Asvaravupeta
-
సిరి సంపాదన
పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆ గిరిపుత్రికలు జీవనోపాధి కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదినుంచీ తమ ఆహారంలో భాగమే అయిన రాగి, జొన్న, కొర్ర, సజ్జలు వంటి సిరిధాన్యాలకు నేటి ఆధునిక సమాజంలో లభిస్తున్న ఆదరణను చూసి.. వాటినే ఆదాయ వనరుగా మలచుకున్నారు. నాబార్డు సాయంతో ఇంటివద్దే బిస్కెట్లు తయారు చేస్తూ.. మార్కెట్లో వీటిని విక్రయిస్తూ.. ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రోజుకూలి దొరక్క అష్టకష్టాలు పడిన ఈ ఆడబిడ్డలు ఈరోజు వేలాది రూపాయలు ఆర్జిస్తూ.. మా సిరిసంపదలు సిరిధాన్యాలే అని ఆనందంగా చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నగూడెంలో అన్నీ గిరిజన కుటుంబాలే జీవిస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటేనే వీరికి ఇల్లు గడిచేది. అయితే.. రోజూ పని దొరక్కపోవడం, పుట్టి పెరిగిన మన్యం వీడి వలసపోలేని పరిస్థితిలో నలుగురు మహిళలు మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మిలు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రోగాల నివారణకు, ఆరోగ్యానికి సిరిధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని ఇటీవలి కాలంలో విస్తృత అవగాహన పెరుగుతున్న క్రమంలో వీరి ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. వాస్తవానికి సిరిధాన్యాలు గిరిజన బిడ్డలైన వీరికి అనాదిగా ఆహారమే మరి. వీటినే.. ఇప్పుడు ఇలా ఉపాధికి ఎంచుకోవడం విశేషం. వీళ్ల ఆలోచనకు నాబార్డు వారి సహకారం తోడైంది. బిస్కెట్ల తయారీకి అవసరమైన యూనిట్‌ను సబ్సిడీపై రూ.75 వేలకు మంజూరు చేయడంతో.. గతేడాది అక్టోబర్‌లో ఇంట్లోనే దీనిని నెలకొల్పారు. నాటి నుంచి నలుగురూ కలిసికట్టుగా రాగి, జొన్న, కొర్ర, సజ్జలతో షుగర్, షుగర్ లెస్ బిస్కెట్లను తయారు చేస్తున్నారు. కేజీ పిండిని 52 బిస్కెట్లుగా మలుస్తూ వీటిని మార్కెట్లో రూ.300కు విక్రయిస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తే దాదాపు 40 కేజీల బిస్కెట్లు తయారవుతున్నాయి. ఇందుకోసం రూ.2వేలు పెట్టుబడికి వెచ్చిస్తుండగా.. విక్రయించడం ద్వారా రూ.12వేలు పొందుతున్నామని చెబుతున్నారు. అంటే పెట్టుబడి పోను రూ.10వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ సొమ్మును ఈ గిరిజన మహిళలు నలుగురు సమంగా పంచుకుంటున్నారు. తద్వారా.. వీరికి రోజుకు ఒక్కొక్కరికీ రూ.2,500 లాభం దక్కుతోంది. తయారీ ఇలా.. మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మి స్థానికంగా ఒక గృహంలో పిండిమరను ఏర్పాటు చేశారు. ముందుగా సిరిధాన్యాల రాశులను సిద్ధం చేసుకొని వీటిని మిల్లులో పిండి పట్టుకొని, జల్లెడ పట్టి, తర్వాత పిండిని ముద్దగా వత్తాలి. ఇలా సిద్ధం చేసిన ఒక కేజీ పిండిలో అరకేజీ బిస్ క్రీమ్, 45 గ్రాముల పంచదార, పైనాపిల్ లేదా వెనిలా ఫ్లేవర్‌ను రెండుమూతలు కలుపుతారు. తర్వాత పిండిని మరోసారి ఒత్తి, బిస్కెట్ కట్టర్‌తో కావాల్సిన ఆకారంలో కట్ చేస్తున్నారు. వీటిని.. ఒవెన్‌ను ప్రీ హీట్ చేసి గంట తర్వాత బయటకు తీస్తారు. చల్లారిన తర్వాత డబ్బాల్లో నింపి గాలి జొరబడకుండా గట్టిగా మూతలు పెడుతున్నారు. ఇవి దాదాపు నెల రోజులపాటు నిల్వ ఉంటాయి. వీటి తయారీ కోసం కొనుగోలు చేసిన యానిట్ ద్వారా.. ఖాళీ సమయాల్లో గోధుమలు, బొబ్బర్లు, శనగలు, పెసలు, మినుములు, బియ్యం (తడి, పొడి) పట్టడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్న భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీఓ పమెల సత్పథి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఈ బిస్కెట్లను జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. – ఎండి. ముజాఫర్‌ఖాన్, సాక్షి, అశ్వారావుపేట రూరల్, భద్రాది కొత్తగూడెం ప్రభుత్వం ప్రోత్సహించాలి మార్కెట్లో చాలా బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సిరిధాన్యాలతో చేసినవి పౌష్టికాహారం అని చాలామంది ఆసక్తితో కొంటున్నారు. మేం కూడా నాణ్యత దెబ్బతినకుండా వీటిని తయారు చేస్తున్నాం. అనేక రోగాలకు ఇవి సంజీవనిలా పని చేస్తాయి. ప్రభుత్వం ప్రోత్సహించి, వీటిని హాస్టళ్ల సరఫరాకు అవకాశం కల్పిస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది. – మొడియం రమాదేవి, రామన్నగూడెం అప్పట్లో కూలి దొరక్కఇబ్బంది పడ్డాం.. యూనిట్ పెట్టకముందు ఉపాధి కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కూలి పనులు లేని రోజుల్లో పైసలుండేవి కావు. ఈ యూనిట్ పెట్టిన తర్వాత ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నా. ఈ బిస్కెట్లను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దుకాణాల్లో విక్రయించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాం. – నారం కుమారి, రామన్నగూడెం -
జగన్‌తో ఖమ్మం ఎంపీ, అశ్వారావుపేట ఎమ్మెల్యే భేటీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కలుసుకున్నారు. సోమవారమిక్కడ క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల ప్రజలకు సంబంధించిన సమస్యలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నించినప్పుడు ఆయనపై టీడీపీ నాయకులు జరిపిన దాడి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ దాడిని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఖండించారని, తాటి వెంకటేశ్వర్లుకు ఆయన సానుభూతిని తెలియజేసి పరామర్శించారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలు చర్చకు వచ్చాయని ఆయన చెప్పారు. -
ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా..
అశ్వారావుపేట బంద్ సక్సెస్ గిరిజనులంటే టీడీపీకి చులకన: ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పినపాక, పాలేరు, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. తెలంగా ణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకు లు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎ దుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముంపు ముం డలాల్లోని గిరిజనులు, ఆదివాసీలంటే టీడీపీకి చులకనగా ఉందన్నారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఎం పీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు అనుచరు లు దాడి చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ పాల్గొన్నారు. ఎంపీ మాగంటి బాబును అరెస్టు చేయాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ హైదరాబాద్: పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నాయకుడు, గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే మాగంటి బా బును, ఆయన అనుచరులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలిపిన కుక్కునూరులో మండల కేంద్రంలో పశ్చిమగోదావరి జిల్లా అధికారులు సమావేశం నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యేగా తాటి వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేతలు అడ్డుకున్నారని గట్టు తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేవి, నీకు ఇక్కడ పనేంటంటూ ఎంపీ మాగంటి బాబే స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడికి పూనుకున్నారని వెల్లడించారు. ఈ దాడి ఘటనపై జిల్లాలోని సహచర సీపీఎం, టీఆర్ఎస్ గిరిజన ఎమ్మెల్యేలు గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు. ఎమ్మెల్యేపై దాడి అమానుషం: హరీశ్‌రావు తూప్రాన్: అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ముంపు మండలాలపై స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించి అవమానపరిచారన్నారు. కనీసం ఎమ్మెల్యే అని చూడకుండా సొమ్మసిల్లేలా పిడిగుద్దులతో దాడిచేయడం హేయమన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరితే దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై ఇప్పటివరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేయలేదని, ఈ దాడిని ఆయన సమర్ధిస్తున్నారా? ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు. -
ఆయిల్‌ఫెడ్ కుంభకోణం అక్రమార్కులపై కొరడా
‘సాక్షి’ కథనంపై కదిలిన అధికార యంత్రాంగం హైదరాబాద్: అశ్వారావుపేట ఆయిల్‌పామ్ క్రషింగ్ ఫ్యాక్టరీ అక్రమాలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తుంది. అక్కడ జరుగుతున్న అక్రమాల కారణంగా ఏకంగా రూ. 450 కోట్ల కుంభకోణం జరిగిందని ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెలిసింది. గత ఆదివారం ‘తెట్టులోనే ఉంది గుట్టు’ శీర్షికతో ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనంతో హైదరాబాద్ ఆయిల్‌ఫెడ్ ఎండీ చర్యలు ప్రారంభించారు. ఫ్యాక్టరీ మేనేజర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని తప్పించి, మరో అధికారి రమేష్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. చంద్రశేఖర్‌రెడ్డి సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. సీఎం కార్యాలయ అధికారులు ఆయిల్‌ఫెడ్ నుంచి కుంభకోణంపై వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా ముడిచమురును బయటకు పంపించి అక్రమ రవాణా చేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. ముడిచమురు రికవరీని తక్కువగా చూపిస్తూ ప్రై వేటు కంపెనీలతో కుమ్మక్కై కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి విదితమే. పైస్థాయి అధికారులూ నిందితులేనా? ఈ కుంభకోణంలో ఫ్యాక్టరీ మేనేజర్ సహా మరో ముగ్గురిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పైస్థాయి అధికారుల పాత్రపైనా చర్చ జరుగుతోంది. బుధవారం ఈ వివాదంపై ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ స్వయంగా అశ్వారావుపేట వెళ్లి విచారణ జరపనున్నారు. అనంతరం ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది కూ డా ఆయన తేలుస్తారు. కిందిస్థాయి నుంచి జనరల్ మేనేజర్ ఆ పైస్థాయి అధికారుల పాత్రపైనా అనుమానాలున్నట్లు ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఇదిలావుంటే పోలీసు విచారణ జరుగుతోందని ఆయిల్‌ఫెడ్ ఎండీ వీఎన్.విష్ణు చెప్పారు. మేనేజర్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. -
సిగ‘రేటు’ రెట్టింపు ధరలకు విక్రయం
అశ్వారావుపేట: ప్రతి బడ్జెట్లో సిగరెట్ల ధరలను ఎంతోకొంత పెంచుతారని వ్యాపారులకు తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకుని ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అశ్వారావుపేటలోని కిరాణా, పాన్‌షాప్ దుకాణదారులు సిగరెట్లను బ్లాక్ చేసేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొత్త ధరలు అమల్లోకి వచ్చాయోలేదో వెంటనే సిగరెట్ ధరలను అమాంతం పెంచేశారు. రూ.9కి అమ్మాల్సిన సిగరెట్‌ను రూ.13కు విక్రయిస్తున్నారు. ఒక్క అశ్వారావుపేట పట్టణంలోనే రోజుకు రూ.2 లక్షల టర్నోవర్ జరిగే సిగరెట్ వ్యాపారంలో రూ.60వేలు అదనంగా దోచుకుంటున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రమే అయినా సిగరెట్లను సరఫరా చేసే పలు ప్రైవేటు కంపెనీలకు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారు)లు లేరు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఇక్కడి వ్యాపారులు హోల్‌సేల్ ధరలకు కొనుగోలు చేస్తారు. వీరి వద ్దనుంచి స్థానిక పాన్‌షాపులు, చిరువ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఒక్కో సిగరెట్‌పై 50 పైసలు నుంచి రూపాయి వరకు లాభం చూసుకొని అమ్ముతారు. బడ్జెట్‌కు సిగరెట్ల ధరలు పెరుగుతున్నాయని ప్రచారం జరగడంతో హోల్‌సేల్ వ్యాపారులు తెలివిగా స్టాకును బ్లాక్ చేసేశారు. ఇప్పుడు దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న చందంగా సిగరెట్ల దందా కొనసాగిస్తున్నారు. దండుకునే మార్గాలెన్నో... దశాబ్దాల తరబడి సిగరెట్ వ్యాపారంలో ఆరితేరిన అశ్వారావుపేటలోని కొందరు వ్యాపారులకు బడ్జెట్ సమయంలో స్టాకు బ్లాక్ చేయాలో.. వద్దో తెలుసు. కావాలనే వారు సిగరెట్లను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని పాన్‌వాలాలు లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు గోల్డ్ఫ్లాక్ కింగ్ సిగరెట్ 10 పీస్‌ల పెట్టెపై ఎమ్మార్పీ రూ.85 ఉంటుంది. దీన్ని హోల్‌సేల్ వ్యాపారులు పాన్‌షాప్ వారికి గతంలో రూ.80 నుంచి రూ.85 వరకు విక్రయించేవారు. బడ్జెట్ ఊసు మొదలయినప్పటి నుంచి సిగరెట్ పెట్టె ధర రూ.130కి పెరుగుతుందట అని వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తారు. తీరా బడ్జెట్లో సిగరెట్ రేట్లు పెంచగానే పాత స్టాకునే రూ.130కి అంటగడుతున్నారు. ఇదేమిటంటే.. ‘ఇష్టం ఉంటే తీసుకో.. లేకుంటే లేదు..’ అనటంతో చేసేదేమీ లేక అధిక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నామని పాన్దుకాణదారులు వాపోతున్నారు. రూ.10కి అమ్మాల్సిన సిగరెట్‌ను రూ.13 నుంచి వీలైనంత పెంచి అమ్ముతున్నారు. స్టాకును బ్లాక్‌చేసిన వారు లక్షలు గడిస్తుంటే.. రిటైల్ వ్యాపారులు వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నారు. హోల్సేలర్ల దోపిడీని అరికట్టాల్సిందిగా రిటైల్‌వ్యాపారులు, ధూమపాన ప్రియులు కోరుతున్నారు.