సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, ఫెడరేషన్ల బకాయిలకు మోక్షం కలిగింది. వీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2015–16 వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.102.8 కోట్లు ఇచ్చేందుకు సంబంధించిన ఫైలుపై శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. ఇందుకు సంబంధించి బీఆర్‌ఓ (బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లు) ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. దీంతో నిధులు విడుదలైన వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసేందుకు బీసీ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ బకాయిల విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా 12,218 మందికి లబ్ధి కలగనుంది. అదేవిధంగా ఫెడరేషన్లకు సంబంధించిన బకాయిలు విడుదల కావడంతో సంఘాలకు సాంత్వన లభించినట్లైంది.
స్వయం ఉపాధికి చేయూత...
స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలని భావిస్తోంది. ఈక్రమంలో కార్పొరేషన్, ఫెడరేషన్లకు కేటాయించిన నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయనుంది. ప్రస్తుతం బీసీ కార్పొరేషన్, 12 బీసీ ఫెడరేషన్ల బకాయిల విడుదలకు పచ్చజెండా ఊపింది. 2016–17 వార్షికంలో నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో లబ్ధిదారుల ఎంపిక సైతం నిలిచిపోయింది. ఈక్రమంలో 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి కేటాయించిన నిధులను వేగవంతంగా విడుదల చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అదేవిధంగా ఫెడరేషన్లకు కూడా సంతృప్తికర స్థాయిలో కేటాయింపులు చేస్తామన్నారు. ఈమేరకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment