన రమ్యకు బాబు కనిపించ లేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. పరిసరాలన్నీ వెదికారు. బాబు కనిపించకపోవడంతో బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఒకదశలో ఆస్పత్రి అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించగా, అప్పటికే వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆస్పత్రిలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు.
సీసీటీవీల్లో వేకువజామున 4 గంటలకు గుర్తుతెలియని మహిళ ప్రసూతివార్డులోకి వెళ్లి బాబును బ్యాగులో పెట్టుకొని మరో యువకుడితో కలసి హోండా యాక్టివా వాహనంలో బయటకు వెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ క్లారిటీ లేకపోవడంతో.. ల్యాబ్‌కు పంపించి పరిశీలిస్తామని సీపీ తెలిపారు. అనంతరం తల్లి రమ్య వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి డైరెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సూపరింటెండెంట్ వాసీంఅలీ, సెక్యూరిటీ ఇన్‌చార్జి తివారీతో చర్చించారు. బాబును తీసుకెళ్లినవారిని వెంటనే పట్టుకోవాలని బంధువులు, గ్రామస్తులు రాజీవ్‌రహదారిపై ఆందోళనకు దిగారు.
ఐదు బృందాలతో గాలింపు
బాలుడిను గుర్తించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అనుమానిత మహిళ, యువకుడి ఫొటోలను విడుదల చేశారు.