పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉంటున్న ఆ గిరిపుత్రికలు జీవనోపాధి కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఆదినుంచీ తమ ఆహారంలో భాగమే అయిన రాగి, జొన్న, కొర్ర, సజ్జలు వంటి సిరిధాన్యాలకు నేటి ఆధునిక సమాజంలో లభిస్తున్న ఆదరణను చూసి.. వాటినే ఆదాయ వనరుగా మలచుకున్నారు. నాబార్డు సాయంతో ఇంటివద్దే బిస్కెట్లు తయారు చేస్తూ.. మార్కెట్‌లో వీటిని విక్రయిస్తూ.. ఆదాయం పొందుతున్నారు. ఒకప్పుడు రోజుకూలి దొరక్క అష్టకష్టాలు పడిన ఈ ఆడబిడ్డలు ఈరోజు వేలాది రూపాయలు ఆర్జిస్తూ.. మా సిరిసంపదలు సిరిధాన్యాలే అని ఆనందంగా చెబుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్నగూడెంలో అన్నీ గిరిజన కుటుంబాలే జీవిస్తున్నాయి. కూలి పనులు చేసుకుంటేనే వీరికి ఇల్లు గడిచేది. అయితే.. రోజూ పని దొరక్కపోవడం, పుట్టి పెరిగిన మన్యం వీడి వలసపోలేని పరిస్థితిలో నలుగురు మహిళలు మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మిలు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. రోగాల నివారణకు, ఆరోగ్యానికి సిరిధాన్యాలు ఎంతో మేలు చేస్తాయని ఇటీవలి కాలంలో విస్తృత అవగాహన పెరుగుతున్న క్రమంలో వీరి ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. వాస్తవానికి సిరిధాన్యాలు గిరిజన బిడ్డలైన వీరికి అనాదిగా ఆహారమే మరి. వీటినే.. ఇప్పుడు ఇలా ఉపాధికి ఎంచుకోవడం విశేషం. వీళ్ల ఆలోచనకు నాబార్డు వారి సహకారం తోడైంది. బిస్కెట్ల తయారీకి అవసరమైన యూనిట్‌ను సబ్సిడీపై రూ.75 వేలకు మంజూరు చేయడంతో.. గతేడాది అక్టోబర్‌లో ఇంట్లోనే దీనిని నెలకొల్పారు. నాటి నుంచి నలుగురూ కలిసికట్టుగా రాగి, జొన్న, కొర్ర, సజ్జలతో షుగర్, షుగర్ లెస్ బిస్కెట్లను తయారు చేస్తున్నారు. కేజీ పిండిని 52 బిస్కెట్లుగా మలుస్తూ వీటిని మార్కెట్‌లో రూ.300కు విక్రయిస్తున్నారు. ఈ యూనిట్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తే దాదాపు 40 కేజీల బిస్కెట్లు తయారవుతున్నాయి. ఇందుకోసం రూ.2వేలు పెట్టుబడికి వెచ్చిస్తుండగా.. విక్రయించడం ద్వారా రూ.12వేలు పొందుతున్నామని చెబుతున్నారు. అంటే పెట్టుబడి పోను రూ.10వేల వరకు ఆదాయం లభిస్తోంది. ఈ సొమ్మును ఈ గిరిజన మహిళలు నలుగురు సమంగా పంచుకుంటున్నారు. తద్వారా.. వీరికి రోజుకు ఒక్కొక్కరికీ రూ.2,500 లాభం దక్కుతోంది.
తయారీ ఇలా..
మొడియం రమాదేవి, నారం కుమారి, నారం వెంకటలక్ష్మి, మాడి లక్ష్మి స్థానికంగా ఒక గృహంలో పిండిమరను ఏర్పాటు చేశారు. ముందుగా సిరిధాన్యాల రాశులను సిద్ధం చేసుకొని వీటిని మిల్లులో పిండి పట్టుకొని, జల్లెడ పట్టి, తర్వాత పిండిని ముద్దగా వత్తాలి. ఇలా సిద్ధం చేసిన ఒక కేజీ పిండిలో అరకేజీ బిస్ క్రీమ్, 45 గ్రాముల పంచదార, పైనాపిల్ లేదా వెనిలా ఫ్లేవర్‌ను రెండుమూతలు కలుపుతారు. తర్వాత పిండిని మరోసారి ఒత్తి, బిస్కెట్ కట్టర్‌తో కావాల్సిన ఆకారంలో కట్ చేస్తున్నారు. వీటిని.. ఒవెన్‌ను ప్రీ హీట్ చేసి గంట తర్వాత బయటకు తీస్తారు. చల్లారిన తర్వాత డబ్బాల్లో నింపి గాలి జొరబడకుండా గట్టిగా మూతలు పెడుతున్నారు. ఇవి దాదాపు నెల రోజులపాటు నిల్వ ఉంటాయి. వీటి తయారీ కోసం కొనుగోలు చేసిన యానిట్ ద్వారా.. ఖాళీ సమయాల్లో గోధుమలు, బొబ్బర్లు, శనగలు, పెసలు, మినుములు, బియ్యం (తడి, పొడి) పట్టడం ద్వారా అదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. ఈ ప్రక్రియ గురించి తెలుసుకున్న భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పీఓ పమెల సత్పథి ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఈ బిస్కెట్లను జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం.
– ఎండి. ముజాఫర్‌ఖాన్, సాక్షి, అశ్వారావుపేట రూరల్, భద్రాది కొత్తగూడెం
ప్రభుత్వం ప్రోత్సహించాలి
మార్కెట్‌లో చాలా బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సిరిధాన్యాలతో చేసినవి పౌష్టికాహారం అని చాలామంది ఆసక్తితో కొంటున్నారు. మేం కూడా నాణ్యత దెబ్బతినకుండా వీటిని తయారు చేస్తున్నాం. అనేక రోగాలకు ఇవి సంజీవనిలా పని చేస్తాయి. ప్రభుత్వం ప్రోత్సహించి, వీటిని హాస్టళ్ల సరఫరాకు అవకాశం కల్పిస్తే చాలామందికి ఉపాధి లభిస్తుంది.
– మొడియం రమాదేవి, రామన్నగూడెం
అప్పట్లో కూలి దొరక్కఇబ్బంది పడ్డాం..
యూనిట్ పెట్టకముందు ఉపాధి కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కూలి పనులు లేని రోజుల్లో పైసలుండేవి కావు. ఈ యూనిట్ పెట్టిన తర్వాత ఇంటి వద్దే ఉండి పని చేస్తున్నా. ఈ బిస్కెట్లను గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దుకాణాల్లో విక్రయించేలా అవకాశం కల్పించాలని కోరుతున్నాం.
– నారం కుమారి, రామన్నగూడెం
Comments
Please login to add a commentAdd a comment