ఊరు రుణం తీర్చుకుంటా | CM KCR Phone Call To the Chintamadaka Sarpanch | Sakshi
Sakshi News home page

ఊరు రుణం తీర్చుకుంటా

Published Thu, Jul 4 2019 2:08 AM | Last Updated on Thu, Jul 4 2019 11:13 AM

CM KCR Phone Call To the Chintamadaka Sarpanch  - Sakshi

చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి , ముఖ్యమంత్రి కేసీఆర్‌

సిద్దిపేట రూరల్‌:  ‘ఏం బాబూ బాగున్నావా..? మన ఊరు ఇప్పటివరకు వెనకబడి ఉంది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను. మన ఊరు బాగు చేసుకోవాలి. అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాను. అందరూ బాగుండాలి. ప్రతీ ఇల్లు లబ్ధి పొందాలి. యువత ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఎవరూ కన్పించొద్దు. అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అధికారులు మన ఊరికి వస్తారు. వారికి చెప్పండి.. అన్నీ సిద్ధం చేసిన తర్వాత నేను వస్తాను. అభివృద్ధి పనులు ప్రారంభిస్తాను, ఊరు రుణం తీర్చుకుంటా’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డితో బుధవారం ఫోన్‌లో సంభాషించారు. 

గ్రామాభివృద్ధికి ప్రణాళిక తయారు చేయండి  
‘ఇంతకాలం ఎవరో పరిపాలించారు.. అప్పుడు మన గ్రామం బాగుపడలేదు. ఇప్పుడు మనమే పవర్‌లో ఉన్నాం. గ్రామంలోని అందరూ బాగుపడాలి. ఆర్థికంగా ఎదగాలి. అందుకోసం ఏం కావాలో ప్రణాళిక సిద్ధం చేసుకోండి’అని సర్పంచ్‌ను సీఎం ఆదేశించారు. ‘గ్రామంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలకు తక్కువ కాకుండా లబ్ధి చేకూరాలి. వారు ధనికులైనా, పేదలైనా.. అలాగే గ్రామంలో లేకుండా వలస వెళ్లినవారైనా సరే. అందరికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరాలి. వారి జీవితాలు బాగుపడాలి. గ్రామంలో పేదవారు అనేవారు ఉండకూడదు’ అని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. అన్నింటి సమాచారాన్ని సేకరించాలని, వారికి ఏవిధమైన సహాయం చేయవచ్చో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గ్రామంలో రోడ్లు, ఇళ్లు.. ఏయే అభివృద్ధి కార్యక్రమాలు, ఏం పనులు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందో కూడా జాబితాను సిద్ధం చేసి పెట్టుకోవాలని ఆదేశించారు.  

వలస వెళ్లినవారు తిరిగి రావాలి.. 
గ్రామంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉపాధి కోసం బర్రెలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఉపాధి లోన్‌లు.. ఏమి కావాలో అన్నీ సమకూర్చేలా సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సర్పంచ్‌కు సూచించారు. బతుకు దెరువు కోసం దేశం విడిచి వెళ్లిన వారు కూడా తిరిగి గ్రామానికి రావాలి. నా ఊరికి నేను పోయి బతుకుతా.. అనే ఆలోచన వచ్చేలా అందరికీ కబురుపెట్టి పిలిపించండి. వారికి ఏం కావాలో ఆడిగి తెలుసుకోవాలని అన్నారు. ‘ట్రాక్టర్లు .. హార్వెస్టర్లు ఏం కావాలన్నా.. ఇద్దాం.. ఇప్పుడైనా ఊరు బాగుచేసుకుందామా..? వద్దా..?’అని సర్పంచ్‌ను సీఎం ప్రశ్నించారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వడమే కాకుండా ఉన్నవారు కూడా వారి స్థలాల్లో మంచి ఇళ్లు కట్టుకునేలా సాయం చేద్దామని అన్నారు. మినీ డెయిరీఫాం, కోళ్ల ఫారాలు, డ్రి‹ప్, స్పింక్లర్లు కావాలనుకునే వారి జాబితా సిద్ధం చేయాలన్నారు. ‘టైం ఉన్నప్పుడే.., అవకాశం ఉన్నప్పుడే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా ఊరును అభివృద్ధి చేయడమే లక్ష్యం. çసమాచారం కోసం ఇంటింటికీ తిరిగి, కులసంఘాలను కలసి సమాచారాన్ని సేకరించి రెండు రోజుల్లో లిస్టు అందించాలి’అని సీఎం పేర్కొన్నారు. పుట్టిన ఊరును అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. అభివృద్ధి వల్ల నాకు, నీకూ మంచి పేరు వస్తుంది అని సర్పంచ్‌ను ఉద్దేశించి అన్నారు. ‘చింతమడక మొత్తం అభివృద్ధి చెందాలి. అది హంసకేతన్‌రెడ్డి పాలనలో జరిగిందనే పేరు రావాలె. తరతరాలు గుర్తుండిపోతది. సమాచారం మొత్తం సేకరించిన తరువాత మావాళ్లకు ఫోన్‌ చేస్తే చింతమడకకు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా’అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

హామీ మేరకు సొంత ఊరుకు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సమయంలో సతీసమేతంగా స్వగ్రామం చింతమడక వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో మాట్లాడారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చర్చించారు. అక్కడ ఉన్నవారు తమ సమస్యలు చెప్పుకోగా, ఊరికి మరోసారి ప్రత్యేకంగా వస్తానని, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చింతమడక వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇటీవల మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితోపాటు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు చింతమడకలో మకాం వేసి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వారి వారి సమస్యలు తెలుసుకుంటూ. గ్రామాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి, నేరుగా గ్రామ సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఊరు అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement