చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్.. ఆగిన బాల్య వివాహం | Child marriage About Caildlainku call; | Sakshi
Sakshi News home page

చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్.. ఆగిన బాల్య వివాహం

Published Tue, Feb 2 2016 4:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్..   ఆగిన బాల్య వివాహం - Sakshi

చైల్డ్‌లైన్‌కు ఫోన్‌కాల్.. ఆగిన బాల్య వివాహం

బంట్వారం:  బాల్య వివాహ విషయమై చైల్డ్‌లైన్‌కు కాల్ చేయడంతో అధికారులు స్పందించి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సంఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పి. కృష్ణయ్య, మల్లమ్మ దంపతుల కూతురు(13) బంట్వారం కేజీబీవీ పాఠశాలలో 8 వతరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా బాలికకు ఆమె తల్లిదండ్రులు నవాబుపేట మండలం చించల్‌పేటకు చెందిన మేనబావ పరమేష్‌తో ఈనెల 12న పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై గుర్తుతెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి విషయం తెలిపారు.


అప్రమత్తమైన చైల్డ్‌లైన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ సోమవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జగదాంభ, తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజు తదితరులు సుల్తాన్‌పూర్‌కు వెళ్లి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.బాలికకు మైనారిటీ తీరాకే పెళ్లి చేయాలని సూచించారు. దీంతో వారు అంగీకరించారు. అక్కడినుంచి అధికారుల బృందం బాలికతో సహా ఆమె తల్లిదండ్రులను కే జీబీవీ హాస్టల్‌కు తీసుకెళ్లారు. బాలిక మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయబోనని ఆమె తండ్రి కృష్ణయ్య హామీపత్రం రాసిచ్చాడు.

అనంతరం బాలికను హాస్టల్‌లో చేర్పించారు. బాలికను వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన ఆమె బావ పరమేష్‌తో ఎస్‌ఐ రాజు మాట్లాడి హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి బాలికను మైనారిటీ తీరకముందే పెళ్లి చేసుకుంటే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పీఎసీఎస్ చెర్మైన్ లక్ష్మారెడ్డి చైల్డ్‌లైన్ ఆర్గనైజర్ శ్రీనివాస్‌ను అభినందించారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని బాలికకు సూచించారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే జరిగే అనర్థాల గురించి అధికారులు బాలిక తల్లిదండ్రులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement