
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తే న్యాయం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలోనూ ఉండదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారతారని తాను అనుకోవడం లేదన్నారు. కొందరికి కొన్ని బలహీనతలున్నాయని, వాటిని తెలుసుకుని అండగా ఉంటే ఎవరూ పార్టీని వీడివెళ్లరని చెప్పారు. పార్టీ వీడాలనుకునే వారిని గుర్తించి వారితో పాటు కేడర్‌కు ధైర్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
కుంతియా, ఉత్తమ్‌తో పాటు హైకమాండ్ రంగంలోకి దిగి ఇందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయినందునే ఓడిపోయామని చెప్పారు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో తన గెలుపునకు కూడా అన్ని కారణాలున్నాయన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం తన భార్య నిర్మలకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరనున్నట్టు ఆయన చెప్పారు. తన కుమార్తె జయను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచన లేదని, ఎన్‌ఎస్‌యూఐలో క్రియాశీలకంగా పనిచేయించి సంస్థాగతంగా ఆమెను చురుకుగా తయారు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment