టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నిక ఏకగ్రీవమే
హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవమే కానుంది.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. కేసీఆర్ తరఫున మంత్రులు, ముఖ్య నేతలు ఆరు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేనందున కేసీఆరే మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక పార్టీ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నాయి. గ్రేటర్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు పేరును అధిష్టానం ఖరారు చేసింది. మరోవైపు.. ప్లీనరీ, బహిరంగసభపై పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సీనియర్ నేత కేకే నివాసంలో జరిగిన భేటీలో ప్లీనరీలో 11తీర్మానాలు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్ నిర్వహించాల్సిన పాత్ర, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, హరితహారం, విశ్వనగరంగా హైదరాబాద్ సహా సంక్షేమ పథకాలపై తీర్మానాలు ఉంటాయి. ఎక్కువగా పార్టీ నేతలకే మాట్లాడే అవకాశమివ్వాలని నిర్ణయించారు.