మళ్లీ గెలవాలె..! | CM Kcr Concentrated On Karimnagar District | Sakshi
Sakshi News home page

మళ్లీ గెలవాలె..!

Published Mon, May 14 2018 7:31 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

CM Kcr Concentrated On Karimnagar District - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌ : గులాబీనేతలు పల్లెబాట పడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ఈ మధ్యన ఎక్కువగా పల్లెల్లోనే గడుపుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘ఆరు నూరైనా.. మళ్లీ ఎన్నికల్లో మనమే గెలవాలి.. మనం చేపడుతున్న అభివృద్ధి పనులు.. వాటి ఫలాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడండి. 2019 సాధారణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి.. తస్మాత్‌ జాగ్ర త్త..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పలు సందర్భాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హితబోధ చేసిన విషయం తెలిసిందే.

అధినేత ఆదేశాలను అందుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ పటిష్టంగా ఉన్న సమయంలోనే పట్టు కోల్పోకుండా ఉండేందుకు ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్థాని కంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణకు గులాబీ శ్రేణులు శ్రీకారం చుట్టారు. ఆసరా పింఛన్లు, తెలంగా ణ ను సస్యశ్యామలం చేసేందుకు చేపడుతున్న ప్రాజెక్టులు, మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, కులవృత్తులకు చేయూత, విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న ప్రతి కుటుంబంతో సంబంధాలు కలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వేదికగా మలుచుకుంటున్నారు.

గులాబీ నేతల్లో ‘రైతుబంధు’ జోష్‌
ప్రజల వద్దకు వెళ్లాలంటే కారణం ఉండాలి. ఊరికే వెళితే ఎందుకొచ్చారనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నారు. ఏడాదిముందునుంచే తమ ఉనికికి భంగం కలుగకుండా కాపాడుకోవాలి. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని తర్జనభర్జన పడుతున్న సమయంలోనే కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఇంకేముంది మంత్రులు, ఎమ్మెల్యేలకు చేతినిండా పనికల్పించినట్లయింది. ఎప్పుడు హైదరాబాద్‌కు, సొంత పనులకు నడిచే తమ కార్లను ఇప్పుడు గ్రామాల వైపు మళ్లిస్తున్నారు. గ్రామాల్లో 70 శాతంమంది భూమిని నమ్ముకున్న వారే ఉన్నారు.

ఇంతకంటే మంచి కార్యక్రమం మరొకటి ఉండదని భావించిన గులాబీ శ్రేణులు కదనరంగంవైపు అడుగులు వేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని వంద శాతం ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు ఎత్తులు వేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గడపగడపకూ తమ కార్యక్రమాలను తీసుకెళుతున్నారు. పెట్టుబడి సాయం చెక్కులు, పాస్‌ బుక్కులు పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ నాలుగేళ్లలో తమ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాల గొంతుక వినిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘మీతోనే మేమంటూ’ ప్రజలతో జట్టు కడుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి.. వరుస కార్యక్రమాలతో బిజీబిజీ
టీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్‌ జిల్లా అయిన ఉమ్మడి కరీంనగర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. ఉద్యమాల ఖిల్లా, రాజకీయాలను శాసించే జిల్లాగా పేరున్న కరీంనగర్‌లో 2014 ఎన్నికల్లో 13 నియోజకవర్గాలకు గానూ జగిత్యాల మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేసింది. టీఆర్‌ఎస్‌కు కరీంనగర్‌ పుట్టినిల్లుగా బావిస్తున్న గులాబీ శ్రేణులు ఇంట గెలిచి రచ్చ గెలవాలనే భావనతో ఉన్నారు. ఇక్కడ అయితే ఈసారి అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచే మరో మారు సెంటిమెంటు పండించాలని వ్యూహరచన చేస్తున్నారు.

అధినేత ఆశయాలకు తగ్గట్టుగానే మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ తమ నియోజకవర్గాల్లోని రోజుకు నాలుగైదు గ్రామాల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపడుతూ ప్రజాక్షేత్రంలో గడుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే పంచాయతీ ఎన్నికలు రేపోమాపో అంటున్న తరుణంలో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికారపక్షం నేతలు చెక్కుల పంపిణీ చేస్తున్నట్లు, ఇదంతా ఎన్నికల స్టంటేనంటూ ప్రతిపక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమది గెలుపు కోసం ఆరాటం కాదంటూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామంటూ అధికార పక్షం ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో గ్రామాల్లో రాజకీయ వాతావరణ నెలకొంటోంది. చెక్కులు వచ్చిన సంబురంలో రైతులుంటే, వాటిని ఓట్లుగా ఎలా మలుచుకోవాలని అధికార పార్టీ, ఎలా ఎదురుదెబ్బ తీయాలని ప్రతిపక్షాలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్నాయి. మొత్తం మీద రైతుబంధు పథకం రాజకీయ వేడిని రగుల్చుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement