chinthamadaka
-
చింతమడకలో సీఎం సార్ మెనూ..
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాటి చింతమడక పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఏర్పాట్లలో ఎక్కడ రాజీపడలేదు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిదులు సమిష్టిగా సీఎం పర్యటన విజయవంతానికి కృషి చేశారు. ముఖ్యంగా గ్రామ ప్రజలను సభవేదికకు వచ్చేలా, గ్రామస్తులందరికీ భోజన ఏర్పాట్లు, సభ స్థలి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా గ్రామ ప్రజలకు మాంస, శాఖాహార భోజనాలను వడ్డించారు. మరోవైపు అధికారులకు, మీడియా బృందానికి కూడా వేరువేరు షామీయానాల్లో భోజన వసతులు కల్పించారు. పక్కనే ఏర్పాటు చేసిన షామీయానాలో సీఎం కేసిఆర్‌కు భోజన ఏర్పాట్లు చేశారు. నాటుకోడి లివర్ కర్రీతోపాటు మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, ఫై, వైట్ రైస్, దాల్చా, పెరుగులను అందుబాటులో పెట్టారు. భోజనం అనంతరం సీఎం కేసిఆర్ కోద్ది ఆపీల్ ముక్కలు, కొద్దిపాటి నారింజ జూస్‌ను తీసుకున్నారు. సీఎంతో పాటు హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు ఫారుఖ్, రఘోత్తంరెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు కలిసి భోజనం చేశారు. వారికి భోజన ఏర్పాట్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శర్మలు పర్యవేక్షించారు. -
సీఎం కేసీఆర్ పర్యటన హైలైట్స్!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం తాను పుట్టిన ఊరు చింతమడకలో సుమారు 4 గంటల పాటు పర్యటించారు. గ్రామం అభివృద్ది కోసం భవిష్యత్ ప్రణాళికను రూపోందించిన అయన ఉదయం మద్యాహ్నం 12–40 నిమిషాలకు గ్రామానికి చేరుకుని సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు తిరిగి ప్రయాణం అయ్యారు. వాటికి సంబంధించి హైలైట్స్ కొన్ని. సీఎం కేసీఆర్ 2 గంటల పాటు ఆలస్యంగా చింతమడకకు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎం కేసీఆర్‌కు మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కేసీఆర్ చిన్నాన్న బాలకిషన్రావులు, పుష్పగుచ్చాలు ఇచ్చిస్వాగతం పలికారు. సభ వేదికకు చేరుకున్న సీఎం కేసీఆర్ వేదికపైకి వెళ్లకుండా నేరుగా గ్రామ ప్రజలు కూర్చున గ్యాలరీ వద్దకు చేరుకుని ప్రతీ ఒక్కరికి చేతులు జోడిస్తూ అప్యాయంగా ప్రేమతో పలకరించారు. ఈ సందర్బంగా పలువురు మహిళలు, బాల్యమిత్రులు కేసీఆర్‌ను ఆప్యాయంగా చిరునవ్వుతో,చప్పట్లతో ఆశీర్వరించారు. వేదికపైకి చేరుకున్న సీఎం కేసీఆర్ వేదికపైన ఉన్న ఎమ్మెల్యేలను,ఎమ్మెల్సీలను, ఎంపీలను, పలకరించారు. అక్కడే ఉన్న తన చిన్నాన బాలకిషన్రావును ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆయనకు పాధాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. సభ ప్రారంభం కంటే ముందు మాజీమంత్రి, హరీష్‌రావు మాట్లాడుతూ తన ప్రసంగంలో కేసీఆర్‌ను పలు నిదులు కావాలని ప్రేమగా కోరడం విశేశం. ముఖ్యంగా చింతమడకకు నిదులను కేటాయిస్తున్న సీఎం కేసీఆర్ అంతే ప్రేమతో మాచాపూర్, సీతారాంపల్లి, గ్రామాలకు కూడా నిదులు ఇవ్వాలని కోరగా స్పందించిన సీఎం గ్రామానికి రూ.50లక్షల చొప్పున మంజూరు చేస్తున్నానని అదే విధంగా తాను చదువున్న గ్రామాలు తోర్నాల, పుల్లూరు, గూడూరు, దుబ్బాకకు రూ. కోటి చొప్పున నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. కొందరికి గ్రామంతో పేరువస్తుందని కాని సీఎం కేసీఆర్ వల్ల చింతమడకకు గొప్ప పేరు వచ్చిందంటూ హరీశ్ రావు అనగానే గ్రామస్తులంతా ఈలలు వేస్తూ చప్పట్లతో మద్దతు పలికారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే హరీష్‌రావు చింతమడక నిదులతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి, సిద్దిపేట మున్సిపల్‌కు నిధులను విడుదల చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తూ మాజీమంత్రి, హరీశ్‌రావును చిరంజీవిగా సంబోధించిన సమయంలో వేదిక కింది భాగాన పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలు వేస్తూ అభిమానులు గ్రామ ప్రజలు మద్దతు పలికారు. వారి ఉత్సాహాన్ని చూసి కేసీఆర్ ప్రసంగం మధ్యలో పలు మార్లు హరీశ్‌రావును అభినందిస్తూ ఒక మంచి నాయకుడు మీకు ఉన్నాడని ఆయన నాయకత్వలో పనిచేయాలంటూ సందేశం ఇచ్చారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన చింతమడక గ్రామానికి ఎంత చేసిన తక్కువేనని సీఎం అనడంతో సభలో పెద్ద ఎత్తున చప్పట్లతో మద్దతు పలికారు. సీఎం కేసీఆర్ సభ ఆద్యాంతం జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ప్రశంసించారు. ఎర్రవల్లిని గోప్పగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని రేపు చింతమడకను అభివృద్ధి చేసేది కూడా కలెక్టరే ఉంటూ వాఖ్యలు చేశారు. సీఎం ప్రసంగం మధ్యలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లేచి ఒక చిన్న చిట్టిని కేసీఆర్‌కు అందించడం దానిని చూసి చదివిన కేసీఆర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్ల విస్తరణకు, గ్రామప్రజలు సహాకరించాలని, ప్రతీ ఒక్కరు ఓర్పుతో, సమష్టిగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సందేశం ఇచ్చారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గ్రామం మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డుల వారిగా పోలీసులు అనుమతించారు. ఇతర గ్రామాలకు చెందిన వారిని గుర్తింపు కార్డు లేనివారిని గ్రామంలోకి, సభ వేదికవైపు వెళ్లకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో వస్తున్నప్పటికి ముందస్తు జాగ్రత్తగా సిద్దిపేట నుండి చింతమడక వరకు రహదారికి ఇరువైపులా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం గ్రామ పర్యటన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ నివాస గృహాలను వివిధ రకాల పూలతో, మామిడి తోరణాలతో, రంగు రంగులతో ఇంటి ముందున్న వాకిట్లో వెల్కమ్ టు కేసీఆర్, స్వాగత తోరణాలు బతుకమ్మలతో ఆహ్వానాలు పండుగ సందడిని కనిపించాయి. గ్రామంలోని పలుచోట్ల సీఎం కేసీఆర్‌కు చెందిన 50 ఫీట్ల భారీ కటౌట్లు ఆకర్షనీయంగా కనిపించాయి. మరోవైపు సీఎం గ్రామపర్యటన నేపథ్యంలో గ్రామంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో సీఎం, హరీశ్‌రావు, కేటీఆర్, కవితల కుటుంబ సభ్యులతో ఉన్న ఫ్లెక్సీలు ఆకట్టుకున్నాయి. సభ అనంతరం గ్రామ మహిళలకు, పురుషులకు, అధికారులకు వేరువేరుగా ఏర్పాటు చేసిన షామియానాల్లో భోజనాలను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. సీఎం సభ వేదికకు చేరుకునే వరకు ప్రముఖ గాయకుడు సాయిచంద్ తన ఆటపాటలతో అందరిని ఉషారెత్తించారు. మరోవైపు గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నృత్యాలు అకట్టుకున్నాయి. సభ అనంతరం కేసీఆర్ ప్రగతి రథం బస్సులో ముందు భాగాన కూర్చుని ప్రతి ఒక్కరిని అప్యాయంగా చేతులతో విజయ సంకేతం చూపిస్తూ ముందుకు సాగారు. సీఎం కేసిఆర్ చింతమడక పర్యటనలో భాగంగా వచ్చింది మొదలు తిరిగి వెళ్లే వరకు మాజీ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. సభ వేదికపైన పలుమార్లు సీఎం గ్రామ ప్రగతి, భవిష్యత్తు ప్రణాళిక గూర్చి కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి పలు సూచనలు, అందజేశారు. సీఎం కేసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు,ఎంపీ, కలెక్టర్, ముఖ్యులు కలిసి భోజనం చేశారు. సుమారు నాలుగుగంటల పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ ద్వారా ఎర్రవల్లికి బయలుదేరారు. -
ఎక్కడున్నా.. చింతమడక బిడ్డనే!
ఎక్కడికెళ్లినా.. నా సొంతూరుకు వచ్చినంత ఆనందం ఇంకెక్కడా ఉండదు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. ఊరిలో కలియ తిరిగి అందరిని కలుసుకోవాలి. ఆప్యాయంగా మాట్లాడానే కోరిక చాన్నాళ్ల తర్వాత నెరవేరింది. – కేసీఆర్ సాక్షి, సిద్దిపేట : ‘నాడు ఉద్యమ నాయకుడిగా, నేడు సీఎంగా నేను ఎక్కడున్నా.. మీ ఊరి బిడ్డనే. చింతమడక చనుబాలు తాగి బతికిన వాడిననే విషయం మరిచిపోను. మీకు ఎంత సేవ చేసినా రుణం తీర్చుకోలేను’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘నేను ఈ స్థాయికి రావడంలో సహకరించిన చింతమడక తల్లులు, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, చదువు చెప్పిన గురువులు.. అందరికీ పేరు పేరునా వందనాలు. నేను పుట్టి పెరిగిన ఊరు బాగుండాలి. నా గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి’అని ఉద్వేగంగా చెప్పారు. ‘ఇక్కడి ప్రతీ ఇంటితో ఉన్న అనుబంధం, చెట్టు, పుట్ట, ఊటబావులు దేన్నీ మర్చిపోలేను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను పెద్దవాడిని చేసిన ప్రజలకు, విద్య బుద్ధులు చెప్పిన గురువులకు రుణపడి ఉంటాను. ఎక్కడ ఉన్నా చింతమడక బిడ్డనే’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. అందుకోసమే ఈ గ్రామాభివృద్ధి తన బాధ్యతన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఏర్పాటు చేసిన గ్రామ ప్రజల ఆత్మీయ, అనురాగ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా గ్రామంలోని ప్రతీ ఒక్కరు గౌరవంగా బతకాలన్నదే నా కోరిక. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా మంజూరు చేస్తా’అని కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం చింతమడక, ఉప్పలోనికుంట, దుమ్మచెరువులే కాకుండా మచాపూర్, సీతారాంపల్లి కూడా మన గ్రామాలేనన్నారు. చింతమడక గ్రామ పంచాయతీ పరిధిలో 904 కుటుంబాలు, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో 900 కుటుంబాలు మొత్తం 1,804 కుటుంబాలు మనవేనన్నారు. గ్రామంలో బతుకలేకనే ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని.. వారిని కూడా ఫోన్ చేసి పిలిపించాలని చెప్పారు. వలస వెళ్లిన వారితో కలుపుకొని మొత్తం 2వేల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలకు తక్కువ కాకుండా లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూ.200కోట్లు విడుదల చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. గ్రామాభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీక మాసంలో మళ్లీ కుటుంబంతో కలిసి ఊరికి వస్తానన్నారు. ఆలోచించి యూనిట్లు తీసుకోండి ‘ఈ ఊరి మట్టిలో పుట్టినోన్ని. ఇక్కడి నీళ్లు తాగినోణ్ణి. ప్రజల కళ్లలో, చేతుల్లో మెదిలినోణ్ణి. అందుకోసమే మీకు ఎంత చేసినా తక్కువే’అని కేసీఆర్ అన్నారు. గ్రామానికి ఇస్తున్న డబ్బుల విషయంలో ఆగమాగం కావొద్దని.. ఆలోచించి యూనిట్లు తీసుకోవాలని సూచించారు. వరినాట్లు వేసే యంత్రాలు, కోసే యంత్రాలు, హార్వెస్టర్లు, పౌల్ట్రీఫాం, ట్రాక్టర్లు, డీసీఎంలు, డైరీఫాం ఇలా మీ కుటుంబాలకు అనువైనవి తీసుకోవాలని చెప్పారు. వ్యవసాయాధారిత కుటుంబాలు ఎక్కువున్నాయి కాబట్టి పాడి గేదెలు పెంచుకోవాలని చెప్పారు. ఇందుకోసం చింతమడకలో శీతలీకరణ కేంద్రం, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్నారు. వీటితోపాటు గ్రామానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే విషయాన్ని యువజన, కుల సంఘాలు, మహిళలు, పెద్దలు సమావేశాలు పెట్టుకొని నివేదిక తయారు చేసుకోవాలని సూచించారు. మీ బాగు కోసం నిధులు కేటాయిస్తే ఎవరూ ఏమనరని, ఒకవేళ ఎవరైనా అన్నా తాను పట్టించుకోనన్నారు. ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తానని చెప్పారు. మొత్తం 1,500 నుండి 2 వేల వరకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతా కలిసికట్టుగా ఉండి ఊరును అందంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. పగలు, కక్షలు పెట్టుకోవద్దని, ఆప్యాయంగా ఉంటేనే ఊరు అభివృద్ధి చెందుతుందన్నారు. ఇందుకు ఎర్రవల్లిని ఆదర్శంగా తీసుకోవాలని, అంతకంటే గొప్పగా చింతమడక కావాలని ఆకాంక్షించారు. చింతమడకతోపాటు.. తనకు జన్మనిచ్చిన చింతమడకతోపాటు పెద్ద బాలశిక్ష చదువుకున్న సిరిసిల్ల జిల్లా గూడురు, తోర్నాల, పుల్లూరు, దుబ్బాకకు కూడా రణపడి ఉంటానని కేసీఆర్ చెప్పారు. తన గ్రామంతోపాటు దుబ్బాక పట్టణ అభివృద్ధికి రూ.10 కోట్లు, గూడూరుకు తోర్నాల, పుల్లూరు గ్రామాలకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇక్కడికి వచ్చే ముందే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌తో మాట్లాడి వచ్చానని, వారు పూర్తి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని వైద్యరంగంలోనూ ముందుకు తీసుకెళ్లాలన్నదే తన అభిమతమని కేసీఆర్ అన్నారు. చింతమడకలో అందరికీ వైద్య పరీక్షలు చేయించాలని, అందుకు కార్పొరేట్ ఆస్పత్రుల ద్వారా క్యాంపులు పెడతామని చెప్పారు. గ్రామంలో ప్రతిఒక్కరి ఆరోగ్య ప్రొఫైల్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకం ఇప్పుడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచి అందరి దాహం తీర్చే మిషన్ భగీరథగా మారిందని.. అలాగే చింతమడకలో అంకురార్పణ చేసిన ఆరోగ్య ప్రొఫైల్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలన్నారు. అమెరికా వంటి దేశాల్లో అందరి ఆరోగ్య ప్రొఫైల్ ఉంటుందని. దీంతో వ్యాధులు నివారణ, వైద్యం సులువవుతుందని సీఎం చెప్పారు. అటువంటి పద్ధతి రాష్ట్రమంతటా అమలు చేస్తామని అన్నారు. సంవత్సరానికి మూడు పంటలు కాళేశ్వరం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందన్నారు. గోదావరి జలాలు బీడు భూములకు పారించాలన్నదే తన ధ్యేయమని సీఎం చెప్పారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లు పూర్తి చేసి చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుంటే నీటి ఊటలకు ప్రాణం వస్తుందని కేసీఆర్ వివరించారు. దీంతో సంవత్సరానికి మూడు పంటలు పండే గ్రామాల్లో చింతమడక కూడా ఉంటుందని, ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని చెప్పారు. ఆ ఆనందం ఎక్కడా లభించదు ‘ఎక్కడికెళ్లినా.. నా సొంతూరుకు వచ్చినంత ఆనందం ఇంకెక్కడా ఉండదు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి. ఊరిలో కలియ తిరిగి అందరిని కలుసుకోవాలి. ఆప్యాయంగా మాట్లాడానే కోరిక చాన్నాళ్ల తర్వాత నెరవేరింది’అని కేసీఆర్ చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టినప్పుడు ఎంతో ఆనందం కల్గిందన్నారు. గుంట భూమి ఉన్న రైతులకు కూడా బీమా సౌకర్యం అందుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం మన రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినందుకు సంతోషపడ్డానని చెప్పారు. వీటికోసం ఎంత ఖర్చయినా వెనకాడేది లేదన్నారు. అందరికి పక్కా ఇండ్లు నిర్మించాలని, ప్రతీ కుటుంబానికి రూ.10లక్షలకు తక్కువ కాకుండా వారి అభిరుచికి అనుగుణంగా స్వయం సంవృద్ధి పథకాలు అమలు చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 50కోట్లు, వ్యక్తిగత పథకాలకోసం రూ.200కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పనులు వేగంగా జరగాలని, కార్తీక మాసంలో కుటుంబ సభ్యులతో కలిసి వస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సోలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి శుభాష్‌రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, సీపీ జోయల్ డేవీస్ తదితరులు పాల్గొన్నారు. కిష్టన్న బాగున్నడా? రాజయ్య ఏం చేస్తుండు? సోమవారం చింతమడకలో పర్యటించిన కేసీఆర్.. గ్రామానికి వచ్చీరాగానే.. చిన్ననాటి మిత్రులు, బంధువులు, గురువులను చూడగానే మైమరచిపోయారు. సభావేదికపైకి వెళ్లకుండా.. సభలో కూర్చున్న వారి వద్దకు వెళ్లి పేరుపేరునా పలకరించారు. పడిగల ఆనందం వద్దకెళ్లి ‘ఎలా ఉన్నారు? కిష్టన్న బాగున్నడా? ఇక్కడికి రాలేదా?. అందరూ బాగున్నరా’అని అడిగారు. వృద్ధుడైన రాజయ్య వద్దకు వెళ్లి ‘బాగున్నవా? అంతా బాగున్నరా? కోస రాజయ్య ఏం చేస్తుండు?’అని ఆరా తీశారు. గ్రామంలో ఇలా అందరినీ పేరు పేరున పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి తన ఇంటిని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో మొక్కను నాటారు. అక్కడి నుంచి రామాలయాన్ని చూపుతూ మాజీ మంత్రి హరీశ్‌రావుతో చర్చించారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. బాగు చేయండి’అని సూచించారు. గురువు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. శివాలయం వద్దకు వెళ్లి ‘గుడిని మంచిగా కట్టుకుందాం. ఎస్టిమేట్ తయారు చేయండి’అని ఆదేశించారు. అలా నడుస్తూనే గ్రామంలో కలియతిరిగారు. మిత్రులు, పెద్దలు, వృద్ధుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని, ఎన్ని డబ్బులైనా వెనకాడేది లేదని చెప్పారు. గ్రామస్తులు పగలు, పంతాలు వీడి ఒకే కుటుంబంగా ఉండాలని ప్రేమ, ఆప్యాయతలు పంచుకోవాలని సూచించారు. అనంతరం రూ.10 కోట్లతో నిర్మించే బీసీ గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. యూపీఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. మీ చేతిలో పెరిగిన బిడ్డే! – మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు చింతమడక కన్నబిడ్డ, మీ చేతిలో పెరిగిన బిడ్డ.. నేడు రాష్ట్ర ప్రజల కన్నీరు తుడిచే నాయకుడయ్యాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు సాగిన ఉద్యమంలో గ్రామస్తులు ఇచ్చిన స్ఫూర్తే కేసీఆర్ సమర్థ నాయకత్వానికి కారణమన్నారు. ‘రాష్ట్ర సాధనలో భాగంగా నిరాహర దీక్షలో ఉన్న కేసీఆర్ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంటే.. చింతమడక గొల్లుమందన్నారు. ఈ గ్రామం నుంచి పోచయ్య, నారాయణరెడ్డి ఫోన్ చేసి మా బిడ్డ ఎట్లున్నడని అడిగితే నాకు దుఃఖం వచ్చింది’అని హరీశ్‌రావు చెప్పారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఈ ఊళ్లో పొయ్యి వెలిగించకుండా ఉన్న రోజులు గుర్తున్నాయని అన్నారు. అందరు తమ అడ్రస్‌ను పలానా ఊరు అని చెబుతారని, కానీ ఇక్కడి ప్రజలు మాత్రం తమది కేసీఆర్ ఊరని చెప్పడం అందరికి గర్వకారణమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండికూడా కేసీఆర్ ఇక్కడ వ్యవసాయం చేసిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. -
ఊరు రుణం తీర్చుకుంటా
సిద్దిపేట రూరల్: ‘ఏం బాబూ బాగున్నావా..? మన ఊరు ఇప్పటివరకు వెనకబడి ఉంది. నేను ముఖ్యమంత్రిని అయ్యాను. మన ఊరు బాగు చేసుకోవాలి. అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. ఎన్ని నిధులు కావాలన్నా ఇస్తాను. అందరూ బాగుండాలి. ప్రతీ ఇల్లు లబ్ధి పొందాలి. యువత ఏదో ఒక పనిచేసుకుంటూ ఉండాలి. ఖాళీగా ఎవరూ కన్పించొద్దు. అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అధికారులు మన ఊరికి వస్తారు. వారికి చెప్పండి.. అన్నీ సిద్ధం చేసిన తర్వాత నేను వస్తాను. అభివృద్ధి పనులు ప్రారంభిస్తాను, ఊరు రుణం తీర్చుకుంటా’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక సర్పంచ్ హంసకేతన్‌రెడ్డితో బుధవారం ఫోన్లో సంభాషించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళిక తయారు చేయండి ‘ఇంతకాలం ఎవరో పరిపాలించారు.. అప్పుడు మన గ్రామం బాగుపడలేదు. ఇప్పుడు మనమే పవర్లో ఉన్నాం. గ్రామంలోని అందరూ బాగుపడాలి. ఆర్థికంగా ఎదగాలి. అందుకోసం ఏం కావాలో ప్రణాళిక సిద్ధం చేసుకోండి’అని సర్పంచ్‌ను సీఎం ఆదేశించారు. ‘గ్రామంలోని ప్రతీ ఇంటికి రూ.10 లక్షలకు తక్కువ కాకుండా లబ్ధి చేకూరాలి. వారు ధనికులైనా, పేదలైనా.. అలాగే గ్రామంలో లేకుండా వలస వెళ్లినవారైనా సరే. అందరికీ పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరాలి. వారి జీవితాలు బాగుపడాలి. గ్రామంలో పేదవారు అనేవారు ఉండకూడదు’ అని చెప్పారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. అన్నింటి సమాచారాన్ని సేకరించాలని, వారికి ఏవిధమైన సహాయం చేయవచ్చో నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. అలాగే గ్రామంలో రోడ్లు, ఇళ్లు.. ఏయే అభివృద్ధి కార్యక్రమాలు, ఏం పనులు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందో కూడా జాబితాను సిద్ధం చేసి పెట్టుకోవాలని ఆదేశించారు. వలస వెళ్లినవారు తిరిగి రావాలి.. గ్రామంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి ఉపాధి కోసం బర్రెలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఉపాధి లోన్లు.. ఏమి కావాలో అన్నీ సమకూర్చేలా సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్‌కు సూచించారు. బతుకు దెరువు కోసం దేశం విడిచి వెళ్లిన వారు కూడా తిరిగి గ్రామానికి రావాలి. నా ఊరికి నేను పోయి బతుకుతా.. అనే ఆలోచన వచ్చేలా అందరికీ కబురుపెట్టి పిలిపించండి. వారికి ఏం కావాలో ఆడిగి తెలుసుకోవాలని అన్నారు. ‘ట్రాక్టర్లు .. హార్వెస్టర్లు ఏం కావాలన్నా.. ఇద్దాం.. ఇప్పుడైనా ఊరు బాగుచేసుకుందామా..? వద్దా..?’అని సర్పంచ్‌ను సీఎం ప్రశ్నించారు. ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వడమే కాకుండా ఉన్నవారు కూడా వారి స్థలాల్లో మంచి ఇళ్లు కట్టుకునేలా సాయం చేద్దామని అన్నారు. మినీ డెయిరీఫాం, కోళ్ల ఫారాలు, డ్రి‹ప్, స్పింక్లర్లు కావాలనుకునే వారి జాబితా సిద్ధం చేయాలన్నారు. ‘టైం ఉన్నప్పుడే.., అవకాశం ఉన్నప్పుడే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా ఊరును అభివృద్ధి చేయడమే లక్ష్యం. çసమాచారం కోసం ఇంటింటికీ తిరిగి, కులసంఘాలను కలసి సమాచారాన్ని సేకరించి రెండు రోజుల్లో లిస్టు అందించాలి’అని సీఎం పేర్కొన్నారు. పుట్టిన ఊరును అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా. అభివృద్ధి వల్ల నాకు, నీకూ మంచి పేరు వస్తుంది అని సర్పంచ్‌ను ఉద్దేశించి అన్నారు. ‘చింతమడక మొత్తం అభివృద్ధి చెందాలి. అది హంసకేతన్‌రెడ్డి పాలనలో జరిగిందనే పేరు రావాలె. తరతరాలు గుర్తుండిపోతది. సమాచారం మొత్తం సేకరించిన తరువాత మావాళ్లకు ఫోన్ చేస్తే చింతమడకకు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా’అని సీఎం కేసీఆర్ అన్నారు. హామీ మేరకు సొంత ఊరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో సతీసమేతంగా స్వగ్రామం చింతమడక వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో మాట్లాడారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయాలో చర్చించారు. అక్కడ ఉన్నవారు తమ సమస్యలు చెప్పుకోగా, ఊరికి మరోసారి ప్రత్యేకంగా వస్తానని, అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చింతమడక వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇటీవల మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు కలెక్టర్ వెంకట్రామిరెడ్డితోపాటు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్, ఇతర అధికారులు చింతమడకలో మకాం వేసి గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి వారి వారి సమస్యలు తెలుసుకుంటూ. గ్రామాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి, నేరుగా గ్రామ సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడి ఊరు అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. -
చింతమడకలో ఓటేసిన కేసీఆర్
సాక్షి, మెదక్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని తమ స్వగ్రామమైన చింతమడకలో సతీమణి శోభారాణితో కలిసి కేసీఆర్ ఓటు వేశారు. సీఎం రాక సందర్భంగా చింతమడకలో భారీగా బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తో పాటు మాజీమంత్రి హరీష్‌రావు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ జీహెచ్ఎంసీ కమ్యూటీహాల్లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఓటేయాలని అన్నారు. -
ఓటు వేసిన తర్వాత కేసీఆర్ ఏమన్నారు?
సాక్షి, చింతమడక: అధికారం నిలబెట్టుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా చింతమడకలో తన సతీమణితో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయని, భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ప్రభంజనం సృష్టిస్తామని దీమాగా చెప్పారు. ఈసారి పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ‘ప్రభుత్వ అనుకూల పవనాలు చాలా బాగా వీస్తున్నాయి. మేము ముందు నుంచి చెబుతున్నట్టుగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాం. మాకు ఎటువంటి అనుమానం లేదు మళ్లీ ప్రజా అనుకూల ప్రభుత్వమే వస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం మీరే చూస్తారు. ఈసారి పోలింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్‌లో భారీగా పోలింగ్ నమోదవుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార’ని కేసీఆర్ చెప్పారు. -
చింతమడకలో మంత్రి హరీష్‌రావు పర్యటన
సిద్ధిపేట: మండలంలోని చింతమడక గ్రామంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం ఉదయం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు, నూతనంగా నిర్మించనున్న శ్రీ రామాలయ నిర్మాణానికి, ముదిరాజ్ సంఘం మత్స్యకారుల సోసైటీ భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా మంత్రి ప్రారంభించారు.