
సాక్షి, హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో నెలకొన్న దేవాదాయ భూముల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మండలం కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం గ్రామాలకు చెందిన 462 ఎకరాల భూమి విషయంలో నెలకొన్న వివాదాన్ని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ భూమిలో గ్రామాలు వెలిశాయని, రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారని, రోడ్లు, స్కూళ్లు తదితర నిర్మాణాలు కూడా వెలిసాయని ఎమ్మెల్యే చెప్పారు. అయితే, 1950కి ముందు ఇవన్నీ దేవాదాయశాఖ పరిధిలోని భూములుగా అధికారిక రికార్డుల్లో ఉంది.
ఇటీవల జరిగిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించిన అధికారులు కూడా ఎవరు హక్కు దారులనేది తేల్చలేకపోయారు. కాస్తులో ఆయా గ్రామాల రైతులున్నారు. ఇండ్లు, స్కూళ్లు, ఇతర నిర్మాణాలున్నాయి. కానీ రికార్డుల్లో మాత్రం దేవుడి మాన్యాలుగా నమోదయ్యాయి. దీంతో అధికారులు ఈ వివాదాన్ని అప్పటికప్పుడు పరిష్కరించలేకపోయారు. పార్టు బి కింద చేపట్టడం కోసం పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఈ గ్రామాల రైతులకు యాజమాన్య హక్కులు రావడం లేదు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి వివరించారు. దశాబ్దాలుగా రైతులు ఈ భూములు సాగు చేçసుకుంటున్నారని, కాస్తు లో వారే ఉన్నారని, యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే సమస్యను పరిష్కరించాలని, కాస్తులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment