తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్!
చంద్రబాబు వైఖరి అలాగే ఉందంటున్న పార్టీ నేతలు
తెలంగాణ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారని లోలోన మథనం
‘ఓటుకు కోట్లు’ స్కాం వెలుగుచూసినప్పట్నుంచి
అధినేతలో మార్పువచ్చిందని వ్యాఖ్యలు
పాలమూరు, డిండి ప్రాజెక్టులను వ్యతిరేకించడంపై రుసరుస
పార్టీ భవిష్యత్తుపై ఆందోళనలో నాయకులు పక్క పార్టీల వైపు చూపులు
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలు అంతర్మథనంలో పడిపోయారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబు తీరునూ ఆక్షేపిస్తున్నారు. గడిచిన కొద్ది నెలలుగా తెలంగాణలో అసలు పార్టీ అక్కర్లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మథనపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌తో తామెక్కడ పోరాడగలుగుతాం, సీఎం కేసీఆర్‌ను ఎలా ఎదుర్కొంటామని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం మూసేయడానికే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారేమోనన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ‘మా పరిస్థితి మింగలేక, కక్కలేక’ అన్నట్టుగా ఉందని ఆ పార్టీ నేతలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఇరు రాష్ట్రాల్లోని పార్టీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన ఆయన.. ఏపీ సీఎంగా చేస్తున్న ప్రకటనలు తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా ఉంటున్నాయని, దీనివల్ల ఇక్కడ ఇబ్బంది తలెత్తుతోందని పేర్కొంటున్నారు. అయితే ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకుపోయే సాహసం ఏ నాయకుడూ చేయడం లేదు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాల కోసమంటూ సోమవారం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును కలిసి చర్చించారు. కొందరు సీనియర్ నేతలు మాత్రం.. ఇక తెలంగాణలో పార్టీ మనుగడ కష్టమన్న అభిప్రాయానికి వచ్చి ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నారు.
కింకర్తవ్యం?
తెలంగాణ విషయంలో చంద్రబాబు తీరు మారదని, తనకు ఏపీయే ముఖ్యమనుకుంటున్నారని భావిస్తున్న టీటీడీపీ నేతలు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి అయిదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు ఇదే దారిలో ఉన్నారని, ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఓటుకు కోట్లు కేసుతో కొందరు ఎమ్మెల్యేల రాక ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇతర సీనియర్ నాయకులు సైతం.. ఏ పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్ బావుంటుందని సన్నిహితులను వాకబు చేస్తున్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య జైలుకు వె ళ్లి రావడం, ఇదే కేసులో చంద్రబాబు ఫోన్ సంభాషణలు వెలుగు చూడడంతో తెలంగాణ ప్రజల్లో పార్టీ పలచనైందని, తాము పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయామని పేర్కొంటున్నారు. ఓవైపు ఈ ఇబ్బందులు ఉండగానే.. మరోవైపు బాబు తన ప్రకటనలతో రోజుకో సమస్య సృష్టిస్తున్నారని, ఇలా అయితే పార్టీలో కొనసాగలేమని కొందరు నేతలు సీనియర్ల వద్ద అన్నట్లు తెలిసింది.
తెలంగాణ వ్యతిరేక ప్రకటనలతో..
ఏపీ సీఎంగా చ ంద్రబాబు కొద్ది రోజులుగా తెలంగాణ వ్యతిరేక ప్రకటనలకు, విమర్శలకు పదును పెట్టారు. వరసగా విడుదల చేస్తున్న విధాన ప్రకటనల్లో ఇదే స్పష్టమవుతోందని నేతలు అంటున్నారు. ఏపీలో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు రాష్ట్ర విభజనపై చేస్తున్న ప్రకటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. విభజన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకు వచ్చి విమర్శలు చేయడం దాన్నే సూచిస్తోందని భావిస్తున్నారు. పట్టిసీమ బహిరంగ సభలో చంద్రబాబు రాష్ట్ర విభజనపై తన అక్కసంతా వెళ్లగక్కారని తెలంగాణ టీడీపీ నేతలు రుసరుసలాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు తెరలేపి, ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా ఇరుక్కున్నప్పట్నుంచీ తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరిలో బాగా మార్పు వచ్చిందని పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా గుర్తింపు ఉన్న మహబూబ్‌నగ ర్, ఫ్లోరైడ్ పీడ తో మరణ యాతన పడుతున్న నల్లగొండ జిల్లాలకు కృష్ణా నీటిని అందించే ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిన అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో ఇక పార్టీ కార్యకలాపాలతో లాభం లేదన్న నిశ్చితాభిప్రాయానికి బాబు వచ్చారేమోనని అనుమానిస్తున్నారు. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీలోనూ బాబు వ్యవహార శైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెబుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న టీటీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.