వాతావరణ మార్పులపై తక్షణం స్పందించండి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, అప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పర్యావరణవేత్త, ది ఎనర్జీ అండ్ ది రిసోర్స్ సంస్థ డెరైక్టర్ రాజేంద్రకుమార్ పచౌరి పేర్కొన్నారు. భవిష్యత్ తరాల ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా వర్తమాన సమాజ అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధికి అసలైన నిర్వచనమన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏదైనా దుర్ఘటన జరిగి భారీ మూల్యం చెల్లించే వరకు చూసే ధోరణి సరికాదని ఆయన హెచ్చరించారు. హెచ్‌ఐసీసీలో నాలుగు రోజులుగా జరుగుతున్న ‘11వ మెట్రోపొలిస్ అంతర్జాతీయ మేయర్ల సదస్సు’ శుక్రవారంతో ముగిసింది.
చివరి రోజున ‘వాతావరణ మార్పులు, విశ్వ నగరాలు’ అన్న అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో రాజేంద్ర పచౌరి పాలుపంచుకున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో తాజా పరిస్థితిపై కచ్చితమైన శాస్త్రీయ సమాచారం ప్రపంచం ముందుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటివి వాతావరణ మార్పులకు శాస్త్రీయ ఆధారాలుగా పేర్కొన్నారు. ఈ శాతాబ్దం చివరి నాటికి వడగాల్పులు తీవ్రమవుతాయని, భారీ వర్షాలూ కురుస్తాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పట్టణ ప్రాంత వాతావరణ మార్పుల ప్రమాదాలు, దుష్ర్పభావాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర వ్యవహారాలు, సేవలు, సదుపాయాలపై పర్యావరణ మార్పు ప్రభావం భవిష్యత్తులో తీవ్రంగా ఉండబోతుందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ పరిరక్షణకు పట్టణ ప్రాంతాల్లో శీఘ్ర చర్యలు అవసరమని నొక్కిచెప్పారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ధరిత్రిపై 2 శాతమే విస్తరించి ఉన్న నగరాలు.. ఏకంగా 78 శాతం ఇంధన శక్తిని వినియోగిస్తూ 60 శాతం వరకు కాలుష్యాలను విడుదల చేస్తున్నాయన్నారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ర్పభావాలతో ఎక్కువగా మురికివాడల ప్రజలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.