మీ దమాక్‌లే బోగస్
► టీఆర్‌ఎస్ సర్వేలు బోగస్ అన్న ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫైర్
► కాంగ్రెస్ నేతలకు సవాల్.. పౌరుషం ఉంటే మీరంతా రాజీనామా చేసి ఎన్నికలకు రండి
► సర్వేలో బీజేపీకి దేశంలో 46% ఓటింగ్ ఉందంటున్నరు
► మాది బోగస్ సర్వే అయితే.. మీది కూడా బోగసేనా?
► రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు జీర్ణం కావడం లేదు
► వాళ్ల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి..
► మీకు డిపాజిట్లు కూడా రావు.. అవాకులుచెవాకులు మానండి..
► కడుపు నిండా పనిచేస్తం.. ప్రజల దగ్గరికి వెళ్తం..
► చంద్రబాబులాంటి మోసగాళ్లకు ఇక్కడ చోటు లేదని మండిపాటు
కొన్ని పార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న పురోభివృద్ధి చూసి ఏం అర్థం కావడం లేదు. అంగీ, లాగు చింపుకొంటున్నరు. చరిత్రలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడటం కూడా అలాంటిదే..
కరెంటు కోసం కాంగ్రెస్, టీడీపీలు 30 ఏండ్లు ఏడ్పించినయి. మేం ఆరు నెలల్లో సరిచేశాం. నాణ్యమైన కరెంటు ఇచ్చినం. పవర్ కట్ లేదు.. మోటార్లు కాలుడు లేదు.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు లేదు.. ఈ ఒక్క పాయింట్ చాలదా మా పనితీరుకు? ఒక్క ఇసుక దందా చాలదా మీరు(కాంగ్రెస్) ఎంత మెక్కారో చెప్పడానికి..
సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. ఇది ఎవరి ప్రయోజనం కోసం? ఏ రైతుల ప్రయోజనం కోసం? పిచ్చి మాటలు మానుకోండి. ప్రాజెక్టులు ఆపలేరు. మీ జేజమ్మ తరం కూడా కాదు. మీరు కోర్టులకు వెళ్లినా న్యాయమూర్తులు ధర్మం కాపాడుతరు.
చంద్రబాబూ.. మొదట నీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పు. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పింది ఏందీ? డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నావ్. ఇప్పుడు మాట మార్చినవ్.. తిమ్మిని బమ్మిని చేసినవ్. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు. నీ కథ ఇక అయిపోయింది.. నీ జాగల ప్రజలకు సేవ చేసుకో..’’
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ నాయకులకు చాలెంజ్ చేస్తున్నా. మీపై మీకు ఆత్మవిశ్వాసం బాగా ఉంది కదా? అయితే రాజీనామాలు చేయండి. ఎలక్షన్‌కు పోదాం. మీరు గెలుస్తరో, మేం గెలుస్తమో తెలుస్తుంది. మీ మీద మీకు విశ్వాసం ఉంటే.. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై విశ్వాసం పోయిందనుకుంటే మీరే రాజీనామా చేయండి. మేమెందుకు చేయాలే? చేసి చేసి అలిసిపోయినం. మా రాజీనామాలు ఇసిరి పారేసినం. నేనే అయిదారుసార్లు చేసిన. ఉద్యమం పుట్టినప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన. రాష్ట్రంలో ఆరుగురు మంత్రులతో రాజీనామాలు చేయించి ఇసిరి మీ ముఖాన కొట్టినం. పౌరుషం ఉంటే మీరందరూ రాజీనామాలు చేయండి...’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. టీఆర్‌ఎస్ సర్వేలు బోగస్ అంటూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. తమ సర్వే బోగస్ అంటున్నవారి దమాక్(మెదడు)లే బోగస్ అంటూ దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, కాంగ్రెస్‌కు చెందిన పీసీసీ కార్యదర్శి పైడిపల్లి రవీందర్‌రావు తమ అనుచరులతో కలసి సోమవారం సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
మరి మీది బోగస్ సర్వేనా?
దేశంలో బీజేపీకి 39 శాతం ఓటింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం 46 శాతం అంటున్నరు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మా సర్వే తప్పంటడు. మా సర్వే బోగస్ అయితే మీది కూడా బోగస్ సర్వేనా? అసలు మీ దమాక్‌లే బోగస్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీకు జీర్ణం కావడం లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. వారికి ఎలాంటి శషబిషలు ఉండవు. కొత్త రాష్ట్రమైనా దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇది చరిత్ర. ఉద్యమ సందర్భంలో చెప్పినవన్నీ నూరు శాతం నిజమవుతున్నాయి. రైతాంగానికి రెండు పంటలకు రూ.8 వేలు ఇవ్వడం అన్నది చరిత్రాత్మకం. ఉమ్మడి ఏపీలో ఇది సాధ్యమయ్యేది కాదు. కొన్ని పార్టీలకు రాష్ట్రంలో జరుగుతున్న పురోభివృద్ధి చూసి ఏం అర్థం కావడం లేదు. అంగీ లాగు చింపుకొంటున్నరు. చరిత్రలో కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఏపీ నుంచి తెలంగాణ ఏర్పడడం కూడా అలాంటిదే..
కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లెయాలె?
కాంగ్రెస్‌కు ఎందుకు ఓట్లేయాలె? అదేమన్నా కొత్త పార్టీనా? స్వర్గం నుంచి ఊడిపడిందా? మీ పాలనను ప్రజలు చూడలేదా? రైతులు టీఆర్‌ఎస్‌కు ఓటేయకుండా ఉంటరా? కరెంటు కోసం కాంగ్రెస్, టీడీపీలు 30 ఏండ్లు ఏడ్పించిండ్రు. మేం ఆరు నెలల్లో సరిచేశాం. దేశం మొత్తంలో ఎవరూ ఇయ్యలేదు. నాణ్యమైన కరెంటు ఇచ్చినం. పవర్ కట్ లేదు.. మోట్లార్లు కాలుడు లేదు. ట్రాన్స్‌ఫార్మర్లు పేలుడు లేదు. ఈ ఒక్క పాయింట్ చాలదా మా పనితీరుకు. మేం కడుపు, నోరు కట్టుకుని అవినీతికి దూరంగా పాలన చేస్తున్నం. ఒక్క ఇసుక దందా ఉదాహరణ చాలు కదా మీరెంత మెక్కారో చెప్పడానికి. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పుడు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.22 కోట్ల ఆదాయం వచ్చేది. పదేళ్ల పాలన తర్వాత ఆ ఆదాయం రూ.5 లక్షలకు చేర్చారు. మేం అధికారం చేపట్టాక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.330 కోట్లు, 2016–17లో రూ.432 కోట్ల ఆదాయం తెచ్చాం. ఈ ఏడాది అది రూ.650 కోట్లకు పోతది. నిబద్ధతతో, నిజాయితీతో పనిచేస్తున్నామనడానికి ఈ ఉదాహరణ చాలాదా? ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. వాళ్లు ఒక్క ఇసుకలోనే రూ.400 కోట్లు తిన్నరు.
మాకు ఓట్లేయకుండా మీకేస్తరా?
ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నం. మత్స్యకారులు, గొల్ల కుర్మలు, చేనేత కార్మికుల గురించి మీరు ఎన్నడన్నా ఆలోచించిండ్రా? చేనేత కార్మికులు చచ్చిపోతే పట్టించుకున్నరా? నేత కార్మికులకు 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు ఇస్తం. మిగిలిపోయిన వస్త్రాన్ని ప్రభుత్వమే కొంటది. అంగన్‌వాడీ వర్కర్లను ఎన్నడన్నా మనుషులుగా చూశారా? 50 వేల మంది ఉన్నరు. వాళ్లకు మీరిచ్చిన నెల జీతం రూ.4,200. మేం దాన్ని రూ.10,500కు పెంచినం. అంగన్‌వాడీలు మీకు ఓట్లేస్తరా? మాకు వేస్తరా? మత్స్యకారుల కోసం రూ.10 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టినం. వీరు మీకేస్తరా ఓట్లు.. మాకేస్తరా? 25 వేల మంది విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయబోతున్నం. 24వేల మంది హోంగార్డులున్నరు. వాళ్లకు మీరిచ్చింది రూ.3 వేలు. ఆ తర్వాత రూ.6 వేలకు పెంచారు. మేం రూ.12 వేలు చేసినం. వారిని పర్మినెంట్ చేస్తం. వీరు కాంగ్రెస్, టీడీపీలకు ఓట్లేస్తరా? టీఆర్‌ఎస్‌కు వేస్తరా? ఆశా వర్కర్లకు మానవత్వంతో వేతనాలు పెంచాం. ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చారా. వాళ్లు మీకేస్తరా.. మాకు వేస్తరా? మీరు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూశారు. మైనారిటీలకు, ఎస్టీలకు మేం రిజర్వేషన్ ఇచ్చి తీరుతం. సోమవారం శాసనసభ సచివాలయానికి ఫైలు వచ్చింది. దాన్ని ఢిల్లీకి పంపుతం. ప్రధాని హామీ ఇచ్చిండు. ఇయ్యకపోతే కేంద్రంతో ఫైట్ చేస్తం. గర్భిణిలకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్ ఇస్తాం. మీ జీవితంలో ఎప్పుడన్నా వీటి గురించి ఆలోచించిండ్రా? మీ గుండెల్లో బాంబులు పేలుతున్నయ్. మీకు డిపాజిట్లు కూడా రావు. అవాకులు, చవాకులు మానండి. కడుపు నిండా పనిచేస్తం. ప్రజల దగ్గరకు వెళ్తం. అధికారం ఇస్తే ఓకే. లేదంటే లేదు. మీలా ఆగమై కిందా మీదా అయిపోం.
ప్రాజెక్టులను అడ్డుకుంటరా?
సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటోంది. పదిహేను రోజుల్లో నాలుగుసార్లు కోర్టుకు వెళ్లి స్టే కోసం ప్రయత్నించారు. దేనికోసం పనులు ఆపించాలనుకుంటున్నరు? ఇది ఎవరి ప్రయోజనం కోసం? ఏ రైతుల ప్రయోజనం కోసం ఆపుతున్నరు? కరువు బారిన పడిన రాష్ట్రాన్ని గట్టెక్కించడం మీకిష్టం లేదు. టీఆర్‌ఎస్‌కు మంచి పేరు రావొద్దు. కాంగ్రెస్ నేతలు దుర్మార్గులు. దేశంలో తొలిసారిగా రైతులకు రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 వేలు ఇవ్వనున్నాం. తమషాగా ఇస్తున్నామనుకుంటున్నరా? మీ పాలనతో రైతులు ఆగమైండ్రు, ఆత్మహత్యలు చేసుకుండ్రు, బొంబాయి–బొగ్గుబాయి–దుబాయి బతుకులు అయినయ్. సమైక్య పాలనలో నీళ్లిలేదు. భూగర్భ జలమే దిక్కదయింది. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆగమైండ్రు. పూర్వవైభవం కోసం నీళ్లు ఇస్తం. కాళేశ్వరం నీళ్లను రెండేళ్లలో తెస్తం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తం. 30–40 ఏళ్లు మోసం చేసిండ్రు. మేం నిజాయితీతో పనిచేస్తున్నం. మేలు చేసిన వారికే ప్రజలు పట్టం కడతరు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఏంది? ఇది రిపీట్ కాకూడదనేముంది? గతంలో తమిళనాడులో డీఎంకే తుడిచిపెట్టుకపోలేదా? పిచ్చి మాటలు మానుకోండి. ప్రాజెక్టులు ఆపలేరు. మీ జేజమ్మ తరం కూడా కాదు. మీరు కోర్టులకు వెళ్లినా న్యాయమూర్తులు ధర్మం కాపాడుతారు. దుర్మార్గం కట్టిబెట్టండి. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలను ఓట్లుగానే చూసింది.
బాబూ.. నీలాంటి మోసగాళ్లకు ఇక్కడ తావు లేదు
రైతులకు ఇక్కడ రూ.17 వేల కోట్ల రుణం మాఫీ చేసినం. పక్కరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలేదు. ఆంధ్రా రైతులను, ఆంధ్రా డ్వాక్రా మహిళలకు శఠగోపం పెట్టి, ఇగ తెలంగాణకు వచ్చి వెలగబెడతడట! మేమే తెలంగాణలో గెలుస్తమని సిగ్గులేకుండా వైజాగ్ మహానాడులో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడూ.. మొట్టమొదట నీ ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏందీ? ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు, రైతుల రుణాలు మొత్తం మాఫీ చేస్తానన్నావ్. ఇప్పుడు మాట మార్చినవ్.. తిమ్మిని బమ్మిని చేసినవ్. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు. నువ్వూ అవసరం లేదు. ఇక అయిపోయింది నీ కథ. నీ జాగల ఉన్న ప్రజలకు సేవ చేసుకో. తెలంగాణకు నువ్వొచ్చినా.. నీకు వచ్చేదేమీ ఉండదు. ఇక్కడ డిపాజిట్ రాదు. ఉనికి కోల్పోయిన టీడీపీ, అడ్రస్ లేని బీజేపీ, కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నరు.