ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా.. | In protest against the attack on the MLA | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా..

Published Sat, Sep 20 2014 12:36 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా.. - Sakshi

ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా..

అశ్వారావుపేట బంద్ సక్సెస్
గిరిజనులంటే టీడీపీకి చులకన:
ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

 
ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై దాడికి నిరసనగా శుక్రవారం చేపట్టిన అశ్వారావుపేట బంద్ విజయవంతమైంది. ఈ బంద్‌కు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. ఏలూరు ఎం పీ మాగంటి బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. పినపాక, పాలేరు, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. తెలంగా ణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకు లు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఎ దుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముంపు ముం డలాల్లోని గిరిజనులు, ఆదివాసీలంటే టీడీపీకి చులకనగా ఉందన్నారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై ఎం పీ మాగంటి బాబు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు అనుచరు లు దాడి చేయడాన్ని ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ పాల్గొన్నారు.
 
ఎంపీ మాగంటి బాబును అరెస్టు చేయాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

హైదరాబాద్: పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నాయకుడు, గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఎంపీ మాగంటి బాబు, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వెంటనే మాగంటి బా బును, ఆయన అనుచరులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు శుక్రవారమిక్కడ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్ర ప్రాంతంలో కలిపిన కుక్కునూరులో మండల కేంద్రంలో పశ్చిమగోదావరి జిల్లా అధికారులు సమావేశం నిర్వహించగా.. స్థానిక ఎమ్మెల్యేగా తాటి వెంకటేశ్వర్లు ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేతలు అడ్డుకున్నారని గట్టు తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేవి, నీకు ఇక్కడ పనేంటంటూ ఎంపీ మాగంటి బాబే స్వయంగా తమ పార్టీ ఎమ్మెల్యేపై దాడికి పూనుకున్నారని వెల్లడించారు.  ఈ దాడి ఘటనపై జిల్లాలోని సహచర సీపీఎం, టీఆర్‌ఎస్ గిరిజన ఎమ్మెల్యేలు గవర్నర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నారని   తెలిపారు.  
 
ఎమ్మెల్యేపై దాడి  అమానుషం: హరీశ్‌రావు

తూప్రాన్: అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారీ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఖమ్మం జిల్లా ముంపు మండలాలపై స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా సమావేశం నిర్వహించి అవమానపరిచారన్నారు. కనీసం ఎమ్మెల్యే అని చూడకుండా సొమ్మసిల్లేలా పిడిగుద్దులతో దాడిచేయడం హేయమన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరితే దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. దీనిపై ఇప్పటివరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన చేయలేదని, ఈ దాడిని ఆయన సమర్ధిస్తున్నారా? ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement