* కాదంటే ఎందాకైనా కొట్లాటకు సిద్ధం... వ్యవసాయ వర్సిటీలో కేసీఆర్ వ్యాఖ్య
* పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు
* దమ్ముంటే బాబు మాతో అభివృద్ధిలో పోటీపడాలి
* తెల్లారి లేస్తే గొడవలు ఎవరికీ మంచిది కాదు
* మా నేతల పేర్లు పెట్టుకుంటే మీకెందుకు ఏడుపు?
* మా పిల్లల ఫీజులు మేం కట్టుకుంటాం..
* మంది సొమ్ము మాకొద్దు
* పిచ్చి పనులు మానుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు హితవు
* ఎన్జీ రంగా వర్సీటీకి జయశంకర్ వ్యవసాయ వర్సిటీగా నామకరణం
సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే తమతో అభివృద్ధిలో, మంచి పనుల్లో పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తెల్లారి లేస్తే గొడవలు పడటం ఎవరికీ మంచిదికాదని హితవు పలికారు. ‘మీ బతుకు మీరు బతకండి.. మా బతుకు మేం బతుకుతాం..’ అని ముక్కుసూటిగా స్పష్టం చేశారు. బుధవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ‘జయశంకర్ వ్యవసాయ యూని వర్సిటీ’గా కేసీఆర్ నామకరణం చేశారు.
ఈ సందర్భంగా వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు.. మన కూరగాయల పథకం’ సభలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. వ్యవసాయ వర్సిటీకి జయశంకర్ పేరు పెట్టడంపై ఆంధ్రావాళ్లు కుళ్లుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించుకుని మన సంస్థలను మనం విడదీసుకుంటున్నామని, మన నేతల పేర్లు పెట్టుకుంటున్నామని ఆంధ్రావాళ్లు ఒకటే బాధపడుతున్నారని దుయ్యబట్టారు.
‘‘ఇది మా యూనివర్సిటీ. మేం జయశంకర్ పేరు పెట్టుకున్నాం. మీకెందుకు ఏడుపు? ఇది ఆరంభం మాత్రమే. హైదరాబాద్‌లో మార్చేటివి చాలా ఉన్నాయి. మాకు అక్కర్లేని పేర్లు, అక్కర్లేని విగ్రహాలు... మావి కానివి, మాకు తెలియనివి చాలా ఉన్నాయి. ఆంధ్రా ముఖ్యమంత్రికి, మంత్రులకు, అక్కడి ప్రజలకు, మేధావులకు ఒక మాట చెబుతున్నా... మీ బతుకు మీరు బతకండి.. మా బతుకు మేం బతుకుతాం. పొద్దున లేచి పంచాయితీ పెట్టమంటే మేం ఎంతకైనా పెడతాం. కొట్లాటకు తెలంగాణ ఎప్పుడైనా తయారుగానే ఉంటది. మా బతుకే పోరాటం. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే నేటి దాకా అదే.. మేమేనా భయపడేది? ఇది ఇద్దరికీ మంచిది కాదు. చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం మీది మీరు ఏలుకోండి. మాది మేం ఏలుకుంటాం. దీన్ని పెద్దది చేయొద్దు’’ అని కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు.
‘‘విభజన చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారమే వ్యవసాయ వర్సిటీని వేరు చేసుకున్నాం. మీరు మీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రాలో బ్రహ్మాండంగా పెట్టుకోండి. ఇక్కడ చదువుకుంటామంటే చట్ట ప్రకారం 15 శాతం సీట్లు ఇస్తాం. మా పిల్లల ఫీజులు మేం కట్టుకుంటాం. మీ పిల్లల ఫీజులు మీరు క ట్టుకోండి’’ అని తేల్చి చెప్పారు.
మీ పిల్లల ఫీజులు కట్టుకోలే రా?
ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలకు ఆ రాష్ర్ట ప్రభుత్వమే ఫీజులు చెల్లించుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతరుల సొమ్ము మీద ఆశ పడకుండా.. ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని చంద్రబాబుకు హితవు పలికారు. ‘‘ఆంధ్రాలో చ దివే మా పిల్లలకు మేమే ఫీజు కట్టుకుంటాం. లక్షయాభై వేల కోట్ల రూపాయలతో సింగపూర్‌లాంటి రాజధాని కడతామంటరు.. పిల్లల బడిఫీజు కట్టడం చేతకాదా? ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా వాళ్లు(ఆంధ్రా) అలాగే మాట్లాడుతున్నారు. అలాంటివేవీ ఇప్పుడు సాగవు.
ఆంధ్రా ముఖ్యమంత్రి, మంత్రులారా మీ పిచ్చి పనులు బంద్ చేసుకోండి. మీ మానాన మీరుండండి.. మా మానాన మేముంటం. ఎవరి పని వారు చేసుకుందాం. తెలంగాణలో రాజకీయాల గురించి చంద్రబాబు ఎకసెక్కాలు మాట్లాడుతున్నాడు. ప్రజలకు మంచి పనులు చేయడంలో, అభివృద్ధిలో పోటీ పడండి. మీకు ఇతరుల దాని మీద ఆశ. మాది గాని దాన్ని మాదేనని మేమనం. మాకు అది గిట్టనే గిట్టదు’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఆరేడు క్రాప్ కాలనీలుగా తెలంగాణ!
జిల్లాలవారీగా భూముల రకాలను విశ్లేషించి వేర్వేరుగా పంట కాలనీలు ఏర్పాటు చేస్తామని, ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. ‘జిల్లాలవారీగా ఉష్ణోగ్రత, గాలి తీవ్రత, వర్షపాతం ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ జిల్లా ఏ పంటలకు అనుకూలంగా ఉంది, ఏ మట్టి ఏ పంటలకు అనుకూలంగా ఉందనే అంశాలను గుర్తించి రాష్ట్రాన్ని ఆరేడు పంట కాలనీలుగా విభజిస్తాం. మొత్తం భూసార, భూగర్భ జలాల పరీక్షల్ని ప్రభుత్వమే చేస్తుంది. అవసరమైతే దేశంలోని ప్రయోగశాలలన్నింటినీ కొద్ది నెలలు వినియోగించుకుని.. రెవెన్యూ డివిజన్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తాం’ అని కేసీఆర్ తెలిపారు.
విత్తనోత్పత్తి ద్వారా ప్రతీ రైతు కోటీశ్వరుడు కావాలని అభిలషించారు. ఈ పంటల కోసం నాణ్యమైన విత్తనాలను అందించడానికి, రైతుల నుంచి ఉత్పత్తులను మార్కెట్ ధరకు కొనడానికి అవసరమైతే తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ బ్రాండ్‌తో విత్తనాలను విక్రయిస్తామన్నారు. రాష్ర్టంలో గ్రీన్‌హౌజ్ సాగు పద్ధతిని ప్రోత్సహిస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘గ్రీన్‌హౌజ్ మన దగ్గర ఉన్నదే తక్కువ. రాబోయే రోజుల్లో తెలంగాణలో పెలైట్ ప్రాజెక్టు కింద వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌజ్‌ను ప్రభుత్వం చేపడుతుంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ చూసినా గ్రీన్‌హౌజే కనపడతది. గ్రీన్‌హౌజ్‌లకు కరెంటు బిల్లును మాఫీ చేస్తాం. వీటికిచ్చే విద్యుత్‌ను కూడా వ్యవసాయ విద్యుత్‌గానే పరిగణిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని ఏం వెలగబె ట్టిండు?
అధికారంలోకి వచ్చి 60 రోజులైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ తిప్పికొట్టారు. ‘‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కిషన్‌రెడ్డి అదే పనిగా మాట్లాడుతున్నడు. 60 రోజుల్లో ఏది కాలేదంటున్నడు. మీ ప్రధానమంత్రే ఏమీ వెలగబెట్టలేదక్కడ. తెలంగాణకు అధికారులను కేటాయించాలని ప్రధానికి 20 ఉత్తరాలు రాశాను. ఇప్పటివరకు కేటాయింపు రాలేదు. మనకు అధికారులు లేరు.
తాత్కాలికంగా ఆర్డర్ టూ వర్క్ ఆదేశాలతో కేవలం 40 మందితోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. ప్రధానికి స్వయంగా చెప్పినా.. ఉత్తరాలు రాసినా ఫలితం లేదు. కిషన్‌రెడ్డి.. నీకు అంత దమ్ముంటే ఆ పని చేసుకునిరా. మేం తొందరపడదల్చుకోలేదు. ఇంకా 30 రోజుల దాకా ఏం చేయం. చేసేది పకడ్బందీగా చేస్తాం. పిచ్చి పనులు చేయదలచుకోలేదు. మీరు చేసిన దుర్మార్గాలను కడగాలి. తప్పులను దొరకబట్టాలి. ఇప్పుడు విధాన రూపకల్పన దశలో ఉన్నాం’’ అని వాఖ్యానించారు.
పొన్నాలా..సిగ్గులేకుండా మాట్లాడకు!
రాష్ర్టంలో విద్యుత్ కష్టాలకు గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, ఇప్పుడు ఆ పార్టీల నేతలే విద్యుత్‌పై తెగ మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘సమైక్య రాష్ట్రంలో విద్యుత్ విషయంలో మనకు అన్యాయం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినా మూడేళ్ల వరకు పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని నేను ఎన్నికల్లోనే చెప్పాను. సోలార్ పవర్‌కు ప్రయత్నిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంతో కూడా పోరాడుతున్నాం. వచ్చే ఏడాదికి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది.
మూడేళ్ల తర్వాత రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఇది కేసీఆర్ మాట. అప్పటివరకు మీరు సహకరించాలి. ఆవేశపడి రోడ్ల మీదకు రావద్దు. రాజకీయ పార్టీలకు చిల్లర ఆలోచనల ఉంటాయి. వారు మీతో ధర్నా చేయిస్తరు. ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కరెంటు లేకపోవడానికి ఎవరు బాధ్యులు? ఈ రెండు పార్టీలు కాదా? ఇప్పుడు కరెంటు లేకపోవడానికి ఎవరో కారణమైనట్లు పొన్నాల సిగ్గులేకుండామాట్లాడుతున్నాడు.ఉన్నదున్నట్లు వాస్తవాలు చెబుతాం’ ఆని కేసీఆర్ ధ్వజమెత్తారు.
పోస్టల్ స్టాంప్ విడుదల
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని, అనంతరం పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన జయశంకర్ పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.
అంతకుముందు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియం, అగ్రి బిజినెస్ కేంద్రం, వెటర్నరీ బాలికల వసతి గృహ సముదాయాన్ని, పరీక్షా కేంద్రాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్సిటీలో ఇటీవల కేసీఆర్‌కు కట్టిన గుడిని కొందరు చూపించినా.. ఆయన పట్టించుకోకుండా ముందుకు కదిలారు.
మీ బతుకు మీది.. మా బతుకు మాది
Published Thu, Aug 7 2014 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement