
కాయ్ రాజా కాయ్
- సీమాంధ్ర ఎన్నికలపై సిటీలో పెద్ద ఎత్తున పందేలు
- గెలుపు ఓటములపై సర్వత్రా చర్చ
- ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లోనూ ఆసక్తి
సాక్షి, సిటీబ్యూరో : ఉద్వేగభరితంగా సాగిన సీమాంధ్ర ఎన్నికలపై నగరంలో భారీ ఎత్తున బెట్టింగ్‌ల పర్వానికి తెర లేచింది. పదిహేను, ఇరవై రోజుల పాటు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం.. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న తరుణంలో.. బుధవారం జరిగిన ఎన్నికలపై బెట్టింగ్‌రాయుళ్లు భారీగా రంగంలోకి దిగారు. దీంతో నగరంలో పలుచోట్ల ఆయా పార్టీల పక్షాన అభిమానులు లక్షలాది రూపాయల పందేలు కాశారు.
వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ ఉండటంతో బెట్టింగ్‌లు సైతం ఈ రెండు పార్టీల మధ్యే నడిచాయి. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు నగరం నుంచి కూడా లక్షలాది మంది ఓటర్లు తరలివెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల సరళి, ఓటర్ల తీరుపై సర్వత్రా ఆసక్తికర చర్చలు జరిగాయి.
రాష్ట్ర విభజన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి గెలుపు నల్లేరు మీద బండి నడకగా భావిస్తూ ఆ పార్టీ అభిమానులు బెట్టింగ్ కాస్తే.. టీడీపీ- బీజేపీ పొత్తు, పవన్ కల్యాణ్‌పై ఆశలు పెట్టుకున్న అభిమానవర్గాలు అటువైపు పందెం కాశాయి. దీంతో సీమాంధ్రలో జరిగిన ఎన్నికలు హైదరాబాద్‌లో తీవ్ర ఉత్కంఠను రేపాయి.
వైఎస్సార్‌సీపీ గెలుపుపైనే ధీమా
ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ఆశలు పెంచుకున్నప్పటికీ వైఎస్సార్‌సీపీయే విజయభేరి మోగిస్తుందంటూ అనేకమంది పందెంరాయుళ్లు బెట్టింగ్‌కు దిగారు. ఆ పార్టీ కనీసం 140 అసెంబ్లీ స్థానాలు, 25కి తగ్గకుండా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ కొందరు పోటీకి దిగితే.. 130 అసెంబ్లీ స్థానాలు కచ్చితంగా గెలిచి తీరుతుందంటూ మరికొందరు బెట్టింగ్‌రాయుళ్లు పందెం కాశారు. నగరంలోనూ, శివారు ప్రాంతాల్లోనూ ఈ బెట్టింగ్‌లు జోరుగా సాగాయి. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లోనూ సీమాంధ్ర ఎన్నికలపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి.
ఎవరికి వారు ఆయా పార్టీల గెలుపు, ఓటములపై విశ్లేషిస్తూ చర్చల్లో పాల్గొన్నారు. కొందరు ఉన్నతాధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బెట్టింగ్‌లను సైతం ఆసక్తిగా పరిశీలించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, పంజగుట్ట, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌ల పర్వం బాగా నడిచింది.
ఈ బెట్టింగుల్లో పాల్గొన్నవారు లక్షలాది రూపాయల పందేలు కాశారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశంకు ఓటమి తప్పదని, వైఎస్సార్‌సీపీయే అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందంటూ ఎక్కువమంది పందేలు కాయడం గమనార్హం. వారి బెట్టింగులు హిట్టా ఫట్టా తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే మరి.