అశ్వారావుపేట: ప్రతి బడ్జెట్‌లో సిగరెట్ల ధరలను ఎంతోకొంత పెంచుతారని వ్యాపారులకు తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అశ్వారావుపేటలోని కిరాణా, పాన్‌షాప్ దుకాణదారులు సిగరెట్లను బ్లాక్ చేసేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొత్త ధరలు అమల్లోకి వచ్చాయోలేదో వెంటనే సిగరెట్ ధరలను అమాంతం పెంచేశారు. రూ.9కి అమ్మాల్సిన సిగరెట్‌ను రూ.13కు విక్రయిస్తున్నారు.
ఒక్క అశ్వారావుపేట పట్టణంలోనే రోజుకు రూ.2 లక్షల టర్నోవర్ జరిగే సిగరెట్ వ్యాపారంలో రూ.60వేలు అదనంగా దోచుకుంటున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రమే అయినా సిగరెట్లను సరఫరా చేసే పలు ప్రైవేటు కంపెనీలకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారు)లు లేరు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు డిస్ట్రిబ్యూటర్‌ల నుంచి ఇక్కడి వ్యాపారులు హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేస్తారు. వీరి వద ్దనుంచి స్థానిక పాన్‌షాపులు, చిరువ్యాపారులు కొనుగోలు చేస్తారు.
ఒక్కో సిగరెట్‌పై 50 పైసలు నుంచి రూపాయి వరకు లాభం చూసుకొని అమ్ముతారు. బడ్జెట్‌కు సిగరెట్‌ల ధరలు పెరుగుతున్నాయని ప్రచారం జరగడంతో హోల్‌సేల్ వ్యాపారులు తెలివిగా స్టాకును బ్లాక్ చేసేశారు. ఇప్పుడు దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న చందంగా సిగరెట్‌ల దందా కొనసాగిస్తున్నారు.
దండుకునే
మార్గాలెన్నో...
దశాబ్దాల తరబడి సిగరెట్ వ్యాపారంలో ఆరితేరిన అశ్వారావుపేటలోని కొందరు వ్యాపారులకు బడ్జెట్ సమయంలో స్టాకు బ్లాక్ చేయాలో.. వద్దో తెలుసు. కావాలనే వారు సిగరెట్‌లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పాన్‌వాలాలు లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు గోల్డ్‌ఫ్లాక్ కింగ్ సిగరెట్ 10 పీస్‌ల పెట్టెపై ఎమ్మార్పీ రూ.85 ఉంటుంది. దీన్ని హోల్‌సేల్ వ్యాపారులు పాన్‌షాప్ వారికి గతంలో రూ.80 నుంచి రూ.85 వరకు విక్రయించేవారు.
బడ్జెట్ ఊసు మొదలయినప్పటి నుంచి సిగరెట్ పెట్టె ధర రూ.130కి పెరుగుతుందట అని వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తారు. తీరా బడ్జెట్‌లో సిగరెట్ రేట్లు పెంచగానే పాత స్టాకునే రూ.130కి అంటగడుతున్నారు. ఇదేమిటంటే.. ‘ఇష్టం ఉంటే తీసుకో.. లేకుంటే లేదు..’ అనటంతో చేసేదేమీ లేక అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నామని పాన్‌దుకాణదారులు వాపోతున్నారు. రూ.10కి అమ్మాల్సిన సిగరెట్‌ను రూ.13 నుంచి వీలైనంత పెంచి అమ్ముతున్నారు. స్టాకును బ్లాక్‌చేసిన వారు లక్షలు గడిస్తుంటే.. రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. హోల్‌సేలర్ల దోపిడీని అరికట్టాల్సిందిగా రిటైల్‌వ్యాపారులు, ధూమపాన ప్రియులు కోరుతున్నారు.
సిగ‘రేటు’ రెట్టింపు ధరలకు విక్రయం
Published Fri, Jul 18 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM
Advertisement