
ఇదేంది సారూ!!
కామారెడ్డి, న్యూస్‌లైన్: ఎన్నికల నిబంధనల మాటేమిటోగానీ, సామాన్యులు మాత్రం తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున డబ్బును స్వాధీనం చేసుకుంటోంది. పోలీసులే గాక రెవెన్యూ, పౌర సరఫరాల నిఘా తదితర విభాగాలకు చెందిన అధికారులంతా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వాహనాలలో లభించిన డబ్బుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీజ్ చేస్తున్నారు. దీంతో అత్యవసరంగా డబ్బును తీసుకెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేల కన్నా ఎక్కువ డబ్బుంటే అధికారులకు సీజ్ చేసే అధికారం ఉంది.
అయితే భిక్కనూరు మండలంలో ఓ వ్యక్తి వద్ద రూ. 40,400 మాత్రమే ఉన్నా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి సీజ్ చేశారు. బాధితుడు బోరుమన్నా వారు వినిపించుకోలేదు. ప్రతిరోజు జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బులను సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసిన డబ్బులకు సంబంధించి ఆధారాలను ఆదాయపు పన్ను శాఖకు చూపితే నిబంధనల ప్రకారం విడుదల చేస్తారని అధికారులు బాధితులకు స్పష్టం చేస్తున్నారు. అయితే తమ అవసరాల కోసం వెంట డబ్బులు తీసుకెళ్లేవారిలో అత్యధికులు సామాన్యులే కావడం వల్ల అనేక ఇక్కట్లకు గురికావలసి వస్తోంది.
పెళ్లి బంగారం కొనాలన్నా పరేషానే
బంగారం ధర అడ్డగోలుగా పెరిగింది. పెళ్లిళ్ల కోసం తక్కువలో తక్కువ ఐదు తులాలు కొనాలన్నా రూ.లక్షన్నర, బట్టల కోసం మరో రూ. 50 వేలు వెం ట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో తమ వెంట ఉన్న డబ్బులు బంగారం కొనుగోలుకు, బట్టల కొనుగోలుకు అని చెప్పినా అధికారుల అర్థం చేసుకోలేకపోతున్నారని బాధితులు పేర్కొంటున్నారు.
ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు..
వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన వారు మరీ ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. నిత్యం లక్షల్లో డబ్బు లు చేతులు మారుతుంటాయి. అయితే వెంట డబ్బు లు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ మెడికల్ రిప్రజెంటేటివ్ వద్ద నుంచి డబ్బును సీజ్ చేశారు. టైర్ల షోరూం యజమాని నుంచి, ఓ బీడీ కంపెనీకి చెం దిన గుమస్తా నుంచి డబ్బులను సీజ్ చేయడం వల్ల వారి డబ్బు ఇరుక్కుపోయింది. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చూపాల్సిన పరిస్థితుల్లో వారు అవస్థలు పడుతున్నారు.
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శెనిశెట్టి గౌరీశంకర్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు. ఎన్నికల కోసం అక్రమంగా డబ్బు లు రవాణా విషయంలో చర్యలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే వ్యాపారులు, సామాన్య ప్రజల విషయంలో సానుభూతితో వ్యవహరించాలని కోరారు.