కంటతడిపెట్టిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్‌రావు మృతదేహాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటతడిపెట్టారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ సతీసమేతంగా విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగర్‌రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు. తెలంగాణ రైతుల దీనగాథలను అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌కు పాఠాలుగా విద్యాసాగర్‌రావు బోధించారు. కేవలం పునాది రాళ్లకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులను చూసి తీవ్ర ఆవేదన చెందే విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు ఆ విషయాలు వివరించేవారు.
కృష్ణా, పెన్నా బేసిన్‌ల మధ్య ఉమ్మడి ఏపీలో నిర్మించిన పోతిరెడ్డి పాడు తెలంగాణకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల అంశంలో నీటి దామాషాను పాటించకుంటే వచ్చిన నీటిని వచ్చినట్లు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటాయని, అలా జరిగితే అది దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తొలిసారిగా తేల్చిచెప్పింది విద్యాసాగర్‌రావే. ‘నీళ్లు–నిజాలు’పేరిట ఆయన రాసి న పుస్తకంలో... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో తెచ్చిన జీవోలు, వాటితో జరిగే నష్టం, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న తీరుని వివరించారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం ఉన్న విద్యా సాగర్‌రావును రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. సాగునీటి సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, పాలమూర రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్‌లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మూత్రాశయ క్యాన్సర్‌తో విద్యాసాగర్‌రావు శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి
సాగునీటి స్వాప్నికుడు ఇకలేరు