బాబు చేస్తే నీతి.. మేం చేస్తే అవినీతా ? : కేసీఆర్
హైదరాబాద్: "ఇతర పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీలో చేరితే నీతి.. తెలంగాణలో జరిగినంత మాత్రాన అవినీతి అవుతుందా" అంటూ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ చేరటాన్ని చంద్రబాబు తప్పుపడితే.. ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత ఏ పార్టీ గుర్తుతో గెలిచారో చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో వేరే పార్టీ వారు ఉంటేనేమో నీతి.. కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే మాత్రం అవినీతా అంటూ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు.
'దిండి, పాలమూరు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. గీత, మత్స్య కార్మికులకు రూ. 5 లక్షల బీమా, రిజిస్టర్డ్ సొసైటీలు మాత్రమే ఇస్తాం. మైనారిటీల కోసం 10 రెసిడెన్షియల్ స్కూళ్లు, 10 హాస్టళ్లు ఏర్పాటు చేస్తాం. సాంఘిక సంక్షేమ విద్యార్థులకు కడుపు నిండా అన్నం పెడతాం. అనాథలకు తల్లీతండ్రి తెలంగాణ ప్రభుత్వమే. నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ పార్క్ ఏర్పాటు చేస్తాం' అని సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.