వందకు పైగా మనవే | cm kcr confidence on assembly election's servey | Sakshi
Sakshi News home page

వందకు పైగా మనవే

Published Fri, Mar 10 2017 2:52 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

cm kcr confidence on assembly election's servey


               తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్‌
101 నుంచి 106 స్థానాల్లో గెలుస్తాం
టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీలో సీఎం జోస్యం


సాక్షి, హైదరాబాద్‌: ‘‘మళ్లీ మనమే అధికారం లోకి వస్తాం. ఈసారి ఎన్నికల్లో కనీసం 101 నుంచి 106 అసెంబ్లీ స్థానాల్లో  గెలుస్తాం. పార్టీ చేయించిన సర్వేలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే జాతకం నా దగ్గరుంది. ఆ వివరాలు ఎవరివి వారికి ఇస్తా. పనితీరు సరిగా లేనివారు కుంగిపోవాల్సిన పనిలేదు. ఇంకొంచెం కష్టపడండి. సర్వేలో మంచి పర్సెంటేజీ వచ్చిన వాళ్లూ పొంగిపోవొద్దు. ఇంకా కష్టపడాలి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనిచోట కూడా పార్టీకి మంచి ఆదరణ ఉంది. అదే మీకు శ్రీరామరక్ష. ఆయా ఎమ్మెల్యేలు బాగా పర్యటించాలి. బహిరంగ సభలు పెట్టండి. నేను హాజరవుతా’’ అంటూ ఎమ్మెల్యేలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు.

గురువారం తెలంగాణ భవన్‌లో తన అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శుక్రవారం నుంచి ప్రారంభవుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అరగంట పాటు ప్రసంగించారు. సభ్యుల పనితీరు ఎలా ఉండాలో, ఎలా సన్నద్ధమై రావాలో వివరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల తాను చేయించిన సర్వే వివరాలను భేటీలో సీఎం బయట పెట్టారు. అయితే వాటిని అందరి ముందూ కాకుండా, ఒక్కో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తో పదేసి నిమిషాల చొప్పున మాట్లాడి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, విపక్షాల పరిస్థితి,ఎమ్మెల్యే పనితీరు గురించి తెలిపారు. సర్వేలో 40 శాతంకన్నా తక్కువ ఫలితం వచ్చినవారు ఇంకా కష్టప డాలన్నారు.

విప్‌లూ... మెరుగవ్వండి
అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులంతా హుందా గా వ్యవహరించాలని, విపక్షాలను ఎదుర్కొ నేందుకు బాగా తయారై రావాలని సీఎం సూచించారు. ‘‘హాజరు పూర్తి స్థాయిలో ఉం డాలి. మంత్రులు సహా అంతా సభకు కనీసం అరగంట ముందే రావాలి. ప్రధానంగా మంత్రులు ఏ రోజుకారోజు ఎజెండా చూసు కుని సన్నద్ధమవాలి’’ అని సూచించారు. ప్రభుత్వ విప్‌ల పనితీరు సరిగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా సమన్వయం సరిగా చేయలేక పోతున్నారన్నా రు. ఈసారి వారి పనితీరు మెరుగుపడాలని సూచించారు.

ప్రభుత్వాన్ని మీరూ ప్రశ్నించండి
ప్రజోపయోగమైందని అనుకున్న ప్రతి అంశా న్నీ ప్రభుత్వం దృష్టికి తేవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. ‘‘కేవలం ప్రతిపక్షాలే ప్రశ్నలేస్తా యని అనుకోవద్దు. అధికార పార్టీ సభ్యులు కూడా గట్టిగానే ప్రశ్నలడగాలి. జీరో అవర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి’’ అని సూచించారు.గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో టీఆర్‌ఎస్‌ పక్షాన ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లా డాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశా నికి ఎంపీలను కూడా ఆహ్వానించినా ఇద్దరే వచ్చారంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు. సమావేశ వివరాలను ఎంపీలకు తెలియజేయాలన్నారు.

15 రోజుల్లో సభ్యత్వం పూర్తి కావాలి
పార్టీ సంస్థాగత అంశాలను కూడా సీఎం చర్చించారు. ‘‘పార్టీ సభ్యత్వాలను 15 రోజుల్లో పూర్తి చేయాలి. వారంలో సభ్యత్వా లివ్వడం మొదలుపెట్టాలి. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్‌ 1 నుంచి బీమా వర్తించేలా సభ్యత్వాలను తక్షణమే పూర్తి చేయండి’’ అని ఆదేశించారు. ఇందులో ఎలాంటి పొడిగింపూ, గ్రేస్‌ పీరియడూ ఉండవన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక ఏప్రిల్‌ 21న పార్టీ ప్లీనరీ నేపథ్యంలో కమిటీల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ ఇన్‌చార్జులతో భేటీ అవుతా మన్నారు. జిల్లావారీగా ఎమ్మెల్యేలకు సభ్యత్వ పుస్తకాలందజేశారు.

సిట్టింగులకు మళ్లీ సీట్లు
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో దాదాపు ఆర్నెల్ల కింద చేయించిన సర్వే, గత జనవరి ఆఖరులో చేయించిన సర్వేల ఫలితాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం అందజేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా 100 పై చిలుకు స్థానాల్లో గెలుపు టీఆర్‌ఎస్‌దేనని, అంతా మంచిగా పని చేస్తే ప్రతి సిట్టింగ్‌ సభ్యునికీ మళ్లీ టికెట్‌ దక్కుతుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తవారికీ అవకాశం ఉంటుందన్నారు. జాగ్రత్తగా పని చేయాలని, ఇష్టారాజ్యం కుదరదని సున్నితంగా హెచ్చరించారు. ఇకనుంచి ఎమ్మెల్యేలపై కానీ, మంత్రులపై, ప్రభుత్వంపై గానీ అవినీతి ఆరోపణలొస్తే తీవ్రంగా స్పందించాలని సూచించారు. ‘‘మీపై అవినీతి ఆరోపణలొస్తే కుంగిపోవద్దు. వాటిని నిరూపించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్‌ చేయండి. ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ఆరోపణలను ఉపేక్షించొద్దు’’ అని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement