‘సాక్షి’ కథనంపై కదిలిన అధికార యంత్రాంగం
హైదరాబాద్: అశ్వారావుపేట ఆయిల్‌పామ్ క్రషింగ్ ఫ్యాక్టరీ అక్రమాలపై ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తుంది. అక్కడ జరుగుతున్న అక్రమాల కారణంగా ఏకంగా రూ. 450 కోట్ల కుంభకోణం జరిగిందని ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి తెలిసింది. గత ఆదివారం ‘తెట్టులోనే ఉంది గుట్టు’ శీర్షికతో ‘సాక్షి’ మెయిన్ పేజీలో ప్రచురితమైన కథనంతో హైదరాబాద్ ఆయిల్‌ఫెడ్ ఎండీ చర్యలు ప్రారంభించారు. ఫ్యాక్టరీ మేనేజర్‌గా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డిని తప్పించి, మరో అధికారి రమేష్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. చంద్రశేఖర్‌రెడ్డి సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. సీఎం కార్యాలయ అధికారులు ఆయిల్‌ఫెడ్ నుంచి కుంభకోణంపై వివరాలు తీసుకున్నట్లు సమాచారం. అయితే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాల ద్వారా ముడిచమురును బయటకు పంపించి అక్రమ రవాణా చేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. ముడిచమురు రికవరీని తక్కువగా చూపిస్తూ ప్రై వేటు కంపెనీలతో కుమ్మక్కై కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ ‘సాక్షి’ బయటపెట్టిన సంగతి విదితమే.
పైస్థాయి అధికారులూ నిందితులేనా?
ఈ కుంభకోణంలో ఫ్యాక్టరీ మేనేజర్ సహా మరో ముగ్గురిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో పైస్థాయి అధికారుల పాత్రపైనా చర్చ జరుగుతోంది. బుధవారం ఈ వివాదంపై ఖమ్మం జిల్లా ఎస్పీ రంగనాథ్ స్వయంగా అశ్వారావుపేట వెళ్లి విచారణ జరపనున్నారు. అనంతరం ఈ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉందనేది కూ డా ఆయన తేలుస్తారు. కిందిస్థాయి నుంచి జనరల్ మేనేజర్ ఆ పైస్థాయి అధికారుల పాత్రపైనా అనుమానాలున్నట్లు ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఇదిలావుంటే పోలీసు విచారణ జరుగుతోందని ఆయిల్‌ఫెడ్ ఎండీ వీఎన్.విష్ణు చెప్పారు. మేనేజర్ సహా మరికొందరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు.
ఆయిల్‌ఫెడ్ కుంభకోణం అక్రమార్కులపై కొరడా
Published Wed, Sep 17 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement