సాక్షిప్రతినిధి, కరీంనగర్ : రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాపై ఉక్కుపాదం మోపేందుకు పౌరసరఫరాల శాఖ మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోంది. అక్రమ వ్యాపారం చేస్తున్న రైసుమిల్లర్లపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం నెలరోజులుగా తనిఖీలు చేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న కీలక సూత్రధారి, జగిత్యాల హనుమాన్ సాయి ట్రేడర్స్ యజమాని కొండా లక్ష్మణ్ (45)పై మూడురోజుల క్రితం పీడీ కేసు నమోదు చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వేసిన ప్రత్యేక బృందాల తనిఖీ నివేదికల ఆధారంగానే ఈ కేసును నమోదు చేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోనూ కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్)లో అక్రమాలు, రేషన్ బియ్యం రీసైక్లింగ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందాలు ఇంకా తనిఖీలు నిర్వహిస్తుండటంతో అక్రమ వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదికలపై గురువారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆగని ‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలు.. బయడపడుతున్న అక్రమాలు
నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రేషన్‌షాపుల ద్వారా రూపాయికే కిలో చొప్పున పంపిణీ చేస్తున్న బియ్యం అక్రమార్కులకు వరంగా మారాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ఈ దందా నిర్విరామంగా కొనసాగుతోందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. దీంతో కొంతమంది రైసుమిల్లర్లు అవే బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల శాఖకే అమ్మిన సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యత లేని సన్నబియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారన్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల పరకారం 10 శాతానికి మించి బ్రోకెన్ (నూక) రైస్ ఉండకూడదు. కానీ ఇక్కడ 35 శాతం వరకు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. ఒక్కో ఏసీకే (లారీ)లో 400 నుంచి 500 బస్తాలు పంపించే మిల్లర్లు, అందులో సగం వరకు రీసైక్లింగ్ బియ్యం కలిపినట్లు వెల్లడైంది. ఏసీకే నంబర్లు 131, 136, 137, 149, 163, 165లో 1080 బస్తాలు తేలాయి. ఇదే పద్ధతిలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి సరఫరా చేసిన 11 వేల బస్తాల్లో 35 శాతం మేరకు బ్రోకెన్ రైస్ ఉందని వెల్లడి కాగా.. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం. ఏళ్ల తరబడిగా రీసైక్లింగ్ దందా చేస్తున్న వ్యాపారులు, వారి సంస్థలపై నమోదైన 6ఏ కేసుల వారీగా జాబితాను తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందాలు సీడబ్ల్యూసీ గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, రైసుమిల్లుల్లో పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలకు చెందిన కొండా లక్ష్మణ్‌పై కేసు పీడీ కేసు నమోదు చేసిన అధికారులు మరికొందరిపై చర్యలకు సిద్ధం కావడం కలకలం రేపుతోంది.
అక్రమాలకు నిలయాలు సీడబ్ల్యూసీ గోదాములు
ప్రభుత్వం ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఇక్కడ రేషన్‌బియ్యమే రంగు మారి గోదాములకు చేరుతుండగా.. ఈ గోదాములే అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. సరిపడా నిల్వలు లేక ప్రభుత్వం ఏటా మిల్లర్లనుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, ప్రభుత్వ వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం పథకం కోసం 1.5 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ అవసరాన్ని ఆసరాగా చేసుకుని రేషన్‌బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ తరహా బాగో తం వెలుగుచూడగా.. సరఫరా అయిన 11 వేల బి య్యం బస్తాల స్థానంలో ప్రమాణాల ప్రకారం నాణ్య త కలిగిన బియ్యాన్ని ఇవ్వాలని మిల్లర్లను ఆదేశించిన కమిషనర్, ఇకపై రైసుమిల్లర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదనీ, చర్యలు కఠినంగా ఉంటాయనీ హెచ్చరించి వదిలేశారు. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం నిల్వలు ఉన్న సిడబ్ల్యూసీ, ఎస్‌డబ్లు్యసి తదితర అన్ని గోదాముల్లో నిఘా బృందాలు, సాంకేతిక సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తుండటం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment