
నగరమా.. నరకమా?
- పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం
- మార్కెట్ల వద్ద మరీ దారుణం
- డంపింగ్ యార్డులుగా పర్యాటక ప్రాంతాలు
- అరకొర చర్యలతో మారని దుస్థితి
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరంలో పరిస్థితి దారుణంగా తయారైంది. మురిగిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన తట్టుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పొంగుతున్న డ్రైనేజీలు.. కురిసిన కొద్దిపాటి చినుకులతో పరిస్థితి మరింత తీవ్రమైంది. బహిరంగ ప్రదేశాల్లోనే చెత్తను తగులబెడుతుండటంతో కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం నుంచి సమ్మెను ఉద్ధృతం చేయనున్నట్లు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
దీంతో పరిస్థితి మరింత విషమించే సూచనలు ఉన్నాయి. సోమవారం జోనల్, సర్కిళ్ల స్థాయిలో దీక్షలు, మంగళవారం మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు చేపట్టిన చర్యలు.. అదనపు చెత్తను కొంత మేర తగ్గించగలిగాయే తప్ప చెప్పుకోదగ్గ మార్పు లేదు. ఆరు రోజుల్లో పేరుకుపోయిన చెత్త దాదాపు 24వేల మెట్రిక్ టన్నులు కాగా... దాదాపు మూడు నాలుగు వేల మెట్రిక్ టన్నుల అదనపు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించగలిగారు. శనివారం కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడటంతో ఇప్పటికే కుళ్లిపోయిన చెత్తతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. భరించలేని దుర్గంధం వె లువడుతోంది. రోడ్ల పక్కన గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను కాల్చి వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జీహెచ్‌ఎంసీ ఈ అంశంలో చేష్టలుడిగి చూస్తోంది. కొన్ని ప్రాంతాల్లో స్థానికులు కాల్చివేస్తుండగా.. కొన్ని చోట్ల జీహెచ్‌ఎంసీయే అందుకు ప్రేరేపిస్తోంది.
వివాదాలు.. ఘర్షణలు
పనులు చేస్తున్న తాత్కాలిక కార్మికులను ఔట్‌సోర్సింగ్ కార్మికులు శనివారం కూడా వివిధ ప్రాంతాల్లో అడ్డుకున్నారు. సంతోష్‌నగర్, ఓవైసీ కాలనీ తదితర ప్రాంతాల్లో చెత్తకుప్పలను తరలించేందుకు సిద్ధమైన తాత్కాలిక సిబ్బందిని అడ్డుకొని వారితో వాదనకు దిగారు. చెత్త తరలిస్తున్న వాహనం టైర్లలో గాలి తీసేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం వద్ద ఔట్‌సోర్సింగ్ కార్మికులు వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులు కొందరు సమ్మెలో పాల్గొనకుండా మాజీ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో పనులు చేస్తున్నారని మహిళా కార్మికులు ఆరోపించారు. జీతాలు ఇక్కడ తీసుకుంటూ అక్కడ పనిచేయడమేమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చారిత్రక ప్రదేశాల్లోనూ అంతే...
ఎర్రగడ్డ, మెహదీపట్నం, కొత్తపేట, మోండా మార్కెట్ పరిసరాల పరిస్థితి చెప్పనవసరం లేదు. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు సైతం డంపింగ్ యార్డులుగా మారాయి. గోల్కొండ మోతీదర్వాజా, బంజారాదర్వాజా, చారిత్రక కఠోరహౌస్‌లతో పాటు గోల్కొండ కోట ప్రహరీ వద్ద ఉన్న కందకాలలోనూ చెత్త నిండిపోయింది. వివిధ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు సైతం చెత్తతో నిండి దారులు కనపడకుండా పోయాయి.
ప్రత్యామ్నాయంగా...
వివిధ సర్కిళ్లలో శనివారం తాత్కాలిక కార్మికులతో చెత్త తరలింపు పనులు చేపట్టారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంఓహెచ్‌లంతా ఉదయం నుంచే చెత్త తరలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఈ పనుల్లోనూ వీఐపీలు, సంపన్నులుండే ప్రాంతాలకే ప్రాధాన్యం ఇచ్చారు. మాదాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలపై చూపిన శ్రద్ధ... అంబర్‌పేట, రామ్‌నగర్ వంటి ప్రదేశాల్లో కనిపించలేదు.
కార్మికుల సమ్మెకు బీజేపీ మద్దతు
కాచిగూడ: మున్సిపల్ కార్మికుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలను బెదిరింపులతో లొంగదీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో నగరంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎక్కడి చెత్త అక్కడే గుట్టల్లా కనిపిస్తున్నా, కంపు కొడుతున్నా జీహెచ్‌ఎంసీకమిషనర్‌కు ఏమాత్రం చలనం లేదని విమర్శిం చారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. ఇప్పటికే డెంగీ కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ అధికారులు కాలం గడుపుతున్నారని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ తన ధోరణి మార్చుకుని కార్మికుల న్యాయపరమైన కోరికలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అధికారులతో కార్మికుల వాగ్వాదం
మాదాపూర్: పారిశుద్ధ్య కార్మికులు, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాదాపూర్‌లోని కుమ్మరిబస్తీలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. జోనల్ కమిషనర్ పంకజ వద్ద బాధలను వెళ్లగక్కారు. గతంలో సీఎం కేసీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఇచ్చిన హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. పర్మినెంట్ ఉద్యోగులకంటే కాంట్రాక్టు ఉద్యోగులే ఎక్కువ సమయం పని చేస్తున్నట్టు తెలిపారు. ఆస్పత్రులలో పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులలు, కార్మికుల మధ్య మాటామాటా పెరగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రవికిరణ్, స్వచ్ఛ హైదరాబాద్ నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ధర్నాలో స్థానిక నాయకులు మధు యాదవ్, ఐలేష్ యాదవ్, జంగయ్య యాదవ్ పాల్గొన్నారు.
కార్మికుల పొట్ట కొట్టొద్దు
ఈ నెలాఖరులోగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హోంమంత్రి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ హామీ ఇచ్చినప్పటికీ కొందరు నేతలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు గోపాల్ వ్యాఖ్యానించారు. ‘నోవర్క్.. నో పే’ అయినందున సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనాలందవని... రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులను జీహెచ్‌ఎంసీతో సంబంధం లేని నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ యూనియన్‌కు చెందిన 8వేల మంది శనివారం విధుల్లో పాల్గొన్నారని చెప్పారు. మరోవైపు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని సమ్మెలోని ఏడు కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి.